ఓటమినుంచి టీడీపీ కోలుకున్నట్లు నటిస్తోందా?
ఓటమి అవమానం నుంచి బయట పడటానికి టిడిపి ప్రయత్నిస్తుంటే, మరో పక్క తెలుగు తమ్ముళ్ళు అలకలతో, గోడ దూకే పనిలో ఉన్నారు. దీంతో ఇప్పుడు టిడిపి పెద్ద సంక్షోభం లోకి పోతున్నదా అనిపిస్తుంది. వైసిపి అధికారంలోకి వచ్చి రెండు నెలలు మాత్రమే అయినా, టిడిపి నెల రోజుల నుంచే ఎదురుదాడి చేస్తూ ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్నది. ఓటమి అవమానం నుంచి త్వరగానే కోలుకున్నామని సిగ్నల్స్ ఇవ్వడానికే టిడిపి ఇలా వ్యవహరిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మంగళవారం […]
ఓటమి అవమానం నుంచి బయట పడటానికి టిడిపి ప్రయత్నిస్తుంటే, మరో పక్క తెలుగు తమ్ముళ్ళు అలకలతో, గోడ దూకే పనిలో ఉన్నారు. దీంతో ఇప్పుడు టిడిపి పెద్ద సంక్షోభం లోకి పోతున్నదా అనిపిస్తుంది.
వైసిపి అధికారంలోకి వచ్చి రెండు నెలలు మాత్రమే అయినా, టిడిపి నెల రోజుల నుంచే ఎదురుదాడి చేస్తూ ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్నది. ఓటమి అవమానం నుంచి త్వరగానే కోలుకున్నామని సిగ్నల్స్ ఇవ్వడానికే టిడిపి ఇలా వ్యవహరిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
మంగళవారం తెలుగుదేశం పార్టీ విస్తృత సమావేశంలో సుదీర్ఘంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఓడిపోయాం కాబట్టి ఇంకా కొంత టైం తీసుకుంటామని అనుకుంటున్నారేమో… ఇప్పటికే కోలుకున్నట్లు చెప్పుకొచ్చారు. మనల్ని మనం కాపాడుకుంటూనే ప్రజల సమస్యలపై పనిచేయవలసిన అవసరం ఉందని పార్టీనాయకులను ఉద్దేశించి అన్నారు.
ఓటమి అవమానం నుండి ఇంకా కోలుకోలేదని ఆయన మాటలు చెప్పకనే చెబుతున్నాయి. మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు పార్టీలో అంతకంతకు సంక్షోభం ముదురుతున్న దాఖలాలు కనబడుతున్నాయి. విజయవాడలో జరిగిన పార్టీ విస్తృత సమావేశానికి పలువురు డుమ్మా కొట్టడం, కొందరు ఘాటైన విమర్శలు చేయడం ఇందుకు నిదర్శనం.
విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈ సమావేశానికి రాలేదు. కేశినేని నానికి బుద్ధ వెంకన్న కు మధ్య ఇప్పుడు కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేశినేని బిల్డింగ్ లో ఉన్న అర్బన్ పార్టీ కార్యాలయాన్ని అక్కడినుంచి వేరే చోటికి తరలించారు. దీంతో కేశినేని తీవ్రంగా మనస్థాపానికి గురయ్యాడని అంటున్నారు.
మరో కీలక నాయకుడు గంటా శ్రీనివాస్ కూడా సమావేశానికి గైర్హాజర్ అయ్యారు. పి ఏ సి చైర్మన్ పదవి ఆయనకు ఇవ్వకపోవడంతో శ్రీనివాస్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు బుచ్చయ్య చౌదరి వంటి సీనియర్ నాయకులు ఘాటుగా వ్యాఖ్యలు చేయడం గమనించదగిన విషయం. పార్టీలో కొత్త చైతన్యం నింపాలంటే యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన అన్నారు. అట్లాగని కొడుకు, అల్లుడు, తమ్ముడు వంటి వాళ్లకు పార్టీ పదవులు కట్టబెట్టటం కరెక్ట్ కాదని, పార్టీని జిల్లాల్లోనూ, నియోజకవర్గాల్లోనూ ఎఫెక్టివ్ గా ముందుకు తీసుకు పోగలిగిన యువకులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన అన్నారు.
“పదవులు తీసుకుంటారు. పని చేయరు, ప్రజల్లోకి వెళ్లరు. పార్టీ యంత్రాంగం ఫెయిల్ అయింది. మంత్రులు ఫెయిల్ అయ్యారు” అంటూ ఇంత ఘోర పరాజయం రావడానికి కారణాలు ఇవే అని తేల్చారు.
పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు ఆల్ ఈజ్ వెల్ అంటుంటే, ఈ నాయకులు ఏమో అసంతృప్తితో, బాధతో… ఎవరికి తోచినట్లు వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. దీన్నిబట్టి ఏమర్థమవుతుంది? ఇప్పట్లో టీడిపి కోలుకోలేదనేగా? కోలుకున్నట్లు నటిస్తున్నదనేగా?