Telugu Global
National

పుకార్లతో పార్టీ నడుపుతారా?- ఏపీ బీజేపీ నేతలపై హైకమాండ్ ఫైర్

ఏపీ బీజేపీ నేతల అత్యుత్సాహం ఆ పార్టీ అగ్రనేతలకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఏపీకి చెందిన కొందరు బీజేపీ పెద్దలు పనిగట్టుకుని వైసీపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తుండడం, సున్నితమైన అంశాల్లో నిజనిజాలతో పనిలేకుండా ఆరోపణలు చేయడం బీజేపీ హైకమాండ్ దృష్టికి వెళ్లింది. ప్రజలను ఆకర్షించేందుకు మత పరమైన అంశాల్లో రెచ్చగొట్టడం ఒకటే మార్గమన్నట్టుగా ఏపీ బీజేపీ బాధ్యతలు చూస్తున్న వారి తీరు ఇటీవల ఉంది. అమెరికాలో జగన్‌ జ్యోతి ప్రజ్వలన చేయలేదనడం, తిరుమల బస్సు టికెట్లపై అన్యమత […]

పుకార్లతో పార్టీ నడుపుతారా?- ఏపీ బీజేపీ నేతలపై హైకమాండ్ ఫైర్
X

ఏపీ బీజేపీ నేతల అత్యుత్సాహం ఆ పార్టీ అగ్రనేతలకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఏపీకి చెందిన కొందరు బీజేపీ పెద్దలు పనిగట్టుకుని వైసీపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తుండడం, సున్నితమైన అంశాల్లో నిజనిజాలతో పనిలేకుండా ఆరోపణలు చేయడం బీజేపీ హైకమాండ్ దృష్టికి వెళ్లింది.

ప్రజలను ఆకర్షించేందుకు మత పరమైన అంశాల్లో రెచ్చగొట్టడం ఒకటే మార్గమన్నట్టుగా ఏపీ బీజేపీ బాధ్యతలు చూస్తున్న వారి తీరు ఇటీవల ఉంది. అమెరికాలో జగన్‌ జ్యోతి ప్రజ్వలన చేయలేదనడం, తిరుమల బస్సు టికెట్లపై అన్యమత ప్రచార ప్రకటనలను చంద్రబాబు హయాంలోనే ముద్రించారన్న విషయం తెలుసుకోకుండా… ప్రస్తుత ప్రభుత్వంపై నిందలు వేయడం.. వివాదాస్పద శ్రీశైలం ఈవోను చంద్రబాబునాయుడు నియమించినా, అతడిపై ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకున్నా సరే బీజేపీ తిరిగి వైసీపీ ప్రభుత్వంపైనే అసత్యప్రచారం చేయడం, మరికొందరు తిరుమలలో సెక్యూరిటీ గార్డుల కోసం ఏర్పాటు చేసిన గదిపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల స్తంభాన్ని శిలువగా ప్రచారం చేయడం వంటి చర్యలకు దిగారు.

జగన్‌ జ్యోతి ప్రజ్వలన, తిరుమల బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం, శ్రీశైలం ఆలయ వివాదం అంశాలను ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేరుగా సోషల్‌ మీడియాలో ప్రశ్నించారు. ఈ అంశాన్ని కొందరు అసలైన బీజేపీ నేతలు ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు.

ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు ఏపీ బీజేపీ పెద్దలు సులువైన మార్గాన్ని ఎంచుకున్నారని… అందులో భాగంగా అబద్దాలను, పుకార్లను అగ్రనేతలే స్వయంగా ప్రచారం చేస్తున్నారని… అదంతా అబద్దం అని తెలిసిన తర్వాత ప్రజలు పార్టీని చీదరించుకుంటున్నారని ఫిర్యాదు చేశారు.

ఇప్పటికే బీజేపీ రాష్ట్రంలో మతపరమైన వివాదాలు రెచ్చగొట్టేందుకు పుకార్లు ప్రచారం చేస్తోందన్న భావన ప్రజల్లో బలపడుతోందని… బీజేపీని ప్రజలు ఒక నెగెటివ్ ఫోర్స్‌గా చూసే పరిస్థితి వచ్చిందని వివరించారు.

బీజేపీలో చేరిన చంద్రబాబు ఆప్తులు కొందరు బీజేపీ ముసుగులో ఈ ప్రచారానికి మరింత ఆజ్యం పోస్తున్నారని వివరించారు. పదవులు కాపాడుకునేందుకు కొందరు బీజేపీ నేతలు అదే పని చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.

దీనిపై బీజేపీ హైకమాండ్ స్పందించింది. ఏపీ బీజేపీలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నేతకు ఫోన్ చేసిన బీజేపీ పెద్దలు… ఈ ప్రచారంపై వివరణ కోరినట్టు చెబుతున్నారు.

ఇలా పుకార్లు ప్రచారం చేసి రాజకీయంగా ఎదగాలనుకోవడం అమాయకత్వమే అవుతుందని…ఇలాంటి పని చేయాలంటే పార్టీకి పెద్దపెద్ద నేతలు అవసరం లేదని… సాధారణ నెటిజన్లు చాలని… ఇకపై ఇలాంటి పుకార్లను ప్రచారం చేయడం మానేసి పార్టీని బలోపేతం చేసేందుకు సొంతంగా ఏదైనా ఆలోచించండి అని… ఏపీ పెద్దకు బీజేపీ ఢిల్లీ పెద్దలు క్లాస్ పీకారట.

పుకార్లను ప్రచారం చేయడం వల్ల వైసీపీ ప్రభుత్వానికి చెడ్డపేరు రావడం ఎలా ఉన్నా…. బీజేపీ విశ్వసనీయత మాత్రం ప్రశ్నార్థం చేసిన వారవుతారని మండిపడ్డారట.

First Published:  29 Aug 2019 2:22 AM IST
Next Story