Telugu Global
NEWS

రాయలసీమకు ద్రోహం చేస్తున్న ముసుగు మేధావులు

రాయలసీమ…. సొంతింటిలోనే కొన్ని దుష్టశక్తులు ఉన్నాయన్నది ఆ ప్రాంతానికి చెందిన చాలా మంది భావన. రాయలసీమ గడ్డపై పుట్టి కూడా కులపిచ్చితోనో, లేదంటే … ఒక రాజకీయ పార్టీకి మంచి చేయాలన్న ఉద్దేశంతోనే… సీమకు నీళ్లు వస్తే తీసుకొచ్చిన పార్టీలకు మంచి పేరు వస్తుందనో ఆ ముసుగు మేధావుల భయం. అందుకే ఇప్పుడు జగన్‌ గోదావరి జలాలను శ్రీశైలంకు తెచ్చి రాయలసీమ, ప్రకాశం, గుంటూరు, నెల్లూరుకు నీరు అందిస్తామని ప్రకటించగానే ముసుగు మేధావులు, పసలేని పార్టీ నేతలు […]

రాయలసీమకు ద్రోహం చేస్తున్న ముసుగు మేధావులు
X

రాయలసీమ…. సొంతింటిలోనే కొన్ని దుష్టశక్తులు ఉన్నాయన్నది ఆ ప్రాంతానికి చెందిన చాలా మంది భావన. రాయలసీమ గడ్డపై పుట్టి కూడా కులపిచ్చితోనో, లేదంటే … ఒక రాజకీయ పార్టీకి మంచి చేయాలన్న ఉద్దేశంతోనే… సీమకు నీళ్లు వస్తే తీసుకొచ్చిన పార్టీలకు మంచి పేరు వస్తుందనో ఆ ముసుగు మేధావుల భయం.

అందుకే ఇప్పుడు జగన్‌ గోదావరి జలాలను శ్రీశైలంకు తెచ్చి రాయలసీమ, ప్రకాశం, గుంటూరు, నెల్లూరుకు నీరు అందిస్తామని ప్రకటించగానే ముసుగు మేధావులు, పసలేని పార్టీ నేతలు రౌండ్ టేబుల్ సమావేశాలంటూ రెచ్చగొట్టే చర్యలకు బయలుదేరారని రాయలసీమ ప్రాంత వాసులు మండిపడుతున్నారు.

రాయలసీమలో పుట్టి ఆ ప్రాంత ప్రయోజనాల కంటే టీవీ చర్చల్లో కనిపిస్తే చాలని భావించే మేధావులు, పనిలేక తిరుగుతున్న కొందరు వృద్ద నేతలను గుంపేసుకుని ప్రజలను రెచ్చగొట్టే పని మొదలు పెట్టారని ఆందోళన చెందుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వంతో కలిసి … నీటిని శ్రీశైలంకు తరలిస్తామని జగన్ ప్రకటించగానే… ఇంకా పూర్తి వివరాలు కూడా బయటకు రాకుండానే ముసుగు మేధావులు, తమ వంత మీడియాను వెంటేసుకుని ప్రాంతాల వారీగా జనాన్ని రెచ్చగొట్టేందుకు రంగంలోకి దిగడాన్ని వారు ప్రస్తావిస్తున్నారు.

తాగేందుకు కూడా నీళ్లు లేక ఒక వైపు రాయలసీమ ప్రజలు అల్లాడుతుంటే… అదే ప్రాంతంలో పుట్టిన వ్యక్తులు ఇప్పుడు నీటిని తెలంగాణతో కలిసి తరలించడం ఏమిటి అని ప్రశ్నించడం, కేసీఆర్‌ మాయలో పడొద్దు అని నీతులు చెప్పడంపై ఆ ప్రాంత వాసులు మండిపడుతున్నారు.

”ఈ ముసుగు మేధావులు, ఉనికిపాట్ల నేతలకు నిజంగా రాయలసీమపై ప్రేమ ఉందా?. ఉంటే శ్రీశైలం నుంచి రాయలసీమకు నీరు అందాలంటే ఉండాల్సిన కనీస నీటిమట్టం కోసం ఏనాడైనా చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారా?. శ్రీశైలం కనీస నీటిమట్టాన్ని పడేస్తూ సీమ నోట్లో దుమ్ముకొడుతూ చంద్రబాబు తెచ్చిన జీవో 69కు వ్యతిరేకంగా ఈ మేధావులు ఎప్పుడైనా టీవీ చర్చల్లో మాట వరుసకైనా ప్రశ్నించారా?. కాలువ ద్వారా నీరు వస్తున్నప్పుడు రైతులు కొద్ది మేర జలచౌర్యం చేయడం సాధారణమే. తుంగభద్ర నీరు కర్నాటక నుంచి కాలువ ద్వారానే కదా మనకు వస్తున్నది.

ఆ కాలువ శిధిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో జనం సమాంతర కాలువలు కావాలని అడిగితే… ఎన్నడైనా ఈ అనుకుల మేధావులు చంద్రబాబును ఆ అంశంలో ప్రశ్నించారా? రాయలసీమపై ప్రేమ వలకబోస్తున్న కమ్యూనిస్టులు ఎప్పుడైనా రాజధాని గురించి గానీ, శ్రీబాగ్ ఒప్పందం గురించి గానీ, సీమలో హైకోర్టు గురించి గానీ చంద్రబాబును అడిగారా?. లేక భజన చానల్స్‌లో చిడతలకే సమయం సరిపోవడం లేదా?” అని రాయలసీమ ప్రాంత పరిస్థితులను దగ్గరి నుంచి గమనిస్తున్న ప్రముఖులు గోపిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి ప్రశ్నించారు.

ఇప్పటికైనా రాయలసీమకు నీటిని తరలించే ప్రయత్నాలను…. రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డుకునే మేధావులు మొరగకుండా సంయమనం పాటించాలని… ప్రాజెక్టుపై పూర్తి వివరాలు బయటకు వచ్చే వరకైనా ప్రాంతాల వారీగా సమావేశాలుపెట్టి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలను ఈ ముసుగు మేధావులు మానుకోవాలని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోరారు.

First Published:  12 July 2019 10:54 AM IST
Next Story