మోదీకి పెరుగుతున్న హిందూత్వ మద్దతు
ఒక్క నిర్ణయం. ఒక్క సంతకం. ఒక్క తెగింపు. ఆయన్ని బలవంతుడ్ని చేసింది. ఆయన్ని తిరుగులేని నాయకుడిగా నిలబెట్టింది. ఆయన దూకుడిని ఇన్నాళ్లూ ఎండగట్టేందుకు అవకాశం కోసం ఎదురు చూసిన వారికి కూడా ఆ నిర్ణయంతో నోరు పెగలడం లేదు. ఇదంతా ఎవరి గురించి… ఆయన చేసిన ఘనకార్యం ఏమిటీ అనుకుంటున్నారా.. ఇంకెవరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి. ఆయన కశ్మీర్ పై తీసుకున్న నిర్ణయం గురించి. గత కొంతకాలంగా ప్రధాని నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ […]
ఒక్క నిర్ణయం. ఒక్క సంతకం. ఒక్క తెగింపు. ఆయన్ని బలవంతుడ్ని చేసింది. ఆయన్ని తిరుగులేని నాయకుడిగా నిలబెట్టింది. ఆయన దూకుడిని ఇన్నాళ్లూ ఎండగట్టేందుకు అవకాశం కోసం ఎదురు చూసిన వారికి కూడా ఆ నిర్ణయంతో నోరు పెగలడం లేదు.
ఇదంతా ఎవరి గురించి… ఆయన చేసిన ఘనకార్యం ఏమిటీ అనుకుంటున్నారా.. ఇంకెవరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి. ఆయన కశ్మీర్ పై తీసుకున్న నిర్ణయం గురించి.
గత కొంతకాలంగా ప్రధాని నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్ షా తీసుకుంటున్న నిర్ణయాలపై ఆర్ ఎస్ ఎస్ తో సహా హిందూత్వ సంస్ధలన్నీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా హిందూత్వ సంస్ధల కార్యకలాపాల్లో వారిద్దరు వేలు పెట్టడం, బీజేపీ మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ను సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకోవడం వారి ఆగ్రహానికి కారణమవుతోంది.
దేశవ్యాప్తంగా సిద్ధాంతాలతో సంబంధం లేకుండా ఎవరిని పడితే వారిని పార్టీలో చేర్చుకోవడం కూడా ఆర్ ఎస్ ఎస్ ఆగ్రహానికి కారణమైంది. ఇదే విషయంపై శివసేన కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు కశ్మీర్ లో ఆర్టికల్ 370, 37 ఏ రద్దు నిర్ణయాలు తీసుకోవడంతో మోదీపైనా, అమిత్ షాపైనా హిందూత్వ సంస్థలు ఎనలేని ప్రేమను కనబరుస్తున్నాయి.
లోక్ సభ ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ, అమిత్ షాలపై ఆర్ ఎస్ ఎస్ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒక దశలో ఎన్నికలలో బొటాబొటీ మెజార్టీ వస్తే ప్రధాని అభ్యర్ధిని మారుస్తారనే వార్తలు కూడా వచ్చాయి. ప్రధానిగా ఆర్ ఎస్ ఎస్ అనుయాయుల పేర్లను కూడా ప్రచారం చేశారు.
ఇక ఎన్నికల్లో అప్రతిహత విజయం దక్కడంతో ఆర్ ఎస్ ఎస్ పెద్దలతో పాటు ఇతర హిందూత్వ సంస్ధలకు చెందిన వారు కూడా కిమ్మనకుండా ప్రధానిగా నరేంద్ర మోడీనే అంగీకరించాల్సి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీని పటిష్ట పరచడం కోసం ఇతర పార్టీలలో వారిని ఆహ్వనించడం, కర్నాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చడం వంటివి ఆర్ ఎస్ ఎస్, హిందూత్వ సంస్థలకు మింగుడు పడలేదు. మరోసారి ప్రధానిపై వీరు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
అయితే తాజాగా కశ్మీర్ పై తీసుకున్న నిర్ణయంతో హిందూత్వ సంస్ధలు అనివార్యంగా ప్రధాని నరేంద్ర మోదీని, హోం మంత్రి అమిత్ షాలను ఆకాశానికి ఎత్తివేయక తప్పని పరిస్థితి ఎదురైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.