చిన్న రైతులకే రైతుబంధు పథకమా?
తెలంగాణలో ఇప్పటికే కరువు ఛాయలు చాలా మండలాల్లో కనిపిస్తున్నాయి. సాగు సగానికి తగ్గింది. నీరు అందుబాటు ఉన్న భూముల్లోలైనా వ్యవసాయం చేద్దామంటే చేతిలో పెట్టుబడి లేదు. ‘రైతు బంధు పథకం’ సాయమన్నా అందుతుందనుకుంటే అది ఎప్పుడు అందుతుందో తెలియని పరిస్థితి… ఇదీ తెలంగాణ రైతులోకం దీన స్థితి. తెలంగాణలో కొందరికి రైతు బంధు సాయం అందినా ఇంకా18 లక్షల మందికి అందవలసి ఉంది. ఈ మధ్య రైతు బంధు కింద రూ.500 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. […]
తెలంగాణలో ఇప్పటికే కరువు ఛాయలు చాలా మండలాల్లో కనిపిస్తున్నాయి. సాగు సగానికి తగ్గింది. నీరు అందుబాటు ఉన్న భూముల్లోలైనా వ్యవసాయం చేద్దామంటే చేతిలో పెట్టుబడి లేదు.
‘రైతు బంధు పథకం’ సాయమన్నా అందుతుందనుకుంటే అది ఎప్పుడు అందుతుందో తెలియని పరిస్థితి… ఇదీ తెలంగాణ రైతులోకం దీన స్థితి.
తెలంగాణలో కొందరికి రైతు బంధు సాయం అందినా ఇంకా18 లక్షల మందికి అందవలసి ఉంది. ఈ మధ్య రైతు బంధు కింద రూ.500 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. ఈ డబ్బు సుమారు 5లక్షల మందికి సరిపోతుంది. అవీ ఇంతవరకు రైతుల ఖాతాల్లో పడలేదు.
దీంతో రైతులు పొలం పనులు చేసుకుంటూనే… బ్యాంకులు, వ్యవసాయాధికార్ల చుట్టూ తిరుగుతూ నానా ఇబ్బంది పడుతున్నారు. ఖరీఫ్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా రైతుబంధు సాయం ఇంకా రైతులందరికీ ఎందుకు అందటం లేదో అర్థంకావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
దీనికి తోడు మరో ప్రచారం కూడా జరుగుతున్నది. ఐదెకరాల లోపు ఉన్న చిన్న రైతులకే ఇప్పటివరకు డబ్బులు అందాయని, అంతకన్నా ఎక్కువ పొలం ఉన్నవారికి అందలేదని… దీన్ని బట్టి ప్రభుత్వం ఇక నుంచి కేవలం సన్న, చిన్నకారు రైతులకే రైతుబంధు పథకం వర్తింప చేస్తుందా? అనేది ఈ ప్రచార సారాంశం.
అయితే చిన్న రైతులకే రైతుబంధు పథకం అన్న నిబంధన ఏదీ లేదని వ్యవసాయ శాఖాధికార్లు అంటున్నారు. కానీ ప్రభుత్వాలను నమ్మడం కష్టమేనని… మొదట హడావిడిగా జనాన్ని ఆకర్షించడానికి పథకాలు ప్రవేశపెట్టడం, ఆ తర్వాత అమలుచేయలేని స్థితిలో ఆ పథకాలలో మార్పులు చేయడమో లేక ఆ పథకాన్ని ఎత్తేయడమే… ఇదంతా జరుగుతున్న తంతేనని కొందరు రైతులు అంటున్నారు.
కానీ కేసీఆర్ గతంలో అసెంబ్లీలో చెప్పిన విషయాన్ని రైతులకు గుర్తు చేస్తున్నారట లోకల్ టీఆర్ఎస్ నేతలు. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు ఈ పథకాన్ని అమలుచేస్తామన్న విషయాన్ని చెబుతున్నారట.