Telugu Global
National

కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి మృతి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి(77) ఆదివారం ఉదయం కన్నుమూశారు. న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన ఈ నెల 20 నుంచి గచ్చిబౌలిలోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఇవాళ ఉదయం మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని జూబ్లీహిల్స్‌లోని ఇంటికి తరలించారు. ఉమ్మడి మహబూబూబ్‌నగర్ జిల్లాలోని మాడుగుల గ్రామంలో 1942 జనవరి 16న దుర్గారెడ్డి, యశోదమ్మ దంపతులకు జైపాల్‌రెడ్డి జన్మించారు. మాడుగుల, దేవరకొండలో ప్రాథమిక విద్యాభ్యాసం, ఉస్మానియా […]

కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి మృతి
X

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి(77) ఆదివారం ఉదయం కన్నుమూశారు. న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన ఈ నెల 20 నుంచి గచ్చిబౌలిలోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఇవాళ ఉదయం మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని జూబ్లీహిల్స్‌లోని ఇంటికి తరలించారు.

ఉమ్మడి మహబూబూబ్‌నగర్ జిల్లాలోని మాడుగుల గ్రామంలో 1942 జనవరి 16న దుర్గారెడ్డి, యశోదమ్మ దంపతులకు జైపాల్‌రెడ్డి జన్మించారు. మాడుగుల, దేవరకొండలో ప్రాథమిక విద్యాభ్యాసం, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్‌లో పట్టా పొందారు.

విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో పాల్గొన్న ఆయన.. ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జనతా పార్టీలో చేరారు. 1985 నుంచి 1988 వరకు జనతాపార్టీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఐదుసార్లు లోక్‌సభకు, 2సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. 4సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. ఐకే గుజ్రాల్ మంత్రి వర్గంలో 1998 సమయంలో సమాచార శాఖ మంత్రిగా పని చేశారు.

కాగా, 1999లో ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2004లో మిర్యాలగూడ లోక్‌సభ నుంచి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా పని చేశారు. 2009లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి ఎంపీ అయిన ఆయన మన్మోహన్ ప్రభుత్వంలో పెట్రోలియం, సహజవాయువుల మంత్రిగా ఉన్నారు.

1998లో ఆయనకు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు వరించింది. దక్షిణ భారతం నుంచి ఈ అవార్డు అందుకున్న నేతగా ఆయనకు విశిష్ట గుర్తింపు ఉంది. 1999-2000 సంవత్సరంలో ఆయన సభా హక్కుల ఉల్లంఘన కమిటీ చైర్మన్‌గా పని చేశారు. జైపాల్‌రెడ్డికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

First Published:  28 July 2019 1:12 AM IST
Next Story