Telugu Global
NEWS

కొత్త పరిశ్రమలపై టిడిపి అసత్య ప్రచారం

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా పరిశ్రమలు రావడానికి సిద్ధంగా ఉన్నాయని, అయితే వాటిపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అసత్య ప్రచారం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. పరిశ్రమలలో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ కల్పించడంపై వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై జరిగిన చర్చలో వై. ఎస్.జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగాల కల్పనలో తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని వివరించారు. “ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి పారిశ్రామిక […]

కొత్త పరిశ్రమలపై టిడిపి అసత్య ప్రచారం
X

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా పరిశ్రమలు రావడానికి సిద్ధంగా ఉన్నాయని, అయితే వాటిపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అసత్య ప్రచారం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు.

పరిశ్రమలలో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ కల్పించడంపై వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టింది.

ఈ బిల్లుపై జరిగిన చర్చలో వై. ఎస్.జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగాల కల్పనలో తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని వివరించారు.

“ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి పారిశ్రామిక వేత్తలు వస్తున్నారు. ఆయా పరిశ్రమల్లో వారికి భూములిచ్చిన పిల్లలకు ఉద్యోగాల్లో తొలి ప్రాధాన్యత ఉంటుంది. పరిశ్రమల యాజమాన్యం ఈ నిబంధనను తప్పక పాటించాలి” అని స్పష్టం చేశారు.

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని యువతీ, యువకులకు శిక్షణ ఇచ్చేందుకు స్కిల్డ్ సెంటర్లను ప్రారంభిస్తామని, ఉద్యోగార్ధులకు నైపుణ్యం లేదనే పేరుతో ఉద్యోగాలు ఇవ్వకుండా చేయాలనుకుంటే అది సాధ్యం కాదని సీఎం జగన్మోహన్ రెడ్డి వివరించారు.

“ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో చేరే వారికి ఆయా శాఖల్లో నైపుణ్యం అందిస్తాం. ఉపాధి కోసం వేరే రాష్ట్రాలకు వలస పోయే పరిస్థితులను భవిష్యత్తులో రాకుండా చూస్తాం” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని విద్యుత్తు ప్రాజెక్టులపై తమ ప్రభుత్వం చేపడుతున్న సమీక్షల వల్ల పారిశ్రామిక రంగానికి ఎంతో మేలు జరుగుతుందని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు.

“పీపీఏలపై సమీక్ష అనంతరం పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ అందడంతో పాటు తక్కువ ధరకే విద్యుత్ అందిస్తాం. ఇది పరిశ్రమలు స్థాపించే వారికి మేలు చేసేది కాదా..?” అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు.

నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా మంచి సలహాలు ఇవ్వాలి కానీ అసత్య ఆరోపణలు చేయకూడదని హితవు పలికారు. రాష్ట్రంలో రానున్న పరిశ్రమల పైనా, ప్రాజెక్టులపై జరుగుతున్న సమీక్షల పైనా చంద్రబాబు నాయుడు తన పచ్చమీడియాలో కథనాలు రాయిస్తున్నారని, వీటిని ప్రజలు గమనిస్తున్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు.

First Published:  25 July 2019 2:01 AM IST
Next Story