కుమార స్వామి రాజీనామా... యడ్యూరప్ప హంగామా !
కర్ణాటక రాజకీయం రంగులు మారింది. శాసనసభలో బలనిరూపణలో విఫలమైన కుమారస్వామి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. శాసనసభలో బల పరీక్ష ముగిసిన వెంటనే కుమారస్వామి గవర్నర్ ను కలిసి తన రాజీనామా పత్రం అందజేశారు. గవర్నర్ దానిని వెంటనే ఆమోదించారు. ఈ పరిణామంతో గత కొంతకాలంగా కుమారస్వామి సర్కారు ఉంటుందో.. ఊడుతుందో తెలియని అనిశ్చితికి ఫుల్ స్టాప్ పడింది. సర్కారుకు మద్దతు ఇచ్చిన […]
కర్ణాటక రాజకీయం రంగులు మారింది. శాసనసభలో బలనిరూపణలో విఫలమైన కుమారస్వామి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
దీంతో అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. శాసనసభలో బల పరీక్ష ముగిసిన వెంటనే కుమారస్వామి గవర్నర్ ను కలిసి తన రాజీనామా పత్రం అందజేశారు. గవర్నర్ దానిని వెంటనే ఆమోదించారు.
ఈ పరిణామంతో గత కొంతకాలంగా కుమారస్వామి సర్కారు ఉంటుందో.. ఊడుతుందో తెలియని అనిశ్చితికి ఫుల్ స్టాప్ పడింది. సర్కారుకు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేలను బుజ్జగించడంలో కాంగ్రెస్ నాయకులతో సహా కుమారస్వామి కూడా భంగపడ్డారు.
భారతీయ జనతా పార్టీ వ్యూహరచన ముందు కుమారస్వామి సర్కారు నిలబడలేక పోయింది. ఇన్నాళ్లూ దిన దిన గండం నూరేళ్ళు ఆయుష్షుగా మిగిలిన కుమారస్వామి ప్రభుత్వం మంగళవారం కూలిపోయింది.
మరోవైపు ఎపుడెప్పుడు కర్ణాటక అందలం ఎక్కుదామా అని ఉవ్విళ్లూరుతున్న మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాల్సిందిగా గవర్నర్ ను కోరారు.
కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాల్సిందిగా యడ్యూరప్ప గవర్నర్ ను కోరారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇక కర్ణాటకలో అభివృద్ధి శకం ప్రారంభమైందని అన్నారు.
“కుమారస్వామి ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారు. ఇక అభివృద్ధే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది” అని యడ్యూరప్ప స్పష్టం చేశారు.
మరోవైపు కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఈ పరిణామాలతో భారతీయ జనతా పార్టీ ఖాతాలో మరో రాష్ట్రం చేరింది.