నాకూ కలలున్నాయి... వాటిని నెరవేర్చాలనే ఆశా ఉంది
“నాకు కలలున్నాయి. సుదూర పాదయాత్రలో ప్రజల కష్టనష్టాలను చూసిన నాకు వారి ఆకాంక్షలను తీర్చాలనే ఆశలూ ఉన్నాయి. వాటని నెరవేర్చడమే నా ముందున్న లక్ష్యం” అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. అమెరికాలో వారం రోజుల పాటు పర్యటిస్తున్న సీఎం జగన్ డల్లాస్ లో ప్రవాసాంధ్రుల సమావేశంలో ప్రసంగించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోకూడదని, వారికి ప్రభుత్వం తరఫున అన్ని విధాల సాయం చేయాలనే కల కంటున్నానని సీఎం జగన్ చెప్పారు. విద్యార్ధులు పై చదువులకు వెళ్లేందుకు […]
“నాకు కలలున్నాయి. సుదూర పాదయాత్రలో ప్రజల కష్టనష్టాలను చూసిన నాకు వారి ఆకాంక్షలను తీర్చాలనే ఆశలూ ఉన్నాయి. వాటని నెరవేర్చడమే నా ముందున్న లక్ష్యం” అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు.
అమెరికాలో వారం రోజుల పాటు పర్యటిస్తున్న సీఎం జగన్ డల్లాస్ లో ప్రవాసాంధ్రుల సమావేశంలో ప్రసంగించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోకూడదని, వారికి ప్రభుత్వం తరఫున అన్ని విధాల సాయం చేయాలనే కల కంటున్నానని సీఎం జగన్ చెప్పారు.
విద్యార్ధులు పై చదువులకు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వమే వారికి అన్ని విధాల సాయం చేయాలనే కలను కూడా కన్నానని సీఎం చెప్పారు.
మహిళలు తమ కాళ్లపై తామే నిలబడి, పురుషులతో సమానంగా అవకాశాలు పొందాలని తాను కల కన్నానన్నారు.
నిరుద్యోగం లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావాలని, అందుకోసం కొత్త పరిశ్రమలు రావాలని, వాటిని తానే తీసుకురావాలని అనేకానేక కలలు కన్నానని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు.
“ప్రభుత్వ, ప్రయివేట్ రంగాలలోను, నామినేటెడ్ పదవుల్లోనూ బడుగు, బలహీన వర్గాల వారికి సమాన ప్రాధాన్యం కల్పించాలని నేను కల కన్నాను. ఆ కలను నెరవేర్చేందుకు నేను నిరంతరం కష్టపడుతున్నాను” అని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో తాను అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ప్రాజెక్టులపై సమీక్ష జరిపానని, అధికారులు చూపించిన లెక్కలు చూసిన తాను ఆశ్చర్యపడిపోయానని జగన్ చెప్పారు.
“ప్రయివేట్ విద్యుత్ సంస్థల నుంచి చాలా ఎక్కువ ధరకు విద్యుత్ ను కొనుగోలు చేసింది గత ప్రభుత్వం. దీనిపై సమీక్షలు చేశాం. వాటిని రీకాల్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నాం. విద్యుత్ ను ప్రభుత్వమే ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తే పరిశ్రమలకు తక్కువ ధరకు ఎలా ఇస్తారు. అలాంటప్పుడు పరిశ్రమలు పెట్టేందుకు ఎవరైనా ముందుకు వస్తారా..?” అని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు.
పారదర్శక పాలనే తమ ముందున్న లక్ష్యమని, ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం వివరాలను ప్రజలకు తెలియజేస్తున్నామని చెప్పారు. తమ ప్రయత్నాలకు ప్రవాసాంధ్రులు చేయూతనివ్వాలని, పెట్టుబడులు పెట్టి రాష్ట్ర్ర ప్రగతికి సహకరించాలని కోరారు.
“ప్రవాసాంధ్రులు సంవత్సరానికి ఒకటి రెండు సార్లు అయినా మీ సొంత రాష్ట్రానికి రండి. మీరు, ప్రభుత్వం కలిసి మీరు చదువుకున్న పాఠశాలను, మీ ఊరిలోని బస్టాండ్ ను, కళాశాలను, ఆసుపత్రులను అభివృద్ధి చేసేందుకు సాయం చేయండి” అని సీఎం జగన్మోహన్ రెడ్ది పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా గతంలో అమెరికాలో పర్యటించిన దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి అమెరికా పర్యటనలో చేసిన ప్రసంగ వీడియోను ప్రదర్శించడం విశేషం.