రండి... పెట్టుబడులకు స్వర్గధామం ఏపీ
అమెరికాలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పర్యటన బిజీబిజీగా సాగుతోంది. అమెరికాలో అడుగుపెట్టిన ఆయన ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా పలువురితో సమావేశమవుతున్నారు. ఇందులో భాగంగా యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో అమెరికన్ పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూసే బాధ్యత తమదేనని ఆయన హమీ ఇచ్చారు. “పరిశ్రమలు స్థాపించాలనుకునే వారికి ఎలాంటి ఇబ్బందులు రావు. ఒక్క దరఖాస్తు చేయండి. […]
అమెరికాలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పర్యటన బిజీబిజీగా సాగుతోంది. అమెరికాలో అడుగుపెట్టిన ఆయన ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా పలువురితో సమావేశమవుతున్నారు.
ఇందులో భాగంగా యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో అమెరికన్ పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూసే బాధ్యత తమదేనని ఆయన హమీ ఇచ్చారు.
“పరిశ్రమలు స్థాపించాలనుకునే వారికి ఎలాంటి ఇబ్బందులు రావు. ఒక్క దరఖాస్తు చేయండి. మిగిలిన అన్ని పనులు ప్రభుత్వమే చూసుకుంటుంది. మీరు ఊహించిన దానికంటే తక్కువ సమయంలోనే అనుమతులు వచ్చేలా చేస్తాం” అని ముఖ్యమంత్రి అమెరికాలోని పారిశ్రామికవేత్తలకు హామీ ఇచ్చారు.
పరిశ్రమల స్ధాపనకు అవసరమైన భూమి కేటాయింపు, విద్యుత్, నీటి సరఫరా వంటి అన్ని పనులు తామే త్వరగా పూర్తి చేస్తామని, వీటి కోసం ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని సీఎం సమావేశంలో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ స్థిరీకరణ, నదుల అనుసంధానం, వ్యవసాయ రంగంలో పరిశోధనలు చేస్తున్నామని, ఈ చర్యలు పారిశ్రామిక వేత్తలకు ఎంతో మేలు చేస్తాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. మెట్రోరైలు, బకింగ్ హామ్ కాల్వ పునరుద్ధరణ, ఎలక్ట్రికల్ బస్సుల ఏర్పాటు వంటివి చేపడతామని ఆయన చెప్పారు.
వ్యవసాయ, ఆక్వా ఉత్పత్తుల మార్కెటింగ్ లో ఆంధ్రప్రదేశ్ లో అపార అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. తమకు కేంద్రంతోను, పొరుగు రాష్ట్రాలతోను మంచి స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని, వారి సహాయ సహకారాలు తమకు మేలు చేస్తాయని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు.
ఈ సమావేశంలో పాల్గొన్న భారత రాయబారి హర్షవర్దన్ మాట్లాడుతూ…. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో అనువైనదని, విశాల సమద్రతీరం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. ఈ సమావేశంలో పలువురు అమెరికన్ వ్యాపారవేత్తలతో పాటు అక్కడ పలు వ్యాపారాల్లో స్థిరపడ్డ తెలుగు వారూ పాల్గొన్నారు.