దేశమాత సేవలో క్రికెట్ దిగ్గజాలు..!
2008లో కపిల్ దేవ్ 2015 లో మాస్టర్ సచిన్ 2019లో మహేంద్ర సింగ్ ధోనీ భారత సైనిక దళాలకు.. క్రికెట్ దిగ్గజాలకు అవినాభావ సంబంధమే ఉంది. భారత క్రికెట్ కు సంవత్సరాల తరబడి అమూల్యమైన సేవలు అందించడమే కాదు అసాధారణ క్రికెటర్లుగా నిలిచిపోయిన లెజెండరీ క్రికెటర్లు కపిల్ దేవ్, సచిన్ టెండుల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ క్రికెటర్ కమ్ జవాన్లుగా భరతమాత సేవలో పులకించిపోతున్నారు. దేశంలోని కో్ట్లాదిమంది నవతరంలో సరికొత్త స్ఫూర్తిని నింపుతున్నారు. హర్యానా హరికేన్ కపిల్ దేవ్, భారత […]
- 2008లో కపిల్ దేవ్
- 2015 లో మాస్టర్ సచిన్
- 2019లో మహేంద్ర సింగ్ ధోనీ
భారత సైనిక దళాలకు.. క్రికెట్ దిగ్గజాలకు అవినాభావ సంబంధమే ఉంది. భారత క్రికెట్ కు సంవత్సరాల తరబడి అమూల్యమైన సేవలు అందించడమే కాదు అసాధారణ క్రికెటర్లుగా నిలిచిపోయిన లెజెండరీ క్రికెటర్లు కపిల్ దేవ్, సచిన్ టెండుల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ క్రికెటర్ కమ్ జవాన్లుగా భరతమాత సేవలో పులకించిపోతున్నారు. దేశంలోని కో్ట్లాదిమంది నవతరంలో సరికొత్త స్ఫూర్తిని నింపుతున్నారు.
హర్యానా హరికేన్ కపిల్ దేవ్, భారత క్రికెటర్ సచిన్ టెండుల్కర్, జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీలకు… భారత క్రికెట్ చరిత్రలో మాత్రమే కాదు… ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ప్రత్యేకస్థానం ఉంది.
ఫాస్ట్ బౌలర్ ఆల్ రౌండర్ గా కపిల్ దేవ్, అభినవ బ్రాడ్మన్ గా సచిన్, కూల్ కూల్ కెప్టెన్ గా, వికెట్ కీపర్, బ్యాట్స్ మన్ గా ధోనీ తమదైన ఆటతీరు, ముద్రతో భారత క్రికెట్ ను కొత్తపుంతలు తొక్కించారు.
క్రికెటర్లుగా అసాధారణ రికార్డులు నెలకొల్పడమే కాదు… భారత సైనికదళాలకు చెందిన వివిధ విభాగాలతో అనుబంధం ఏర్పరచుకొని గౌరవ సైనికులుగా తమవంతుగా సేవలు అందిస్తూ పులకించిపోతున్నారు.
కపిల్ దేవ్ తో ప్రారంభం…
భారత్ కు 1983 ప్రపంచకప్ అందించడం ద్వారా క్రికెటర్ గా తన జన్మను సార్థకం చేసుకొన్న హర్యానా హరికేన్ కపిల్ దేవ్.. 2008లో భారత సరిహద్దు భద్రతా దళాలలో గౌరవ్ లెఫ్ట్ నెంట్ కర్నల్ గా చేరి..సాధారణ సైనికుడిలా శిక్షణపొందారు.
సైనిక దుస్తులు ధరించడం తనలో సరికొత్త స్ఫూర్తిని నింపిందని …భారత క్రికెట్ జట్టుకు ఆడే సమయంలో టీమ్ జెర్సీ ధరించడాన్ని ఎంత గౌరవంగా భావించానో… సైనిక దుస్తులు ధరించడం అంతే సంతృప్తిని కలిగించినట్లు కపిల్ దేవ్ తరచూ గుర్తు చేసుకొంటూ సైనికదళాల పట్ల తన అభిమానాన్ని చాటుకొంటూ ఉంటారు.
2015లో మాస్టర్ సచిన్..
భారత క్రికెట్ కు రెండుదశాబ్దాలపాటు అపూర్వ సేవలు అందించిన వంద సెంచరీల మొనగాడు మాస్టర్ సచిన్ టెండుల్కర్ రిటైర్మెంట్ ప్రకటించిన రెండేళ్ల తర్వాత.. భారత వైమానికదళం 2015లో గ్రూప్ కెప్టెన్ గా గౌరవ హోదా ఇచ్చి సత్కరించింది. 83వ భారత వైమానికదళ దినోత్సవాలలో భాగంగా సచిన్ కు వైమానికదళం ధరించే దుస్తులను ప్రదానం చేసింది.
అంతేకాదు..రాజస్థాన్ లోని పొఖ్రాన్ లో నిర్వహించిన వాయుశక్తి వైమానిక పాటవ ప్రదర్శనకు సచిన్ ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించింది.
