Telugu Global
CRIME

చిన్నారులను చిదిమేసిన నిర్లక్ష్యం

ఫిట్ నెస్ లేని బస్సు.. పీకల దాకా తాగిన డ్రైవర్ నిర్లక్ష్యం… పాఠశాల యాజమాన్యం అలసత్వం.. వెరసి ముగ్గురు చిన్నారుల ప్రాణాలను బలిగొంది. మూడు కుటుంబాలలో చిచ్చు పెట్టిన ఈ సంఘటన ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శివారులోని తిమ్మాపూర్ లో జరిగింది. వేములవాడ పట్టణంలో వాగేశ్వరి (శ్రీ చైతన్య) పాఠశాల ఉంది. ఈ పాఠశాలకు చెందిన హాస్టల్ మాత్రం దూరంగా తిమ్మాపూర్ లో మరో భవనంలో ఉంది. పాఠశాల హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు మధ్యాహ్నభోజనం కోసం పాఠశాల […]

చిన్నారులను చిదిమేసిన నిర్లక్ష్యం
X

ఫిట్ నెస్ లేని బస్సు.. పీకల దాకా తాగిన డ్రైవర్ నిర్లక్ష్యం… పాఠశాల యాజమాన్యం అలసత్వం.. వెరసి ముగ్గురు చిన్నారుల ప్రాణాలను బలిగొంది. మూడు కుటుంబాలలో చిచ్చు పెట్టిన ఈ సంఘటన ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శివారులోని తిమ్మాపూర్ లో జరిగింది.

వేములవాడ పట్టణంలో వాగేశ్వరి (శ్రీ చైతన్య) పాఠశాల ఉంది. ఈ పాఠశాలకు చెందిన హాస్టల్ మాత్రం దూరంగా తిమ్మాపూర్ లో మరో భవనంలో ఉంది. పాఠశాల హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు మధ్యాహ్నభోజనం కోసం పాఠశాల నుంచి ప్రతిరోజూ హాస్టల్ కు పాఠశాల వాహనంలో వెళ్తుంటారు.

అభం శుభం తెలియని అమాయక చిన్నారులు బుధవారం నాడు కూడా భోజనం చేసేందుకు పాఠశాలకు చెందిన వాహనంలో హాస్టల్ కు బయలుదేరారు. మొత్తం 27 మంది విద్యార్థుల ఆ వాహనం వేములవాడ ఆర్టీసీ డిపో వద్దకు చేరుకోగానే డివైడర్ ను కొట్టుకుని తిరగబడి పోయింది ఆ వ్యాన్.

ఈ సంఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృత్యువాత పడగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ప్రమాదంలో పదవ తరగతి చదువుతున్న మణిచందన రాణి (15), రెండవ తరగతి చదువుతున్న దీక్షిత (6) అక్కడికక్కడే మరణించారు. మిగిలిన విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.

వీరిలో మూడవ తరగతి చదువుతున్న రిషి (7) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ప్రమాదం సంగతి తెలియగానే తల్లిదండ్రులు, బంధువులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ముగ్గురు చిన్నారులు మరణించడం, మరికొందరికి తీవ్ర గాయాలు కావడంతో తల్లిదండ్రులు, బంధువుల ఆర్తనాదాలతో సంఘటనా స్థలం మారుమోగింది.

ఈ ప్రమాదం జరిగే సమయానికి తిమ్మాపూర్ గణేష్ మండపానికి చెందిన కొందరు యువకులు అటుగా వెళ్తున్నారు. వారంతా వాహనం కింద ఉన్న విద్యార్థులను బయటకు తీశారు. దీంతో మృతుల సంఖ్య తగ్గింది. పీకల్లోతు తాగి వాహనం నడుపుతున్న డ్రైవర్ ను యువకులు చితకబాది స్థానిక పోలీసులకు అప్పగించారు.

సంఘటన గురించి తెలిసిన వెంటనే జిల్లాకు చెందిన మంత్రి ఈటెల రాజేందర్, కరీంనగర్ లోక్ సభ సభ్యుడు బండి సంజయ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని, ప్రమాదానికి కారణమైన పాఠశాలపై చర్యలు తీసుకుంటామని మంత్రి ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు.

మరోవైపు విద్యార్థులను తరలించేందుకు ఉపయోగిస్తున్న వాహనానికి ఫిట్ నెస్ లేదని, ఈ విషయం చాలా కాలంగా చెప్తున్నా పాఠశాల యాజమాన్యం మాత్రం పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఆరోపిస్తున్నారు.

ప్రమాదానికి కారణమైన వాహనానికి అనుమతులు లేవని, 15 సీట్లు మాత్రమే ఉన్న వాహనంలో 27 మంది విద్యార్థులను ఎక్కించడమేమిటని డీ.ఈ.ఓ రాధాకిషన్ మండిపడ్డారు. సంఘటన పూర్వాపరాలను తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు మంత్రి ఈటెల రాజేందర్ ని అడిగి తెలుసుకున్నారు.

బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తామని కేటీఆర్ ప్రకటించారు. తక్షణ సాయంగా రెండు లక్షల రూపాయల చెక్కును బాధిత కుటుంబాలకు అందజేశారు. మరోవైపు మంత్రి ఈటల రాజేందర్ అధికారులతోనూ, పాఠశాల యాజమాన్యంతోనూ చర్చలు జరిపారు.

పాఠశాల యాజమాన్యం తరపున మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయల పరిహారం ఇప్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇక వాగేశ్వరి (శ్రీ చైతన్య) పాఠశాల అనుమతులను రద్దు చేస్తున్నట్లుగా డీఈవో రాధాకిషన్ ప్రకటించారు.

First Published:  29 Aug 2019 2:00 AM IST
Next Story