పరిశ్రమలు రావాలి... పర్యావరణం బాగుండాలి
రాష్ట్రాభివృద్ధికి పరిశ్రమలు భారీగా రావాలని, వాటితో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా జరగాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. “పరిశ్రమలు వచ్చినంత మాత్రాన పని పూర్తయినట్లు కాదు. ఆ పరిశ్రమల వల్ల పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది” అని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పరిశ్రమలు, వాణిజ్య విభాగానికి చెందిన ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కొత్తగా నెలకొల్పుతున్న పరిశ్రమలలో స్థానికులకు […]
రాష్ట్రాభివృద్ధికి పరిశ్రమలు భారీగా రావాలని, వాటితో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా జరగాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.
“పరిశ్రమలు వచ్చినంత మాత్రాన పని పూర్తయినట్లు కాదు. ఆ పరిశ్రమల వల్ల పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది” అని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పరిశ్రమలు, వాణిజ్య విభాగానికి చెందిన ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కొత్తగా నెలకొల్పుతున్న పరిశ్రమలలో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు వచ్చేలా చూడాల్సిన బాధ్యత తమపైనే ఉందని ముఖ్యమంత్రి అధికారులతో అన్నారు. పారిశ్రామికవేత్తలకు వారి అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన స్థానిక యువతను అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
రాష్ట్రంలో మానవ వనరులను అభివృద్ధి చేసేందుకు 25 ఇంజనీరింగ్ కళాశాలలను గుర్తించాలని, ఆయా కళాశాలల్లో వివిధ నైపుణ్యాలకు సంబంధించి విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో తాము చేపట్టిన పరిశ్రమలకు సంబంధించి ప్రభుత్వపరంగా యాజమాన్యాలకు స్పష్టత ఇవ్వాలని, ఎలాంటి అనుమతులైనా తక్కువ వ్యవధిలో మంజూరుచేయాలని అధికారులను కోరారు.
పరిశ్రమల స్థాపనపై కొత్త పాలసీని రూపొందించాలని, ఈ నూతన పాలసీ ద్వారా పరిశ్రమల యజమానులకు, ప్రజలకు, ప్రభుత్వానికి కూడా మేలు జరగాలని జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. ఫార్మా కంపెనీల ద్వారా వచ్చే కాలుష్యాన్ని నియంత్రించేందుకు పరిశ్రమల స్థాపనకు ముందే చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు. ఈ సమావేశంలో ఆయా శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు.