కేసీఆర్ కు ప్రచారం తప్ప ప్రజా క్షేమం పట్టదు
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ప్రచారం మీద ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమం పట్ల లేదని భారతీయ జనతా పార్టీ జాతీయ జే.పీ.నడ్డా విమర్శించారు. “హరితహారాన్ని కూడా ప్రచారం కోసమే వాడుకుంటున్నారు. ఇంత ప్రచార యావ ఉన్న ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేరు” అని జేపీ నడ్డా మండిపడ్డారు. హైదరాబాదులోని ఎగ్జిబిషన్ మైదానంలో తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు జే.పీ. నడ్డా […]
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ప్రచారం మీద ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమం పట్ల లేదని భారతీయ జనతా పార్టీ జాతీయ జే.పీ.నడ్డా విమర్శించారు.
“హరితహారాన్ని కూడా ప్రచారం కోసమే వాడుకుంటున్నారు. ఇంత ప్రచార యావ ఉన్న ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేరు” అని జేపీ నడ్డా మండిపడ్డారు.
హైదరాబాదులోని ఎగ్జిబిషన్ మైదానంలో తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు జే.పీ. నడ్డా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో బాగుపడింది కేసీఆర్ కుటుంబం మాత్రమేనని, తెలంగాణ ప్రజలు మాత్రం కష్టాల్లోనే ఉన్నారని ఆయన అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టును మూడు రెట్లకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని, పవిత్రమైన ఆ పేరునే చెడగొట్టారని నడ్డా విమర్శించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందో, రాచరిక వ్యవస్థ నడుస్తోందో తనకు అర్థం కావడం లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వంలో మహిళలకు మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించాలని జే.పీ.నడ్డా డిమాండ్ చేశారు.
“ముఖ్యమంత్రి కేసీఆర్ పై నేను వ్యక్తిగత విమర్శలు చేయను. కానీ ఆయనకు కుడిచేతితో ఇచ్చి ఎడమచేతితో తీసుకునే అలవాటు ఉంది. అందుకే తెలంగాణ రాష్ట్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది” అని నడ్డా తీవ్రంగా మండిపడ్డారు.
విభజన చట్టంలో లేకపోయినా తెలంగాణకు కేంద్రం ఎయిమ్స్ ఇచ్చిందని, ప్రధాని ఆవాస్ యోజన కింద ఇళ్లు మంజూరు చేస్తే కేసీఆర్ వాటిని కూడా వాడుకోలేదని నడ్డా ఆరోపించారు.
ఈ బహిరంగ సభలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ సైతం ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ గా ప్రసంగించారు. తెలంగాణకు న్యాయం చేయలేని వారు రాయలసీమను రతనాల సీమగా చేస్తున్నట్టు ప్రకటనలు చేస్తున్నారని, ఇది తెలంగాణ ప్రజలను అవమానించడమేనని డాక్టర్ లక్ష్మణ్ అన్నారు.
“తల్లికి మట్టిగాజులు ఇవ్వలేదు గాని పినతల్లికి బంగారు గాజులు ఇస్తానంటున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్” అని డాక్టర్ లక్ష్మణ్ మండిపడ్డారు.
ముఖ్యమంత్రిగా ఒక్కసారి కూడా సచివాలయానికి వెళ్ళని కేసీఆర్ అక్కడ వాస్తు బాగోలేదంటూ ఆ భవనాలను కూల్చి వేస్తామనడం దారుణమన్నారు.
ఈ బహిరంగ సభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ, ఇటీవలే బీజేపీలో చేరిన సుజనా చౌదరి, సీఎం రమేష్, పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొందరు బీజేపీలో చేరారు.