'దొరసాని' సినిమా రివ్యూ
రివ్యూ: దొరసాని రేటింగ్: 2.5/5 తారాగణం: ఆనంద్ దేవరకొండ, శివాత్మిక, కన్నడ కిశోర్, వినయ్ వర్మ, శరణ్య తదితరులు సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి నిర్మాత: మధుర శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని దర్శకత్వం: కె.వి.ఆర్. మహేంద్ర లాంఛింగ్ కు ఎప్పుడైనా ప్రేమకథలే కరెక్ట్. భావోద్వేగాలు సరిగ్గా పండి, మ్యూజిక్ క్లిక్ అయితే సినిమా గట్టెక్కేసినట్టే. ఈ విషయం దొరసాని కూడా సేఫ్ వెంచర్ అనిపించుకుంటుంది. కానీ సరైన ప్లాట్ తీసుకోకపోవడం, అంతా కొత్తవాళ్లు కావడం వల్ల దొరసాని ఆశించిన […]
రివ్యూ: దొరసాని
రేటింగ్: 2.5/5
తారాగణం: ఆనంద్ దేవరకొండ, శివాత్మిక, కన్నడ కిశోర్, వినయ్ వర్మ, శరణ్య తదితరులు
సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి
నిర్మాత: మధుర శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని
దర్శకత్వం: కె.వి.ఆర్. మహేంద్ర
లాంఛింగ్ కు ఎప్పుడైనా ప్రేమకథలే కరెక్ట్. భావోద్వేగాలు సరిగ్గా పండి, మ్యూజిక్ క్లిక్ అయితే సినిమా గట్టెక్కేసినట్టే. ఈ విషయం దొరసాని కూడా సేఫ్ వెంచర్ అనిపించుకుంటుంది. కానీ సరైన ప్లాట్ తీసుకోకపోవడం, అంతా కొత్తవాళ్లు కావడం వల్ల దొరసాని ఆశించిన స్థాయిలో మెప్పించదు. దీంతో విజయ్ దేవరకొండ తమ్ముడు హీరో అయ్యాడు, రాజశేఖర్ చిన్నకూతురు హీరోయిన్ గా మారిందనే బజ్ ఎలిమెంట్స్ అంతగా పనిచేయలేదు.
80వ దశకంనాటి పల్లె జయగిరి. అందులో ఓ పెద్ద గడీ. ఆ గడీలో దొరసాని అలియాస్ దేవకి (శివాత్మిక). బయట జనాలకు కూడా తెలియకుండా పెరుగుతుంది. అదే ఊరిలో కూలిపని చేసుకునే కుటుంబంలో పుడతాడు రాజు. కానీ అందర్లా కాకుండా పట్నం వెళ్లి కాస్త చదువుకుంటాడు.
ఓ సందర్భంలో దొరసానిని చూసి ప్రేమలో పడతాడు రాజు. అతడ్ని ఓ 3-4 సార్లు చూసిన దొరసాని కూడా ప్రేమలో పడుతుంది. ఇలా మూగగా ప్రేమించుకుంటున్న ఈ జంట, తర్వాత తమ ప్రేమను వ్యక్తపరుచుకుంటారు. ఒక దశలో దొరసాని గదిలోకి రాజు వెళ్తాడు కూడా. అదే టైమ్ లో దొరకు వీళ్ల ప్రేమ సంగతి తెలుస్తుంది. తర్వాత ఏమైంది అనేది స్టోరీ.
దొరల పాలనలో ఓవైపు పీపుల్స్ వార్ ఉద్యమం జోరుగా సాగుతున్న టైమ్ లో ప్రేమలు అనేది అస్సలు ఉండేవి కావు. అలాంటిది ఏకంగా దొరసానినే ప్రేమించిన రాజు కథ ఏమై ఉంటుందనేది పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు.
అవును.. ఇందులో హీరోహీరోయిన్లు చనిపోతారు. ఇదొక ప్రేమ ప్రయాణం, దీన్ని అనుభూతి చెందాలంటూ మేకర్స్ మొదట్నుంచి చెబుతున్నారు. కానీ అలా అనుభూతి చెందే విధంగా దర్శకుడు మహేంద్ర సన్నివేశాలు రాయలేదు. సినిమాలో దాదాపు 5-6 సన్నివేశాలు సాగదీశాడు. దీంతో డాక్యుమెంటరీ ఫీలింగ్ వస్తుంది.
నిజానికి ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టడానికి చాలా అవకాశాలు, సందర్భాలు ఉన్నాయి. కథను ఏమాత్రం చెడగొట్టకుండా, అప్పటి గడీ వ్యవస్థను సహజసిద్ధంగా చూపిస్తూనే.. కమర్షియల్ అంశాలు పెట్టుకోవచ్చు. హీరోహీరోయిన్ల మధ్య ఓ ముద్దుసీన్ పెట్టి అప్పటి నిజమైన కథకు కాస్త ఫిక్షన్ ను జోడించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కానీ ఇదే పంథాను సినిమాలో చాలా చోట్ల అనుసరించి ఉన్నట్టయితే, ఈ సినిమా ఇప్పటి జనరేషన్ ను కూడా ఆకట్టుకొని ఉండేది. అలాంటి ప్రయత్నం చేయకపోవడం దొరసానికి పెద్ద మైనస్ అయింది.
