మోడీ రూ.15 లక్షలు ఇస్తున్నారని...
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూ.15 లక్షలు విడతల వారీగా పోస్టాఫీసు ఎకౌంట్లో వేస్తున్నారని… మొదటి విడతగా రూ.3 లక్షల రూపాయలు ఎకౌంట్ లో పడుతున్నాయని కేరళలోని ఓ పట్టణంలో పోస్టాపీసు దగ్గర జనం వరుసలు కట్టారు. 2014 ఎన్నిలక సమయంలో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ నల్ల ధనాన్ని బయటికి తీసి పౌరుల ఎకౌంట్లలో ఒక్కొక్కరికీ రూ.15 లక్షలు వేస్తానని చెప్పడం, గెలిచిన తర్వాత ఆ సంగతి మర్చిపోవడం తెలిసిన సంగతే. బీజేపీ అధ్యక్షుడు అమిత్ […]
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూ.15 లక్షలు విడతల వారీగా పోస్టాఫీసు ఎకౌంట్లో వేస్తున్నారని… మొదటి విడతగా రూ.3 లక్షల రూపాయలు ఎకౌంట్ లో పడుతున్నాయని కేరళలోని ఓ పట్టణంలో పోస్టాపీసు దగ్గర జనం వరుసలు కట్టారు.
2014 ఎన్నిలక సమయంలో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ నల్ల ధనాన్ని బయటికి తీసి పౌరుల ఎకౌంట్లలో ఒక్కొక్కరికీ రూ.15 లక్షలు వేస్తానని చెప్పడం, గెలిచిన తర్వాత ఆ సంగతి మర్చిపోవడం తెలిసిన సంగతే.
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఓ ఇంటర్వ్యూలో ఈ వాగ్దానాన్ని ఒక ‘ఎన్నికల జుమ్లాగా’ పేర్కొన్న సంగతీ తెలిసిందే. అయినా రూ. 15 లక్షల వాగ్దానం మాత్రం అప్పుడప్పుడు వార్తలలో నిలుస్తూనే ఉన్నది. అందుకు ఈ సంఘటన మంచి ఉదాహరణ.
కేరళ మున్నార్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నట్లుండి రూ.15 లక్షలు ఇస్తున్నట్లు ఓ మెసేజ్ వైరల్ అయింది. మున్నార్ చుట్టుపక్కల చాలా టీ తోటలున్నాయి. అందులో పనిచేసేవారందరూ చాలా వరకూ నిరక్షరాశ్యులు, కొద్దిగా చదువుకున్నవారే.
గత ఆదివారం వాట్స్ యాప్ ద్వారా వ్యాప్తి చెందిన ఈ పుకారును చూసి జనం మున్నార్ పోస్టాఫీస్ దగ్గర సేవింగ్స్ ఎకౌంట్ ని ఓపెన్ చేయడం కోసం క్యూ కట్టారు. పోస్టాఫీసు ఉద్యోగులు ఇంతమంది ఎకౌంట్ ఓపెన్ చేయడానికి ఎగబడుతున్నారేంటబ్బా అని ఆశ్చర్యపోయారు. ఒకానొక దశలో జనాన్ని అదుపు చేయడానికి పోలీసులను కూడా పిలిపించారు.
చివరికి ఏ ఉద్దేశంతో వీళ్లందరూ ఎకౌంట్ ఓపెన్ చేస్తున్నారో తెలుసుకుని అవాక్కయ్యారు అక్కడి ఉద్యోగులు. అదంతా పుకారని, ఎకౌంట్లో డబ్బులు పడుతున్నాయనే వార్త నమ్మవద్దని తమిళం, మళయాళంలో రాసిన బోర్డును పెట్టారు. అయితే అప్పటికే 1500 వందల మంది ఎకౌంటు తెరిచేశారు.
ఇంతకు ఏం జరిగిందంటే… ఓ పోస్టల్ సేవింగ్స్ బ్యాంకు ఎకౌంట్ స్కీం ని మున్నార్‌లో కేంద్ర ప్రభుత్వం గత ఆదివారం ప్రారంభిస్తున్నట్లు… ఎవరైనా సరే ఆధార్ కార్డు, 2 పాస్‌పోర్టు సైజు ఫొటోలు సమర్పించి వంద రూపాయలు డిపాజిట్ చేస్తే ఇండియన్ పోస్టల్ పేమెంట్ ఎకౌంట్ తెరవ వచ్చని, ఇది చాలా ఉపయోగకరమని, లక్షరూపాయలు ట్రాన్స్ ఫర్ చేయడానికీ ఉపయోగపడుతుందనే మెసేజ్ వాట్స్ యాప్ లో సర్క్యులేట్ అయింది. ఇది అర్థం కానివారు నరేంద్రమోడీ డబ్బులు ఎకౌంట్‌లో వేస్తున్నారని ప్రచారం చేశారు. ఫలితంగా పని మానుకుని ఆతృతతోను, ఆశతోనూ పోస్టాఫీసు దారిపట్టారు అమాయక జనం.