Telugu Global
National

గ్రూపులు వీడండి... ప్రజల మనసులు గెలవండి

“తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నానాటికీ ఎదుగుతోంది. 2023 వ సంవత్సరంలో జరగబోయే శాసనసభ ఎన్నికలలో బిజెపి విజయం సాధించి అధికారంలోకి రావాలి. అదొక్కటే మన ముందున్న లక్ష్యం. మీరు గ్రూపులు కట్టడం మానండి. ప్రజల మనసులు గెలవడం ఎలాగో తెలుసుకోండి” ఇది తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులకు అధ్యక్షుడు జే.పీ.నడ్డా పలికిన హితవచనాలు. భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన జాతీయ అధ్యక్షుడు జే.పీ.నడ్డా పార్టీ రాష్ట్ర […]

గ్రూపులు వీడండి... ప్రజల మనసులు గెలవండి
X

“తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నానాటికీ ఎదుగుతోంది. 2023 వ సంవత్సరంలో జరగబోయే శాసనసభ ఎన్నికలలో బిజెపి విజయం సాధించి అధికారంలోకి రావాలి. అదొక్కటే మన ముందున్న లక్ష్యం. మీరు గ్రూపులు కట్టడం మానండి. ప్రజల మనసులు గెలవడం ఎలాగో తెలుసుకోండి” ఇది తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులకు అధ్యక్షుడు జే.పీ.నడ్డా పలికిన హితవచనాలు.

భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన జాతీయ అధ్యక్షుడు జే.పీ.నడ్డా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సీనియర్ నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలుగు రాష్ట్రాలలో అనేకమంది సీనియర్ నాయకులు బీజేపీ వైపు చూస్తున్నారని, ప్రజలు కూడా పార్టీ వైపు చూసేలా నాయకులు అడుగులు వేయాలని సూచించినట్లు సమాచారం.

తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ సీనియర్ నాయకుల మధ్య గ్రూపు తగాదాలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని పార్టీ ఉపేక్షించదని జాతీయ అధ్యక్షుడు జే.పీ.నడ్డా సీరియస్ గా అన్నట్లు తెలిసింది.

పార్టీలోకి ఎవరు వచ్చినా దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకుని ఉన్న నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి అన్యాయం జరగదని, చేరికలపై లేనిపోని అపోహలు పెట్టుకోవద్దని సీనియర్ నేతలతో జే.పీ.నడ్డా చెప్పారు.

తెలంగాణలో కేసీఆర్ వైఖరి పట్ల ప్రజలలో నానాటికి వ్యతిరేకత పెరుగుతున్నట్లుగా తమకు సమాచారం ఉందని, దానిని పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలని పార్టీ సీనియర్ నాయకులకు నడ్డా సూచించినట్లు చెబుతున్నారు.

పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు అని ఇప్పటి నుంచే చర్చలు, వ్యూహాలు రచించాల్సిన అవసరం లేదని, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం.

దశాబ్దాలుగా ఉన్న సీనియర్ నాయకులు వివిధ పార్టీల నుంచి వచ్చి చేరిన వారితో సఖ్యంగా ఉండాలని, వారికి ప్రాధాన్యత ఇస్తూనే పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లడంపై వ్యూహరచన చేయాలని సూచించినట్లు చెబుతున్నారు.

పార్టీ జాతీయ అధ్యక్షుడితో జరిగిన ఈ అంతర్గత సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, పార్టీ సీనియర్ నాయకులు బండారు దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి, చింతా సాంబమూర్తి, మరికొందరు నాయకులు పాల్గొన్నట్టు సమాచారం.

First Published:  19 Aug 2019 4:57 AM IST
Next Story