హీరోహీరోయిన్ల విషయానికొస్తే ముందుగా శివాత్మిక రాజశేఖర్ గురించే చెప్పుకోవాలి. మొదటి సినిమానే అయినప్పటికీ ఆమె యాక్టింగ్ చాలా బాగా చేసింది. లవ్ సీన్స్ లో ఆమె ఎక్స్ ప్రెషన్స్ కుర్రకారు గుండెను తాకుతుంది. ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా చక్కగా చేసింది. ఒక విధంగా చెప్పాలంటే.. ఇది ఆమెకు డెబ్యూ మూవీ అనేకంటే.. ఈ సినిమాకు ఆమె ప్లస్ అయిందని చెప్పడమే కరెక్ట్.
హీరో ఆనంద్ దేవరకొండ ఫర్వాలేదు అనిపించుకున్నాడు. తొలి సినిమాకు అతడు ఎంచుకున్న కథ కరెక్ట్ అయినప్పటికీ.. యాక్టింగ్ విషయంలో ఆనంద్ ఇంకా చాలా మెరుగుపడాలి. క్యారెక్టర్ కు తగ్గ ఫిజిక్, డ్రెస్సింగ్, మేనరిజమ్స్ ఉన్నాయి కానీ సినిమాలో అతడి ఫ్రెండ్స్ గ్రూప్ తో కలిపి ఇతడ్ని చూస్తుంటే.. ఏదో తేడా కొట్టిన ఫీలింగ్ కలుగుతుంది.
ఇతర పాత్రల్లో అంతా కొత్తవాళ్లు నటించారు. సిద్ధడు పాత్ర పోషించిన అనురాగ్ చౌదరి, దొర పాత్రలో కనిపించిన వినయ్ వర్మ, శీను పాత్ర పోషించిన సన్నీ, వసంతలా అనుషా బాగా నటించారు. ఇక ఆనంద్ దేవరకొండ ఫ్రెండ్స్ పాత్రలు పోషించిన వాళ్లంతా బాగా నటించారు. శంకర్ అన్న పాత్ర పోషించిన కన్నడ కిషోర్, దాసి పాత్ర పోషించిన శరణ్యను మాత్రమే ఆడియన్స్ గుర్తుపడతారు.
ఇప్పటికీ దొరసాని సినిమాను జనాలు ఓకే అంటున్నారంటే దానికి కారణం టెక్నికల్ టీమ్. ప్రశాంత్ విహారి ఈ సినిమాను ఒంటిచేత్తో నిలబెట్టాడనే చెప్పాలి. అతడి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమాకు ప్రాణమయ్యాయి. అసలు ఇదే ఊపులో సినిమాలో కొన్ని సన్నివేశాలు తీసేసి, మరో 3 పాటలు అదనంగా పెట్టినా సరిపోయేది. అంతబాగా ఆకట్టుకున్నాడు ప్రశాంత్.
ఇతడి తర్వాత చెప్పుకోదగ్గ వ్యక్తి సినిమాటోగ్రాఫర్ సన్నీ కూరపాటి. ఇతడి ఫ్రేమింగ్ సినిమాకు ఓ కళ తీసుకొచ్చింది. ఆర్ట్ డైరక్టర్ మూర్తి నుంచి పూర్తి సహకారం అందడంతో.. తెలంగాణ 80ల నాటి వాతావరణాన్ని సన్నీ అద్భుతంగా చూపించగలిగాడు. దొరసాని సినిమాలో సన్నీ వాడిన లైటింగ్ మెప్పిస్తుంది.
బలాలు
హీరోయిన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ
బలహీనతలు
పాత కథ, సాగదీసిన కథనం, కమర్షియల్ ఎలిమెంట్స్ లోపించడం, క్లయిమాక్స్
రంగస్థలంలో క్లయిమాక్స్ చాలామందికి గుర్తుండే ఉంటుంది. అప్పటివరకు అన్నీ తానై చూసుకున్న రామ్ చరణ్, తన చేతులతో తనే స్వయంగా ప్రకాష్ రాజ్ ను చంపేస్తాడు. సినిమాలో ఇది అతిపెద్ద ట్విస్ట్. ఇలాంటి ట్విస్ట్ దొరసానిలో కూడా ఉంది. దాన్ని రంగస్థలం రేంజ్ లో ఆ సీన్ ను తీసినట్టయితే.. దొరసాని రిజల్ట్ నెక్ట్స్ లెవెల్లో ఉండేది. అలా బంగారమైన అవకాశాన్ని మేకర్స్ చేజార్చుకున్నారు. అందుకే ఈ దొరసాని ఓకే అనిపిస్తుంది. తప్ప సూపర్ అనిపించదు.