ఫిరాయింపులను ప్రజలే నిలువరించాలి
కాంగ్రెస్, జనతా దళ్ (ఎస్) కు చెందిన 15 మంది శాసన సభ్యులు రాజీనామా చేయడంతో కర్నాటకలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఈ రాజీనామాల వెనక బీజేపీ హస్తం ఉందని, సంకీర్ణ ప్రభుత్వాన్ని గద్దె దింపి అధికారం హస్త గతం చేసుకోవలని బీజేపీ సంకల్పించిందన్న ఆరోపణలు వచ్చాయి. కానీ ఇటీవలి పరిణామాలను చూస్తే ప్రజాస్వామ్యం సంక్షోభంలో కూరుకుపోతోందన్న అనుమానం బలపడుతోంది. కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్.డి.ఎ. ప్రభుత్వం రెండో సారి అధికారం చేపట్టినప్పటి నుంచి అధికారాన్నంతటినీ తమ […]
కాంగ్రెస్, జనతా దళ్ (ఎస్) కు చెందిన 15 మంది శాసన సభ్యులు రాజీనామా చేయడంతో కర్నాటకలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఈ రాజీనామాల వెనక బీజేపీ హస్తం ఉందని, సంకీర్ణ ప్రభుత్వాన్ని గద్దె దింపి అధికారం హస్త గతం చేసుకోవలని బీజేపీ సంకల్పించిందన్న ఆరోపణలు వచ్చాయి. కానీ ఇటీవలి పరిణామాలను చూస్తే ప్రజాస్వామ్యం సంక్షోభంలో కూరుకుపోతోందన్న అనుమానం బలపడుతోంది.
కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్.డి.ఎ. ప్రభుత్వం రెండో సారి అధికారం చేపట్టినప్పటి నుంచి అధికారాన్నంతటినీ తమ గుప్పెట్లో పెట్టుకోవాలన్న ప్రయత్నం ఊపందుకుంది. ఇందుకోసం రాష్ట్రాలలోనూ, రాజ్యసభలోనూ పార్టీ ఫిరాయింపులను బీజేపీ ప్రోత్సహిస్తోంది. మెజారిటీ సంపాదించాలన్న హడావుడిలో బీజేపీ ఎన్నికలలో జనం ఇచ్చిన తీర్పును వమ్ము చేస్తోంది. ఇది కొత్తేమీ కాదని వాదించే వారు ఉండవచ్చు. ఈ పని చేస్తున్నది బీజేపీ మాత్రమే కాకపోవచ్చు.
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించినందు వల్ల రాజ్య సభలో అధికార పక్షానికి మెజారిటీ వస్తుందన్న మాట మాత్రం నిజం. అప్పుడు ప్రతిపక్షాల అభ్యంతరాలకు అవకాశం లేకుండా తాము కోరుకున్న చట్టాలను ఆమోదింప చేసుకోవచ్చు. ఇది ప్రతిపక్షం లేని భారత్ అన్న బీజేపీ లక్ష్య సాధనకు కూడా ఉపకరిస్తుంది.
అయితే ప్రతిపక్ష పార్టీలు ఈ ధోరణిని ఎందుకు నిలువరించలేకపోతున్నాయి అన్నది అసలు ప్రశ్న. ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద చేసే విమర్శలు ప్రజలను ఎందుకు ఆకర్షించలేక పోతున్నాయి?
ప్రజాప్రతినిధులు సునాయాసంగా పార్టీ ఫిరాయించడం చూస్తూ ఉంటే సిద్ధాంతాలు, నీతి సూత్రాలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదనిపిస్తోంది. అధికారం సంపాదించి డబ్బు సంపాదించడం, డబ్బు ద్వారా అధికారం సంపాదించడమే ఎన్నికల రాజకీయాలలో ప్రధానం అయిపోయింది.
