వైఎస్సార్ విగ్రహానికి వైసీపీ నాయకుల నుంచే ముప్పా?
అనంతపురం జిల్లాలో అధికార వైసీపీలో లుకలుకలు తారాస్థాయికి చేరుకున్నాయా? ఉరవ కొండలో వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు సందర్భంగా జరుగుతున్న కుమ్ములాట ఇందుకు మంచి నిదర్శనం అని పరిశీలకులు అంటున్నారు. విశ్వేశ్వర రెడ్డి, శివరామిరెడ్డి అనంతపురం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ లో ముఖ్యమైన నాయకులు. విశ్వేశ్వర రెడ్డి స్థానికంగా పార్టీలో తన మాటే నెగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారనేది ప్రత్యర్థుల ఆరోపణ. అటువంటి ప్రత్యర్థుల్లో శివరామి రెడ్డి ఒకరంటారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరూ ఉరవకొండ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేయడం […]
అనంతపురం జిల్లాలో అధికార వైసీపీలో లుకలుకలు తారాస్థాయికి చేరుకున్నాయా? ఉరవ కొండలో వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు సందర్భంగా జరుగుతున్న కుమ్ములాట ఇందుకు మంచి నిదర్శనం అని పరిశీలకులు అంటున్నారు.
విశ్వేశ్వర రెడ్డి, శివరామిరెడ్డి అనంతపురం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ లో ముఖ్యమైన నాయకులు. విశ్వేశ్వర రెడ్డి స్థానికంగా పార్టీలో తన మాటే నెగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారనేది ప్రత్యర్థుల ఆరోపణ. అటువంటి ప్రత్యర్థుల్లో శివరామి రెడ్డి ఒకరంటారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరూ ఉరవకొండ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేయడం కోసం గట్టి ప్రయత్నం చేశారు. చివరికి విశ్వేశ్వరరెడ్డి ప్రయత్నం ఫలించి ఆయనకి టికెట్ ఇచ్చింది వైసీపీ. కానీ ఆయన ఓడిపోయారు. ఈ ఓటమికి శివరామిరెడ్డి వర్గం సహాయ నిరాకరణ కూడా ఒక కారణమని అంటారు. ఈ వర్గపోరును టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ క్యాష్ చేసుకుని విజయం సాధించారని రాజకీయ విశ్లేషకుల మాట.
ఇంత జరిగినా ఈ నాయకుల మధ్య కుమ్ములాట కొనసాగుతూనే ఉండటం విశేషం. తాజాగా ఉరవ కొండ ఎన్టీఆర్ సర్కిల్ లో వైఎస్సార్ విగ్రహ ప్రతిష్ట సందర్భంగా రగులుకున్న కొత్త వివాదం వీరి మధ్య వర్గపోరు కొనసాగుతున్నదనే సంగతికి మంచి ఉదాహరణ. ఇటీవల శివరామిరెడ్డి ఎన్టీఆర్ సర్కిల్‌లో వైఎస్సార్ విగ్రహాన్ని అట్టహాసంగా నిలిపారు. అయితే తనకు మాటమాత్రంగానైనా చెప్పకుండా విగ్రహావిష్కరణ ఎలా చేస్తారని విశ్వేశ్వర రెడ్డి తన అనుయాయులతో వచ్చి రభస చేశారు. గొడవ ముదిరి ఘర్షణకు దారితీసింది.
తాము ఏర్పాటు చేసిన విగ్రహానికి ప్రత్యర్థలు హాని తలపెడతారేమో అని శివరామిరెడ్డి పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు వైఎస్సార్ విగ్రహానికి రక్షణగా నిలిచారు. ఏ పార్టీ నాయకులు వైఎస్సార్‌ని దేవుడుగా భావిస్తారో, ఆ పార్టీ నాయకుల నుంచి ఆయన విగ్రహానికి పోలీసులు కాపలా కాయవలసిరావడం ఎంత విడ్డూరం! అదీ వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే కావడం…!
ఇందులో కొసమెరుపేమిటంటే… ఎన్టీఆర్ సర్కిల్ లో ఎన్టీఆర్ విగ్రహం ఉండాలి కాని వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేయడమేమిటి? న్యాయం చేయమంటూ టీడీపీ నాయకులు పోలీసులను ఆ్రశయించటం!