గెలువు-గెలిపించు.... అన్నదే మా సిద్ధాంతం
పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌లో అపారమైన అవకాశాలున్నాయన్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. విజయవాడలో జరిగిన డిప్లొమాటిక్ ఔట్‌రీచ్ కార్యక్రమంలో ప్రసంగించిన జగన్… 972 కిలోమీటర్ల సుధీర్ఘమైన తీరం ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌కు సొంతమని జగన్ వివరించారు. 151 ఎమ్మెల్యేలతో ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత సుస్థిరమైన ప్రభుత్వం ఉందన్నారు. అవినీతి రహితమైన పాలన ఏపీలో ఉందన్నారు. పూర్తి పారదర్శకతతో తమ ప్రభుత్వం పెట్టుబడులను ఆహ్వానిస్తోందన్నారు. టెండర్ల పక్రియ నుంచి కేటాయింపుల వరకు అన్నీ కూడా అవినీతిరహితంగానే ఉంటాయని హామీ ఇచ్చారు. […]
పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌లో అపారమైన అవకాశాలున్నాయన్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. విజయవాడలో జరిగిన డిప్లొమాటిక్ ఔట్‌రీచ్ కార్యక్రమంలో ప్రసంగించిన జగన్… 972 కిలోమీటర్ల సుధీర్ఘమైన తీరం ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌కు సొంతమని జగన్ వివరించారు. 151 ఎమ్మెల్యేలతో ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత సుస్థిరమైన ప్రభుత్వం ఉందన్నారు. అవినీతి రహితమైన పాలన ఏపీలో ఉందన్నారు. పూర్తి పారదర్శకతతో తమ ప్రభుత్వం పెట్టుబడులను ఆహ్వానిస్తోందన్నారు. టెండర్ల పక్రియ నుంచి కేటాయింపుల వరకు అన్నీ కూడా అవినీతిరహితంగానే ఉంటాయని హామీ ఇచ్చారు.
నిజాయితీ, చిత్తశుద్ది, సంకల్పం ఉన్న ప్రభుత్వం తమదన్నారు. కేంద్ర ప్రభుత్వంతోనూ, పొరుగు రాష్ట్రాలతోనూ మంచి సంబంధాలను ఆంధ్రప్రదేశ్ కొనసాగిస్తోందన్నారు. పెట్టుబడులు పెట్టే వారికి ధైర్యం కల్పించే బాధ్యత తనదని జగన్ చెప్పారు.
విద్యుత్ ఒప్పందాలను సమీక్షిస్తున్నామని… దాన్ని కొందరు వివాదాస్పదం చేస్తున్నారని జగన్ అన్నారు. అధిక ధరలకు విద్యుత్ కొనడం సరైన పద్దతి కాదనే తాము పీపీఏలను సమీక్షిస్తున్నామని చెప్పారు. విద్యుత్ రేట్లు అధికంగా ఉంటే పరిశ్రమలు ఎలా ముందుకొస్తాయని జగన్ ప్రశ్నించారు.
పరిశ్రమలకు తక్కువ ధరకే విద్యుత్ అందించాలన్న ఉద్దేశంతోనే తాము పీపీఏలను సమీక్షిస్తున్నట్టు చెప్పారు. ధరలు తగ్గించి.. పరిశ్రమల అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నదే తమ ఉద్దేశమన్నారు. గెలువు- గెలిపించు అన్నదే తమ సిద్ధాంతమన్నారు.
స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వడం వల్ల పరిశ్రమలను స్థానికులు కూడా ఆహ్వానిస్తారన్నారు. సదరు పరిశ్రమకు ఎలాంటి నైపుణ్యం కావాలో ఒప్పందాల సమయంలోనే చెబితే అందుకు తగ్గట్టు స్థానికులకు ప్రభుత్వమే శిక్షణ ఇచ్చి సిద్ధం చేస్తుందన్నారు ముఖ్యమంత్రి.
పరిశ్రమలకు కావాల్సిన దాని కంటే ఎక్కువ నైపుణ్యంతో తమ యువతను సిద్ధం చేస్తామన్నారు. పరిశ్రమలలో స్థానికులకు అవకాశం ఇవ్వకపోతే వారి నుంచి ప్రతిఘటన వచ్చే అవకాశాలు అన్ని చోట్లా చూస్తున్నామన్నారు. అలాంటి పరిస్థితి ఉండకూడదనే స్థానికులకు పెద్దపీట వేయాలని కోరుతున్నామన్నారు.
గోదావరి-కృష్ణ నదుల అనుసంధానం ద్వారా నీటి కొరత కూడా లేకుండా చేస్తున్నామన్నారు. కాబట్టి వివిధ రంగాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి పలు దేశాల ప్రతినిధులు, రాయబారులకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమానికి యూఎస్‌ఏ, యూకే, జపాన్, కెనడా, కొరియా, సింగపూర్, ఆస్ట్రియా, పోలాండ్, ఆస్ట్రేలియా, టర్కీ తదితర 35 దేశాల రాయబారులు, హైకమిషనర్లు, ఉన్నతాధికారులు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.