ఆందోళనలో జమ్ముకశ్మీర్ బీజేపీ
ఆర్టికల్ 370 రద్దుతో బీజేపీ పండుగ చేసుకున్నా… ఇప్పుడు దాని పర్యవసానాలపై ఆ పార్టీలో తర్జనభర్జన నడుస్తోంది. ముఖ్యంగా జమ్ముకశ్మీర్‌ను విభజించిన నేపథ్యంలో…. అక్కడ ఎన్నికలు జరిగితే ఫలితం ఎలా ఉంటుంది అన్నది బీజేపీ నేతలను ఆందోళనకు గురి చేస్తోంది. తమను కేంద్రం మోసం చేసిందని… తమకు సంక్రమించిన ప్రత్యేక హక్కులను, రక్షణ ఏర్పాట్లను బీజేపీ సర్కార్ బలవంతంగా లాగేసుకుందన్న భావన అక్కడి ప్రజల్లో బలంగా నాటుకుపోతోంది. ఈ విషయంలో అక్కడి రాజకీయ పార్టీలన్నీ ఒకే అభిప్రాయంతో […]
ఆర్టికల్ 370 రద్దుతో బీజేపీ పండుగ చేసుకున్నా… ఇప్పుడు దాని పర్యవసానాలపై ఆ పార్టీలో తర్జనభర్జన నడుస్తోంది.
ముఖ్యంగా జమ్ముకశ్మీర్‌ను విభజించిన నేపథ్యంలో…. అక్కడ ఎన్నికలు జరిగితే ఫలితం ఎలా ఉంటుంది అన్నది బీజేపీ నేతలను ఆందోళనకు గురి చేస్తోంది. తమను కేంద్రం మోసం చేసిందని… తమకు సంక్రమించిన ప్రత్యేక హక్కులను, రక్షణ ఏర్పాట్లను బీజేపీ సర్కార్ బలవంతంగా లాగేసుకుందన్న భావన అక్కడి ప్రజల్లో బలంగా నాటుకుపోతోంది.
ఈ విషయంలో అక్కడి రాజకీయ పార్టీలన్నీ ఒకే అభిప్రాయంతో ఉండడంతో కశ్మీర్ ప్రజలు బీజేపీ పట్ల సానుకూలంగా లేరు. పైగా కశ్మీర్ భూములపై బీజేపీ పెద్దలు ప్రకటనలు చేస్తుండడం, కశ్మీర్ అమ్మాయిలను ఇకపై పెళ్లిళ్లు చేసుకోవచ్చంటూ బీజేపీ ముఖ్యమంత్రులే వ్యాఖ్యలు చేస్తుండడం కశ్మీర్ ప్రజల మనసును మరింత గాయపరుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే బీజేపీకి గట్టి దెబ్బ ఖాయమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
ఇంతచేసి అక్కడ ఎన్నికల్లో ఓడిపోతే … కశ్మీర్ ప్రజల అభిప్రాయాలతో సంబంధం లేకుండానే భారత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందన్న సంకేతాలు ప్రపంచానికి వెళ్తాయని కమలనాథులు ఆందోళన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో కశ్మీర్ ప్రజలను దువ్వేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఆర్టికల్ 370 రద్దు అయినప్పటికీ ఇక్కడి భూములకు రక్షణ కల్పించేందుకు అసెంబ్లీకి అధికారాలు కట్టబెడుతామని బీజేపీ కశ్మీర్ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఉద్యోగాలు కూడా స్థానికులలే దక్కేలా నిర్ణయం తీసుకునే అధికారం కశ్మీర్ అసెంబ్లీకే కట్టబెడుతామంటున్నారు.
ఈ మేరకు ఇప్పటికే బీజేపీ అధికార ప్రతినిధులు వరుసగా ప్రకటనలు చేస్తున్నారు. అయితే తమను నిర్బంధంలో ఉంచి నిర్ణయాలు తీసుకున్నారన్న కోపంతో ఉన్న కశ్మీర్ ప్రజలపై బీజేపీ కొత్త రాగం పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని భావిస్తున్నారు.