గవర్నర్ ప్రమాణ స్వీకారం... ఏర్పాట్లలో అధికారులు
ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ గా నియమితులైన విశ్వభూషణ్ హరిచందన్ ఈనెల 24వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ కు సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వీ.సుబ్రహ్మణ్యం పర్యవేక్షిస్తున్నారు. విజయవాడలోని ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయాన్ని రాజ్ భవన్ గా మార్చే ప్రక్రియను ముమ్మరం చేశారు. ఈ పనులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వీ.సుబ్రహ్మణ్యం శనివారం నాడు పరిశీలించారు. రాష్ట్ర్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశ్వభూషణ్ హరిచందన్ తొలి గవర్నర్ […]
ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ గా నియమితులైన విశ్వభూషణ్ హరిచందన్ ఈనెల 24వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ కు సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వీ.సుబ్రహ్మణ్యం పర్యవేక్షిస్తున్నారు.
విజయవాడలోని ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయాన్ని రాజ్ భవన్ గా మార్చే ప్రక్రియను ముమ్మరం చేశారు. ఈ పనులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వీ.సుబ్రహ్మణ్యం శనివారం నాడు పరిశీలించారు.
రాష్ట్ర్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశ్వభూషణ్ హరిచందన్ తొలి గవర్నర్ కావడం విశేషం. ఇన్నాళ్లూ రెండు తెలుగు రాష్ట్రాలకు నరసింహన్ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గా వ్యవహరించారు. నూతన గవర్నర్ ఈ నెల 23 వ తేదీన భువనేశ్వర్ నుంచి నేరుగా తిరుపతికు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం తిరుపతి నుంచి గవర్నర్ గన్నవరం చేరుకుంటారు.
అక్కడ ఆయనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు, రాజ్ భవన్ సిబ్బంది స్వాగతం పలుకుతారు. గవర్నర్ హోదాలో తొలిసారి రాష్ట్రానికి వస్తున్న విశ్వభూషణ్ హరిచందన్ కు త్రివిధ దళాలు గౌరవ వందనం చేస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వీ.సుబ్రహ్మణ్యం తెలిపారు.
గన్నవరం విమానాశ్రయం నుంచి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం రాజ్ భవన్ చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరించారు.
ఆ మర్నాడు అంటే 24 వ తేదీ ఉదయం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో ప్రమాణస్వీకారం చేయిస్తారు.
మరోవైపు రాష్ట్రంలో గవర్నర్ అధికారిక వెబ్ సైట్ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా గవర్నర్ కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా విలేకరులకు తెలిపారు. గవర్నర్ వ్యక్తిగత సిబ్బంది వసతి సౌకర్యాలను దశల వారీగా చేపడతామని ఆయన తెలిపారు.