అప్పుల్లో కూరుకుపోతున్న చైనా
దశాబ్దాలుగా రంకెలేసిన చైనా ఆర్థిక రంగం వృద్ధి ఇప్పుడు తలకిందులవుతోంది. మూడు దశాబ్దాల కనిష్ట స్థాయికి చైనా వృద్ధి రేటు చేరింది. చైనా వృద్ధి రేటు ఇలా దెబ్బతినడానికి…. అమెరికాతో ట్రేడ్ వార్‌తో పాటు చైనా మార్చుకుంటున్న ఆర్థిక విధానాలు కూడా కారణంగా భావిస్తున్నారు. అమెరికాతో ట్రేడ్ వార్ కంటే…. పేరుకుపోతున్న ప్రభుత్వ అప్పులు, చైనా ప్రజల పొదుపు చర్యలే చైనా వృద్ధి రేటు దెబ్బతినడానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. 2008 ఆర్థిక సంక్షోభం సమయంలో చైనా […]
దశాబ్దాలుగా రంకెలేసిన చైనా ఆర్థిక రంగం వృద్ధి ఇప్పుడు తలకిందులవుతోంది. మూడు దశాబ్దాల కనిష్ట స్థాయికి చైనా వృద్ధి రేటు చేరింది. చైనా వృద్ధి రేటు ఇలా దెబ్బతినడానికి…. అమెరికాతో ట్రేడ్ వార్‌తో పాటు చైనా మార్చుకుంటున్న ఆర్థిక విధానాలు కూడా కారణంగా భావిస్తున్నారు.
అమెరికాతో ట్రేడ్ వార్ కంటే…. పేరుకుపోతున్న ప్రభుత్వ అప్పులు, చైనా ప్రజల పొదుపు చర్యలే చైనా వృద్ధి రేటు దెబ్బతినడానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. 2008 ఆర్థిక సంక్షోభం సమయంలో చైనా ప్రారంభించిన భారీ ఉద్దీపన ప్యాకేజీ కోసం అధిక స్థాయిలో అప్పులు చేసుకుంటూ పోయింది. ఉద్దీపన ప్యాకేజీ చైనా ఆర్థిక వృద్ధిని పెంచినా, దీని ఫలితంగా మార్చి 2019 నాటికి చైనా జీడీపీలో 300% కంటే ఎక్కువ ప్రభుత్వ, కార్పొరేట్, గృహ రుణాలు పేరుకుపోయాయి.
ప్రస్తుత చైనా అప్పు ప్రపంచంలోని అన్ని దేశాల అప్పుల్లో 15 శాతంగా ఉంది. ఈ అప్పుల బాధను తగ్గించుకునేందుకు ఇటీవల చైనా పలు కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. బ్యాంకులు రుణాల మంజూరును కూడా తగ్గించేశాయి. బ్యాంకులకు రుణాలు ఎగవేస్తున్న వారి సంఖ్య ప్రస్తుతం చైనాలో రికార్డు స్థాయికి చేరింది. అప్పులు ఎగవేస్తున్న వారి సంఖ్య ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే గతేడాది కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉందని చైనా ఆర్థిక గణాంకాలు చెబుతున్నాయి.
ప్రస్తుత పరిణామాలతో చైనా ప్రజలు కూడా డబ్బు ఖర్చుకు జంకుతున్నారు. పొదుపు మంత్రం పాటిస్తున్నారు. దీంతో చైనాలో కొనుగోలు సామర్థ్యం భారీగా పడిపోయింది. కార్లు, కంప్యూటర్ల అమ్మకాలు భారీగా పడిపోయాయి. 2007లో వృద్ధి రికార్డు స్థాయిలో 14.2శాతానికి చేరుకున్నా.. తర్వాత తన ఆర్థిక వ్యవస్థపై చైనా పట్టును కోల్పోయింది. ఆ ప్రభావం గత ఐదు సంవత్సరాల నుంచి కనిపిస్తోంది. ఈ సంవత్సరానికి తన వృద్ధి లక్ష్యాన్ని 6.5శాతం నుంచి కనిష్టంగా 6శాతానికి సైతం తగ్గించింది చైనా.