ఏవో కొన్ని పార్టీలను మినహాయిస్తే ప్రధాన ప్రతిపక్ష పార్టీలవారు ఇదే ధోరణి అనుసరిస్తున్నారు. దీన్ని కొనసాగించడంలో వారి స్వార్థ ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. వారి అస్తిత్వానికే ముప్పు వచ్చినా ఖాతరు చేయడం లేదు. రాజకీయ పార్టీలకన్నా సొంత ప్రయోజనాలే ప్రధానం అయిపోయాయి.
ఇలాంటి పరిస్థితిలో నిర్దిష్టమైన సైద్ధాంతిక ప్రాతిపదిక ఉందంటున్న బీజేపీ లాంటీ పార్టీ రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యానికి ఎంత విఘాతం కలిగించినా ఇతర పార్టీల వారిని తమ వేపు సునాయాసంగా ఆకర్షించగలుగుతోంది. ఏకంగా పార్టీలనే కబళిస్తోంది. ప్రతిపక్షాల వారు అధికారం అండ లేకపోతే రాజకీయాలు నడపలేం అనుకుంటున్నారు. ఇలాంటి వారికి నిజమైన ప్రతిపక్షంగా మెలిగే శక్తి లేకుండా పోతోంది.
దీనివల్ల ప్రతిపక్షంగా మెలగే సామర్థ్యం లేకపోవడం, విశ్వసనీయత కొరవడడం చూసి ప్రజలు కూడా నిర్వేదంగా ఉండి పోతున్నారు. అంగట్లో పశువులను కొన్నట్టుగా ప్రజా ప్రతినిధులను కొంటూ ఉంటే ప్రజలు ఖిన్నులై చూస్తూ ఉండిపోవలసి వస్తోంది.
ఒక పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన వారు ఎన్నికలలో తాము వ్యతిరేకించిన పార్టీలోనే చేరిపోతున్నారు. ఇలా పార్టీ ఫిరాయించే వారిని ప్రజలు జవాబుదార్లను చేయాలి. కర్నాటకలో లాగా ఎన్నికైన ఏడాదిలోగానే రాజీనామా చేయడం కూడా ప్రజల విషయంలో నిర్వర్తించిన బాధ్యతను విస్మరించడమే అవుతుంది.
ఇలాంటి ప్రజా ప్రతినిధుల మీద ఒత్తిడి తీసుకురావడానికి కనీసం నియోజకవర్గ స్థాయిలోనైనా నిరసన ప్రదర్శనలు జరగాలి. ఇలాంటివి ఏమీ కనిపించడం లేదు. పార్టీ ఫిరాయించిన వారు మళ్లీ ఎన్నికైన సందర్భాలూ అనేకం ఉంటున్నాయి. ప్రజలు ఎందుకని అసమ్మతి తెలియజేయడం లేదు, ఆగ్రహం ప్రదర్శించడం లేదు అన్నది ప్రశ్న.
ప్రతిపక్షాలు ఈ విషయంలో ప్రజలను సమీకరించలేక పోతున్నాయి. గత అయిదేళ్ల కాలంలో మీడియా ఈ పార్టీ ఫిరాయింపులను సమర్థిస్తోంది. ఇది చాణక్య నీతి, భలే ఎత్తుగడ, రాజకీయ చాతుర్యం అని కీర్తిస్తోంది. ఓటర్లు పార్టీ ఫిరాయింపు అనైతికమైందిగా ఎందుకు పరిగణించడం లేదు?
ఇలాంటి విస్తృతమైన అంశాలలో మౌనం పాటించడం పౌరులు రాజకీయంగా క్రియాశీలంగా ఉండకుండా చేస్తుంది. రాజకీయ పార్టీలు తమ స్వప్రయోజనాలు చూసుకుంటున్నందువల్ల ఓటర్లు రాజకీయంగా దూరం అవుతున్నారు. ప్రజలు జవాబుదారీతనాన్ని కోరక పోతే అధికారంలో ఉన్న పార్టీ నిరాఘాటంగా తన పని తాను చేసుకుపోతుంది. అందువల్ల ప్రజలు తమ ప్రజాస్వామ్య చైతన్యాన్ని తట్టి లేపాలి. ప్రతిపక్ష పార్టీలు ప్రతిపక్షంగా వ్యవహరించేట్టు చేయాలి.
(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)