Telugu Global
NEWS

సీమలో కరువు రక్కసి... కడప జిల్లాలో 10 శాతమే సాగు

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. శ్రీశైలం, నాగార్జున సాగర్‌తో పాటు బేసిన్‌లోని అన్ని ప్రాజెక్టులు నిండిపోయి జలాలు సముద్రాన్ని తాకాయి. ఇది ఒక ఎత్తు. కానీ నదికి పక్కనే ఉన్న రాయలసీమ ప్రాంతం మాత్రం పూర్తి కరువులో చిక్కుకుంది. అనంతపురం, కడప జిల్లాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఇప్పటి వరకు ఈ రెండు జిల్లాల్లో ఒక పదును కూడా వర్షం పడని ప్రాంతాలు చాలా ఉన్నాయి. మహావృక్ష్యాలు కూడా ఎండిపోతున్నాయి. బావులు, […]

సీమలో కరువు రక్కసి... కడప జిల్లాలో 10 శాతమే సాగు
X

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. శ్రీశైలం, నాగార్జున సాగర్‌తో పాటు బేసిన్‌లోని అన్ని ప్రాజెక్టులు నిండిపోయి జలాలు సముద్రాన్ని తాకాయి. ఇది ఒక ఎత్తు.

కానీ నదికి పక్కనే ఉన్న రాయలసీమ ప్రాంతం మాత్రం పూర్తి కరువులో చిక్కుకుంది. అనంతపురం, కడప జిల్లాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఇప్పటి వరకు ఈ రెండు జిల్లాల్లో ఒక పదును కూడా వర్షం పడని ప్రాంతాలు చాలా ఉన్నాయి. మహావృక్ష్యాలు కూడా ఎండిపోతున్నాయి. బావులు, బోర్లు ఎండిపోయాయి. ఈసారి రైతులు విత్తనం కూడా వేయలేదు.

ప్రస్తుతం రాయలసీమ జిల్లాల భవిష్యత్తు, దాహార్తి తీరడం అన్నది కేవలం కాలువల నుంచి వచ్చే నీటిపైనే ఆధారపడింది ఉంది. నదీ జలాలను తక్షణం గ్రామాలకు తరలించకపోతే ఈ ఏడాది చాలా గ్రామాల్లో తాగునీరు లేక ప్రజలు ఊర్లు వదిలి వెళ్లక మరో దారి లేదు.

కడప జిల్లా వ్యాప్తంగా సాధారణ సాగు విస్తీర్ణంలో ఇప్పటి వరకు కేవలం 10.1 శాతం మాత్రమే ఈ ఏడాది సాగులోకి వచ్చింది. 90 శాతం పొలాలు బీడుగానే ఉన్నాయి. అనంతపురం జిల్లాల్లో 28.7 శాతం విస్తీర్ణంలో మాత్రమే సాగు జరిగింది. కర్నూలులో 54.6 శాతం, చిత్తూరు జిల్లాలో 69. 7 శాతం విస్తీర్ణం సాగులోకి వచ్చింది.

అనంతపురం జిల్లా, కడప జిల్లాల్లో మాత్రం పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అనంతపురం జిల్లాల్లో ప్రసిద్ధి చెందిన తిమ్మమ్మ మర్రిమాను కూడా వర్షం లేక, భూమిలో తేమ పూర్తిగా ఎండిపోవడంతో కొద్దిరోజుల క్రితం వాడు ముఖం వేసింది. దాంతో స్థానికులు ట్యాంకర్ల సాయంలో నీటిని తరలించి మర్రిమానుకు పోయడంతో ఇప్పుడు కాస్త తేరుకుంది.

రాయలసీమలో అస్సలు వర్షం పడని చోట రైతులు విత్తనం వేయలేదు. దాంతో వారికి విత్తనం ఖర్చు మిగిలింది. విత్తనం వేసిన వారు మరింత నష్టపోయారు. ప్రస్తుతం అనంతపురం జిల్లాల్లోని చాలా గ్రామాలు సాగునీటి సంగతి పక్కనపెట్టి… ఈసారి తాగునీటి సంగతేంటని ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు వచ్చిన నేపథ్యంలో…. కాలువల ద్వారా చెరువులకు అందించి ఆదుకుంటే తప్పించి ఈసారి సీమ జిల్లాలు గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదు.

First Published:  15 Aug 2019 10:40 AM GMT
Next Story