రాజన్న రాజ్యం వచ్చినట్లేనా?
వైసీపీ అధినేత రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుంచి తరచుగా అనే మాట ‘రాజన్న రాజ్యం’. తమ పార్టీ అధికారంలోకి వస్తే దివంగత నేత రాజశేఖర రెడ్డి ప్రభుత్వ కాలంలో ఉన్న సంక్షేమ రాజ్యాన్ని తిరిగి స్థాపిస్తామని ఆయన అంటూ ఉండేవారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో అదే ఆయన వేదమంత్రం అయింది. ప్రజలకు మాటిచ్చినట్లే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నలభై రోజుల్లోనే ఆయన రాజన్న రాజ్య స్థాపనకు పునాదులు వేశారు. తమ మొదటి బడ్జెట్‌ని సంక్షేమ బడ్జెట్‌గా మార్చడానికి […]
వైసీపీ అధినేత రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుంచి తరచుగా అనే మాట ‘రాజన్న రాజ్యం’. తమ పార్టీ అధికారంలోకి వస్తే దివంగత నేత రాజశేఖర రెడ్డి ప్రభుత్వ కాలంలో ఉన్న సంక్షేమ రాజ్యాన్ని తిరిగి స్థాపిస్తామని ఆయన అంటూ ఉండేవారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో అదే ఆయన వేదమంత్రం అయింది.
ప్రజలకు మాటిచ్చినట్లే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నలభై రోజుల్లోనే ఆయన రాజన్న రాజ్య స్థాపనకు పునాదులు వేశారు. తమ మొదటి బడ్జెట్‌ని సంక్షేమ బడ్జెట్‌గా మార్చడానికి చాలా కసరత్తే చేసినట్లు కనిపిస్తున్నది. విద్య, వైద్యం, సాంఘిక సంక్షేమం, వ్యవసాయం వంటి రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఆయన ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇది రాజన్న రాజ్యం అని పదే పదే ప్రజలకు గుర్తుకురావాలనుకున్నట్లున్నారు ముఖ్యమంత్రి. బడ్జెట్‌లో ప్రతిపాదించిన పథకాల్లో అత్యధిక పథకాలకు వైఎస్సార్ పేరే పెట్టారు.
రైతులకు పెట్టుబడిసాయం అందించేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్ రైతు భరోసా పథకం’ ఐదుకోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆశాదీపం. పొలం ఉన్న 60.06 లక్షల మంది రైతులకు, మరో 15.36 లక్షల కౌలు రైతులకు ఈ పథకం ద్వారా సాయం అందనున్నది. అంటే 75.42 లక్షల రైతుకుటుంబాలు సాయం అందుకుని లాభపడనున్నాయి. ఈ రైతులందరూ వైఎస్సార్ 9 గంటల ఉచిత విద్యుత్తు పథకం ద్వారా లాభం పొందుతారు.
నీటిపారుదల సౌకర్యం లేని భూముల్లో బోరుబావులు తవ్వించుకోవడానికి ‘వైఎస్సార్ బోర్‌వెల్ పథకం’ ద్వారా రైతులు లబ్ది పొందుతారు. అట్లాగే ‘వైఎస్సార్ వడ్డీలేని రుణాల పథకం’ ద్వారా రైతులు, మహిళా పొదుపు సంఘాలవారు రుణం పొందనున్నారు. ‘వైఎస్సార్ రైతు బీమా పథకం’, ‘వైఎస్సార్-పిఎం ఫసల్ బీమా యోజన’ వంటి పథకాల ద్వారా రైతులు పంట నష్టపోయిన సందర్భాల్లో పరిహారం పొందే వీలు కలుగుతుంది. అట్లాగే ‘వైఎస్సార్ ఎగ్రి లాబ్ పథకం’ ద్వారా రైతులు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందుకోనున్నారు.
కూడు పెట్టే రైతన్నను ఆదుకోవడమే కాదు గూడు లేనివారికి నీడ కల్పించేందుకు ‘వైఎస్సార్ గృహవసతి పథకం’ ప్రతిపాదితమయింది. ఇక వైసీపీకి ఫ్లాగ్ షిప్‌లాంటి ‘ఆరోగ్యశ్రీ పథకం’ ఉండనే ఉన్నది. అదీ వైఎస్సార్ పేరుమీదే కొనసాగుతుంది. పెన్షన్లకు పెట్టింది పేరు వైఎస్సార్ ప్రభుత్వ కాలం.
అందుకేనేమో దాదాపు పాత, కొత్త పెన్షన్ పథకాలకు కూడా ఆయన పేరే పెట్టినట్లున్నారు. ‘వైఎస్సార్ పెన్షన్’ కానుక అనే పేరుతో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, మత్స్యకారులు, ఎయిడ్స్ రోగులు, కిడ్నీ డయాలసిస్ రోగులు, గీత కార్మికులు, ట్రాన్స్‌జెండర్స్ విడి విడిగా పెన్షన్ పథకాల ద్వారా పెన్షన్ పొందుతారు. ఇదికాక ‘వైఎస్సార్ అభయ హస్తం’ అనే పథకం ప్రతిపాదితమయింది.
వైఎస్సార్ కళ్యాణ కానుక కింద, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు విడి విడిగా ఆర్థిక సాయం పొందే పథకాలు ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఇవికాక ‘వైఎస్సార్ కళ్యాణ కానుక-కులాంతర వివాహాల ప్రోత్సాహకం’, ‘వైఎస్సార్ కళ్యాణకానుక-వివాహ ప్రోత్సాహకం’ వంటివీ ఉన్నాయి. వివాహం జీవితంలో అత్యంత ముఖ్యమైనదిగా మన భారతీయులు భావిస్తారు. అటువంటి కార్యానికి సహాయం చేయడం ద్వారా వైఎస్సార్ పేరుని చిరస్థాయిగా నిలిచేలా ఈ పథకాలను రూపొందించారు.
ఇవికాక ఇతర ఆర్థిక సాయాలనూ వైఎస్సార్ పేరుతో ప్రతిపాదించారు. వైఎస్సార్ ఆర్థిక సాయం-నాయీబ్రాహ్మణ, రజక, దర్జీ, వైఎస్సార్ సాయం-చేనేత కార్మికులు, వైఎస్సార్ గ్రాంట్-మతపరమైన సంస్థలు, వైఎస్సార్ విద్యోన్నతి పథకం వంటివన్నీ ఇటువంటివే. వైఎస్సార్ చేయూత పథకం కింద వెనుకబడిన తరగతులకోసం 139 ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటుచేసి, వారికి చేయూత నిచ్చే ప్రతిపాదనా బడ్జెట్‌లో ఉంది. ఇవికాక వైఎస్సార్ స్కూల్ మెయింటెనెన్స్ గ్రాంట్, వైఎస్సార్ ట్రైబల్ మెడికల్ కాలేజి వంటివి ఎన్నో ఈ బడ్జెట్‌లో చోటుచేసుకున్నాయి.
ఇవన్నీ నిజంగా కార్యరూపం దాల్చితే వైసీపీకి కొన్ని దశాబ్దాల పాటు ప్రజల అండ చెక్కుచెదరకుండా ఉండిపోతుంది. మరి మాటలు, రాతలకే ఈ ప్రభుత్వం పరిమితమవుతుందా లేక వాటిని సాకారం చేస్తుందా? అనేది కాలమే నిర్ణయిస్తుంది.