గ్రూపు తగాదాల నుంచి ఖమ్మం టీఆర్‌ఎస్ బయటపడదా?
ఖమ్మం ఎర్ర జెండా కంచుకోటగా ఉండేది. ఇప్పుడు వారు అక్కడ ఉనికి కోల్పోయే పరిస్థితి ఉంది. అక్కడక్కడా టీడీపీ గట్టిగా పోటీ ఇచ్చేది. ఇప్పుడు దాని అడ్రస్ కూడా గల్లంతయింది. ఈ పార్టీల స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంది. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ కాస్త పుంజుకుంది. దీనితో టీఆర్ఎస్ ఆందోళనకు గురయింది. ఆత్మపరిశీలనలో పడింది. ఆ పరిశీలనలో ఏం తేలిందో తెలియదు కాని రాజకీయ విశ్లేషకులు మాత్రం వర్గాల కుమ్ములాట వల్లే ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ దెబ్బతిన్నదని […]
ఖమ్మం ఎర్ర జెండా కంచుకోటగా ఉండేది. ఇప్పుడు వారు అక్కడ ఉనికి కోల్పోయే పరిస్థితి ఉంది. అక్కడక్కడా టీడీపీ గట్టిగా పోటీ ఇచ్చేది. ఇప్పుడు దాని అడ్రస్ కూడా గల్లంతయింది. ఈ పార్టీల స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంది. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ కాస్త పుంజుకుంది. దీనితో టీఆర్ఎస్ ఆందోళనకు గురయింది. ఆత్మపరిశీలనలో పడింది. ఆ పరిశీలనలో ఏం తేలిందో తెలియదు కాని రాజకీయ విశ్లేషకులు మాత్రం వర్గాల కుమ్ములాట వల్లే ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ దెబ్బతిన్నదని చెబుతూ… తాజాగా అక్కడ జరుగుతున్న గ్రూపు తగాదాను ఇందుకు సాక్ష్యంగా చూపిస్తున్నారు.
ఖమ్మం పట్టణం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా మారింది. 50 డివిజన్లు ఉన్నఖమ్మం కార్పొరేషన్‌లో అత్యధిక స్థానాలు టీఆర్ఎస్ గెలుచుకుంది. మేయర్ గా డాక్టర్ పాపాలాల్ ఎన్నికయ్యారు. అయితే కొద్దిరోజుల్లోనే టీఆర్ఎస్ కార్పొరేటర్లు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం పాపాలాల్ ని సపోర్టు చేస్తుంటే మరో వర్గం ఆయన్ని పదవి నుంచి దించాలని చూస్తున్నది.
గత సంవత్సరం పదవి నుంచి తొలగించాలని మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్ ని కలిసి విజ్ఞాపన పత్రం సమర్పించారు. మళ్లీ ఇప్పుడు అదే వర్గం ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి నిర్ణయం తీసుకుంది. అయితే కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం ఎన్నికయిన మూడేండ్ల వరకు మేయర్ ను తొలగించడం సాధ్యం కాదు కనుక తనను పదవి నుంచి తొలగించలేరని మేయర్ పాపాలాల్ అంటున్నారు.
కొందరు కార్పొరేషన్ని అడ్డాగా చేసుకుని బ్రోకర్లుగా మారి దందాలు చేస్తున్నారని, వారి కార్యకలాపాల గురించి నివేదిక సమర్పిస్తానని మీడియాకు చెప్పుకొచ్చారు పాపాలాల్. అయితే ప్రత్యర్థి వర్గం మాత్రం ఆయన ఏ సమావేశం పెట్టినా ఒకటి రెండు గంటల ముందు మాత్రమే తెలియజేస్తున్నారని, ఫలితంగా తాము సమావేశాలకు హాజరుకాలేకపోతున్నామని, దీన్ని అవకాశంగా తీసుకుని ఆయన వర్గంతో కలిసి ఇష్టమొచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్నారని, తమ డివిజన్లు అభివృద్ధిలో వెనుకబడిపోతున్నాయని అంటున్నారు.
తెలంగాణ ఉద్యమ కాలంలో నిరాహార దీక్ష తర్వాత కేసీఆర్ ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అప్పుడు డాక్టర్ పాపాలాల్ ఆధ్వర్యంలోనే ఆయనకు వైద్యం అందింది. ఆసమయంలో పాపాలాల్ కేసీఆర్ దృష్టిని ఆకర్షించారు. ఫలితంగా ఆయకు ఖమ్మం మేయర్ పదవి దక్కింది.