గిరిజన సమస్యపై టీఆర్ఎస్ ఎత్తుగడ
ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచు కోట ఆ జిల్లా. ముగ్గురు మంత్రులను ఒకే మంత్రివర్గంలోకి తీసుకోక తప్పని పరిస్థితిని సృష్టించిన జిల్లా. కానీ ఇప్పుడు కార్యకర్తలు మాత్రమే ఉండి నాయకులు మాయమైన జిల్లా. ఉన్న నాయకులు ఏంచేయాలో తోచక సతమత మవుతున్న జిల్లా. అదే ఉమ్మడి వరంగల్ జిల్లా. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరంగల్ జిల్లా నుంచి ముగ్గురు నాయకులను మంత్రివర్గంలోకి తీసుకున్నారంటే ఆ జిల్లా తెలంగాణలో కాంగ్రెస్‌కు ఎంత పట్టున్న ప్రాంతమో అర్థమవుతుంది. అటువంటి జిల్లాలో […]
ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచు కోట ఆ జిల్లా. ముగ్గురు మంత్రులను ఒకే మంత్రివర్గంలోకి తీసుకోక తప్పని పరిస్థితిని సృష్టించిన జిల్లా. కానీ ఇప్పుడు కార్యకర్తలు మాత్రమే ఉండి నాయకులు మాయమైన జిల్లా. ఉన్న నాయకులు ఏంచేయాలో తోచక సతమత మవుతున్న జిల్లా. అదే ఉమ్మడి వరంగల్ జిల్లా.
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరంగల్ జిల్లా నుంచి ముగ్గురు నాయకులను మంత్రివర్గంలోకి తీసుకున్నారంటే ఆ జిల్లా తెలంగాణలో కాంగ్రెస్‌కు ఎంత పట్టున్న ప్రాంతమో అర్థమవుతుంది. అటువంటి జిల్లాలో టీ ఆర్ ఎస్ కాంగ్రెస్‌ను మట్టికరిపించింది. చిన్న, పెద్ద కాంగ్రెస్ నాయకులు చాలామంది టీ ఆర్ ఎస్‌లో చేరారు. మిగిలి ఉన్న నాయకులు టీ ఆర్ ఎస్‌తో ఢీకొట్టలేక ఉద్యమాల్లో పాల్గొనకుండా మిన్నకుండి పోతున్నారు.
ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ నాయకత్వం మళ్ళీ అధికారంలోకి వస్తామన్న భరోసాను కేడర్‌కి కల్పించడంలో పూర్తిగా విఫలమయింది. మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసినప్పుడు ఎక్కువ ఆదివాసీ తెగలు ఉన్న జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా. అక్కడ ఈ గిరిజనులను కాదని ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలవ లేదు.
అటువంటి జిల్లాలో పోడు భూముల సమస్యపై పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతోంది. వారి సమస్యపై పోరాటం చేయడానికి ఒక్క సీతక్క తప్ప జిల్లాకి చెందిన మరే కాంగ్రెస్ నాయకుడూ చురుకుగా కదలడంలేదు.
టీఆర్ ఎస్ పోడు భూముల సమస్యను తెలివిగా క్యాష్ చేసుకుంటోంది. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న గిరిజనుల ప్రయోజనాల కోసం అటవీ అధికార్లపై తమ ఎమ్మెల్యే, పార్టీ కర్యకర్తలే దాడిచేసేలా ఉసిగొల్పింది. ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నా స్థానిక ఎమ్మెల్యే పట్ల అభిమానం పెరిగేటట్లు వ్యవహరిస్తున్నది. ఈ ఎత్తుగడకు కాంగ్రెస్ చిత్తయింది.
ఒక పక్క టీ ఆర్ ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంతో దూసుకుపోతుంటే… కాంగ్రెస్ జాతీయ నాయకత్వం పార్టీ జెండా కార్యక్రమానికి పిలుపు ఇచ్చినా… జిల్లాలో దాని ఊసెత్తిన నాయకుడే కనపడలేదు. పొన్నాల సోషల్ మీడియాలో తప్ప ప్రజల మధ్య కనపడటం లేదనే విమర్శ ఉంది.
ఇక పరకాలలో కొండా దంపతులున్నా వారు తమ భవిష్యత్ ఏమిటా అనే ఆలోచనలో ఉన్నారే తప్ప రైతులు, ఆదివాసీలు, ఇతర వర్గాల సమస్యలపై గళమెత్తడం లేదని రాజకీయ విశ్లేషకుల మాట. ఇప్పటికీ కాంగ్రెస్ కాడర్ పార్టీని అంటిపెట్టుకునే ఉన్నా నాయకత్వ లేమి వల్ల నిరాశకులోనవుతున్నారనేది వీరి విశ్లేషణ.