Telugu Global
NEWS

నదుల అనుసంధానం కాదు.... నిధుల అనుసంధానం కావాలి

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నదుల అనుసంధానం కావాలంటూ ప్రకటనలు చేసేవారని, నిజానికి అనుసంధానం కావాల్సింది నదులు కాదని, నిధులని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు. “నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తికి ప్రజలకు ఏం కావాలో తెలియదు. నదుల అనుసంధానానికి ముందు నిధులు అనుసంధానం అయితే అన్ని పథకాలు ఆటంకం లేకుండా ముందుకు వెళ్తాయి” అని మంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు. విజయనగరం జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న […]

నదుల అనుసంధానం కాదు.... నిధుల అనుసంధానం కావాలి
X

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నదుల అనుసంధానం కావాలంటూ ప్రకటనలు చేసేవారని, నిజానికి అనుసంధానం కావాల్సింది నదులు కాదని, నిధులని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు.

“నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తికి ప్రజలకు ఏం కావాలో తెలియదు. నదుల అనుసంధానానికి ముందు నిధులు అనుసంధానం అయితే అన్ని పథకాలు ఆటంకం లేకుండా ముందుకు వెళ్తాయి” అని మంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు.

విజయనగరం జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి బొత్సా సత్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ…. గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో అవినీతే ప్రధానంగా పనిచేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవినీతి రహిత పాలన ఎలా ఉంటుందో చూపిస్తోందని అన్నారు.

“పారదర్శక పాలనకు ప్రతీక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన. దీనిని చూసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓర్వలేక పోతున్నారు” అని మంత్రి బొత్స అన్నారు.

చంద్రబాబు నాయుడి పాలనలో గడచిన ఐదేళ్లలో రాష్ట్ర్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయని, హత్యలు, దోపిడీలు పెరిగాయని బొత్సా అన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా ప్రకృతి కూడా ఆయనకు సహకరించలేదని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే వర్షాలు కురుస్తున్నాయని, రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తోందని మంత్రి బొత్సా అన్నారు.

“జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ప్రకృతి కూడా పులకరించింది. రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులూ ఒక్క చినుకూ లేదు” అని మంత్రి అన్నారు.

పేదలకు అన్నం పెట్టాల్సిన అన్న క్యాంటీన్లలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల అవినీతి పతాక స్ధాయికి చేరిందని, తమ ప్రభుత్వం పేదలకు కడుపునిండా అన్నం పెట్టే క్యాంటీన్లను త్వరలోనే ప్రారంభిస్తుందని మంత్రి బొత్సా చెప్పారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు ప్రచారానికే ప్రాధాన్యం ఇచ్చారని, పేదలకు కావాల్సిన కనీస అవసరాలను కూడా తీర్చలేకపోయారని బొత్సా దుయ్యబట్టారు.

First Published:  14 Aug 2019 2:03 AM IST
Next Story