భారత వైమానికదళం అమ్ములపొందిలోని మిగ్-29 ఫైటర్లు, సుఖోయ్-30, మిరాజ్ -2000 జాగ్వార్, మిగ్ -21, బైసన్ మిగ్ -27,మిగ్ -29, ఐఎల్ 78, హెర్క్యులెస్, ఏఎన్ -32 విమానాల విన్యాసాలు చూసిన సచిన్ తన జన్మధన్యమైందని ప్రకటించాడు.
భారత వైమానికదళంలో తాను ఓ భాగం కావడం పూర్వజన్మసుకృతమని సచిన్ ప్రకటించడం ద్వారా తన ఆనందాన్ని పంచుకొన్నాడు.
వీరజవాన్ ధోనీ….
భారత్ కు రెండు ప్రపంచకప్ లు అందించిన మొనగాడు. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ కెప్టెన్ గా నిలిచిన ఘనుడు మహేంద్ర సింగ్ ధోనీ.
గత 15 సంవత్సరాలుగా భారత క్రికెట్ కు ఘనమైన సేవలు అందిస్తూనే వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ఆర్జించిన నిగర్వి.
ఖరీదైన విదేశీ కార్లు, విలాసవంతమైన భవంతులు , ఇండియా సిమెంట్స్ లో కీలక పదవి ఉన్నా.. జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీలో ఓ నిజమైన దేశభక్తుడు దాగి ఉన్నాడు.
క్రికెటర్ టు వీరజవాన్…
మహేంద్ర సింగ్ ధోనీ పూర్వీకులకు భారత సైనికదళాలతో సంబంధం ఉంది. వృత్తి రీత్యా ధోనీతండ్రి మోటార్ ఆపరేటర్ గా ఉన్నా… ధోనీ విశ్వవిఖ్యాత క్రికెటర్ గా నిలిచినా… ఓ సైనికుడుగా సేవ చేయాలని కంకణం కట్టుకొన్నాడు.
2011 లోనే భారత ప్రాదేశిక దళాలకు చెందిన పారాట్రూప్ వింగ్ లో ధోనీ…గౌరవ లెఫ్ట్ నెంట్ కర్నల్ హోదా సంపాదించాడు. హోదాను అలంకరణ కోసం మాత్రమే కాదు…తాను సుక్షితుడైన సైనికుడుగా సత్తా చాటుకోడానికి కఠోర శిక్షణ పొందాడు.
ఆగ్రాలోని భారత సైనికదళాల పారా ట్రూప్ శిక్షణ విభాగంలో..ఐదుసార్లు పారా ట్రూప్ జంప్ లు చేయడం ద్వారా సుక్షితుడైన పారాజంపర్ గా గుర్తింపు సంపాదించాడు.
ప్రపంచకప్ తో 2 మాసాల విరామం..
ఇంగ్లండ్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్ తర్వాత…ధోనీ వ్యూహాత్మకంగా రెండుమాసాల విరామం తీసుకొన్నాడు. ఈ విలువైన సమయాన్ని దేశసేవకు వినియోగించాలని నిర్ణయించాడు.
భార్య సాక్షి, కుమార్తె జీవాకు దూరంగా ఉంటూ.. సైనికులలో ఓ సైనికుడుగా ఉంటూ సేవ చేయాలని భావించాడు. జులై 31 నుంచి ఆగస్టు 15 వరకూ సైనికుడుగా సేవ చేయటానికి అనుమతి సంపాదించాడు.
గస్తీ విధుల్లో మహేంద్రసింగ్ ధోనీ…
వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ గా భారత క్రికెట్ కు అసమాన సేవలు అందించిన ధోనీ…తన జీవితంలో తొలిసారిగా…అంకితభావం కలిగిన ఓ సైనికుడుగా.. కాశ్మీర్ లోయలో గస్తీ విధుల్లో పాలుపంచుకొంటున్నాడు.
కాశ్మీర్ లోయలోని తమ బృందంతో పాటే ఉంటూ…ధోనీ గస్తీ విధులతో పాటు గార్డుగా కూడా సేవచేయనున్నట్లు సైనికదళాలు ప్రకటించాయి. ఓ సాధారణ సైనికుడులానే ధోనీ సైతం తన రెండుమాసాల కాలాన్ని గడపనున్నాడు.
క్రికెట్ దిగ్గజం ధోనీకి తాము రక్షణ కల్పించాల్సిన అవసరం లేదని… ధోనీనే భారత ప్రజలకు రక్షణకవచంలా నిలిచాడంటూ భారత సైనికదళాధిపతి ప్రకటించారు.
ధోనీకి ప్రశంసల వెల్లువ…
క్రికెట్ నుంచి విరామం తీసుకొని..సైనికవిధుల్లో పాలుపంచుకొంటున్న మహేంద్ర సింగ్ ధోనీని భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, మాజీ ఓపెనర్ కమ్ బీజెపీ ఎంపీ గౌతం గంభీర్ ప్రశంసలతో ముంచెత్తారు.
ప్రపంచంలోనే అత్యధిక యువజన జనాభా కలిగిన నవతరంలో ధోనీ తన సైనిక సేవతో స్ఫూర్తి నింపడం ఖాయమంటూ అభినందించారు.
భారత క్రికెట్ చరిత్రలోనే సైనికదళాలకు ..ఓ సైనికుడుగా రెండుమాసాలు సేవ చేసిన ఘనతను ధోనీ మాత్రమే దక్కించుకోగలిగాడు.