చిన్నారుల సరదా ఆట... ప్రాణం తీసింది...
వారిద్దరూ అన్నెం, పున్నెం తెలియని చిన్నారులు. అభం, శుభం ఎరుగని పొన్నారులు. హాయిగా ఆటలాడుతూ పెరగాల్సిన బాల్యం. కాని ఆ ఆటే ఆ ఇద్దరు చిన్నారుల్లో ఒకరి ప్రాణం తీసింది. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిందీ విషాదకర సంఘటన. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పుంగనూరులోని ఈస్టుపేట ప్రాథమికోన్నత పాఠశాలలో ఆరేళ్ల హర్షవర్దన్ ఒకటో తరగతి చదువుతున్నాడు. గత బుధవారం నాడు పాఠశాలలో మరో విద్యార్ధితో కలిసి […]
వారిద్దరూ అన్నెం, పున్నెం తెలియని చిన్నారులు. అభం, శుభం ఎరుగని పొన్నారులు. హాయిగా ఆటలాడుతూ పెరగాల్సిన బాల్యం. కాని ఆ ఆటే ఆ ఇద్దరు చిన్నారుల్లో ఒకరి ప్రాణం తీసింది.
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిందీ విషాదకర సంఘటన. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పుంగనూరులోని ఈస్టుపేట ప్రాథమికోన్నత పాఠశాలలో ఆరేళ్ల హర్షవర్దన్ ఒకటో తరగతి చదువుతున్నాడు.
గత బుధవారం నాడు పాఠశాలలో మరో విద్యార్ధితో కలిసి ఆడుకున్నాడు. కొంత సేపటికి హర్షవర్దన్ మరుగుదొడ్డికి వెళ్లాడు. అంతవరకూ హర్షవర్దన్ తో ఆడుకున్న మరో బాలుడు ఆ మరుగుదొడ్డి బయట గొళ్లెం పెట్టి వెళ్లిపోయాడు. అయితే, తాను మరుగుదొడ్డికి గొళ్లెం పెట్టిన విషయం మరిచిపోయాడు మరో చిన్నారి.
మరుగుదొడ్డి లోపల ఉన్న చిన్నారి హర్షవర్దన్ లోపల నుంచి తలుపులు బాదాడు. దాదాపు 20 నిమిషాల తర్వాత ఆ మరుగుదొడ్డి వైపు వెళ్తున్న టీచర్ ఒకరు తలుపులు కొడుతున్న శబ్దాలు విని గొళ్లెం తీసారు. దాదాపు 20 నిమిషాల సేపు మరుగుదొడ్డిలోనే ఉండిపోయిన హర్షవర్దన్ భయకంపితుడయ్యాడు. దీంతో ఇంటికి పంపించేశారు ఉపాధ్యాయులు.
ఇంటికి వెళ్లిన తర్వాత కూడా హర్షవర్దన్ లో భయం పోలేదు. తల్లిదండ్రులు ఎన్ని ధైర్య వచనాలు చెప్పినా ఫలితం లేకపోయింది. పిల్లల మధ్య తిరిగితే కాసింత ధైర్యం తెచ్చుకుంటాడనే ఆశతో ఆగస్టు 15 వ తేదీన పాఠశాలలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కూడా తీసుకువెళ్లారు హర్షవర్దన్ తల్లితండ్రులు. అయినా ఫలితం లేకుంగా పోయింది.
దీంతో స్ధానిక ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. ఇన్ని చేసినా హర్షవర్దన్ లో గూడుకట్టుకున్న భయం నీడలు మాత్రం పోలేదు. ఆదివారం నాడు పట్టణంలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలో చిన్నారి హర్షవర్దన్ కన్ను మూశాడు. ఆ రోజు సాయంత్రమే హర్షవర్దన్ అంత్యక్రియలు కూడా పూర్తి చేసిన తల్లితండ్రులు మరునాడు బంధువులతో కలిసి పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు.
అక్కడ పరిస్థితి విషమించడంతో స్థానిక ఎస్సై అరుణ్ కుమార్ పాఠశాలకు చేరుకుని పరిస్థతిని శాంతింప చేశారు. పిల్లలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యా వాలంటీర్ ను బాధ్యతల నుంచి తొలగించారు. ప్రధానోపాధ్యాయురాలు భారతికి మెమో ఇచ్చారు. హర్షవర్దన్ తల్లికి మధ్యాహ్న భోజన కార్మికురాలిగా ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. చిన్నారి హర్షవర్దన్ తండ్రి రెడ్డప్ప ఆటో డ్రైవర్. వీరికి ఏడాది వయసున్న మరో కుమారుడు కూడా ఉన్నాడు.