బిడ్డను కనడానికి 6కి.మీ నడిచిన కశ్మీరీ గర్భిణి
ఆరోజు ఆగస్టు 8, గురువారం. కాశ్మీరీలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిపిన రోజు. ఆ ప్రదర్శనలు హింసాత్మకంగా మారి జనాలు గాయాలపాలై భీతావహ పరిస్థితి ఉన్న రోజు. అటువంటి రోజు తెల తెలవారుతుండగానే ఓ నిండు గర్భిణికి పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. 26 ఏళ్ల ఇన్షా కి అది మొదటి కానుపు. కనడానికి పుట్టింటికొచ్చి వుంది. తల్లి, చెల్లి వారి ఇంటికి దగ్గరలోనే ఉన్న ఒక ఆటో రిక్షా ఉన్న ఇంటికి వెళ్లి ఆటో మాట్లాడుకుని ఆస్పత్రి […]
ఆరోజు ఆగస్టు 8, గురువారం. కాశ్మీరీలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిపిన రోజు. ఆ ప్రదర్శనలు హింసాత్మకంగా మారి జనాలు గాయాలపాలై భీతావహ పరిస్థితి ఉన్న రోజు. అటువంటి రోజు తెల తెలవారుతుండగానే ఓ నిండు గర్భిణికి పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి.
26 ఏళ్ల ఇన్షా కి అది మొదటి కానుపు. కనడానికి పుట్టింటికొచ్చి వుంది. తల్లి, చెల్లి వారి ఇంటికి దగ్గరలోనే ఉన్న ఒక ఆటో రిక్షా ఉన్న ఇంటికి వెళ్లి ఆటో మాట్లాడుకుని ఆస్పత్రి కి బయలుదేరారు. కానీ నాలుగు అడుగులు పోగానే భద్రతా సిబ్బంది వాళ్లను ఆపేశారు. ఏ వాహనాన్ని అనుమతించవద్దని గట్టిగా ఆర్డర్లు ఉన్నాయని, కాబట్టి అడ్డదారిన నడిచి వెళ్ళ వలసిందని భద్రతా దళాలు సలహా ఇచ్చాయి. ఎంత అర్జెంట్ అన్నా ఎవరూపట్టించుకోలేదు.
చేసేదిలేక ఆ కుటుంబం ఆ నిండు గర్భవతిని ఆటో నుంచి దించి నడిపించడం ప్రారంభించింది. వారు చేరాలనుకున్న ఆస్పత్రి లాల్ దేడ్ ఆస్పత్రి. అది చాలా దూరం. ప్రతి ఐదు వందల అడుగులకు ఒక సెక్యూరిటీ పాయింట్ ఉండటంతో.. అన్నిచోట్ల ఇన్షా తన గోడు వెళ్లబోసుకుంటూ ముందుకు సాగింది.
అలా ఉదయం ఐదున్నర గంటలకు ప్రారంభమైన ఆమె నడక 11 గంటల వరకు కొనసాగుతూనే ఉంది. అప్పటికి ఆమె ఆరు కిలోమీటర్లు నెప్పులు భరిస్తూ నడిచింది. ఇంకా కొద్ది దూరం నడిస్తే చేరవలసిన ఆస్పత్రి వస్తుంది. కానీ ఇంతలోనే ఆమెకు పెద్ద ఎత్తున పురుటి నొప్పులు ఎక్కువయ్యాయి.
ఆ క్షణంలో ఆమె రోడ్డుపైనే ప్రసవించే పరిస్థితి ఏర్పడింది. ఈ స్థితిలో అక్కడే అందుబాటులో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమెను చేర్చారు. ఆస్పత్రిలో చేరిన 15 నిమిషాల్లో ఓ పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది ఇన్షా. పుట్టిన పాపను చుట్టటానికి వస్త్రాలు అందుబాటులో లేవు.
“నా మనవరాలిని నా చేతుల్లోకి తీసుకొని నా స్కార్ఫ్ ని ఆమెకు చుట్టాన” ని అక్కడి దైన్య స్థితిని వివరించింది అమ్మమ్మ ముబీనా. ఈ లోపు ఇన్షా సోదరి నీషా బయటికి వెళ్లి ఒక గంటలో ఏదో విధంగా కొన్ని బట్టలు తీసుకువచ్చింది.
ఇక ఇన్షా భర్త కు ఈ సంగతులు ఏవీ తెలియవు. అతడు ఆటో డ్రైవర్. అతడికి తెలియజేయాలన్నా ఎటువంటి సదుపాయం లేదు. సెల్ ఫోన్, ఇంటర్నెట్ వంటి సమాచార సాధనాలన్నింటిపై నిషేధం ఉంది. అందువల్లే అతడికి కూతురు పుట్టింది అన్న సంగతిని కూడా తెలియజేయ లేకపోయారు.
బిడ్డకి జన్మ నివ్వడానికి ఓ కాబోయే తల్లి ఎంత శారీరక శ్రమ కి, మానసిక వేదనకు గురయ్యిందో కదా..!