Telugu Global
National

రాజ్యసభను కుదిపేసిన విజయసాయి రెడ్డి బిల్లు

భారతదేశంలో సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబడిన బీసీలకు వాళ్ళ జనాభాకు అనుగుణంగా చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్‌ బిల్లు తీవ్ర చర్చలకు, వాదోపవాదాలకు దారితీసింది. ఆయన ప్రవేశపెట్టిన బిల్లుకు కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ, ఆమ్‌ ఆద్మీ, ఆర్‌జేడీలతో పాటు పలు పార్టీలు మద్దతు తెలిపాయి. పార్లమెంట్‌ లో, రాష్ట్రాల అసెంబ్లీలలో బీసీలకు వాళ్ళ జనాభాకు అనుగుణంగా ప్రాతినిధ్యం లేదు కాబట్టి వాళ్ళకు న్యాయం […]

రాజ్యసభను కుదిపేసిన విజయసాయి రెడ్డి బిల్లు
X

భారతదేశంలో సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబడిన బీసీలకు వాళ్ళ జనాభాకు అనుగుణంగా చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్‌ బిల్లు తీవ్ర చర్చలకు, వాదోపవాదాలకు దారితీసింది. ఆయన ప్రవేశపెట్టిన బిల్లుకు కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ, ఆమ్‌ ఆద్మీ, ఆర్‌జేడీలతో పాటు పలు పార్టీలు మద్దతు తెలిపాయి. పార్లమెంట్‌ లో, రాష్ట్రాల అసెంబ్లీలలో బీసీలకు వాళ్ళ జనాభాకు అనుగుణంగా ప్రాతినిధ్యం లేదు కాబట్టి వాళ్ళకు న్యాయం చేయాలంటే జనాభా దామాషాన వారికి చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతుంటే న్యాయశాఖా మంత్రికి అంత అసహనం ఎందుకో అర్థం కావడం లేదని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.

బీసీ రిజర్వేషన్లు తమిళనాడులో సాధ్యం అయినప్పుడు ఇతర రాష్ట్రాల్లో, కేంద్రంలో ఎందుకు సాధ్యం కాదని విజయసాయి రెడ్డి నిలదీశారు. ఈ విషయంలో తమిళనాడు దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆయన కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ తమ ప్రభుత్వంలో 60 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిందని విజయసాయి రెడ్డి గుర్తు చేశారు. బీసీ అయిన మోడీ ఈ దేశానికి ప్రధానిగా ఉన్న సమయంలో కూడా బీసీలకు చట్టసభలలో సరైన ప్రాతినిధ్యం లేకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

ఈ బిల్లుపై ఓటింగ్‌ జరపాలని విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు. అయితే ఈ బిల్లుపై ఓటింగ్‌ జరపడం ఇప్పుడు సాధ్యం కాదని, ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి ప్రధాని సభలో ఉన్నప్పుడే నిర్ణయం తీసుకోవాలని, ఇప్పుడు సభలో ప్రధాని లేరు కాబట్టి…. ఈ బిల్లు పై ఓటింగ్‌ జరపలేమని కేంద్ర న్యాయశాఖామంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు.

పైగా ఇప్పుడు సభలో 50 శాతం కన్నా తక్కువమంది సభ్యులు ఉన్నారు కాబట్టి… ఇలాంటి రాజ్యాంగ సవరణ బిల్లుపై ఓటింగ్‌ జరపలేమని రాజ్యసభ వైస్‌ చైర్మన్‌ చెప్పారు. కాబట్టి ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని రవిశంకర్‌ ప్రసాద్‌ విజయసాయి రెడ్డిని కోరారు.

అయితే ఈ బిల్లును ఎటువంటి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకోనని, బిల్లును సభలో ప్రవేశపెట్టడానికి అనుమతించిన ప్రభుత్వం… తీరా ఓటింగ్‌కు వచ్చాక ఎందుకు వెనక్కు తీసుకోమంటుందో అర్థం కావడం లేదని…. ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లును ఉపసంహరించుకునే పరిస్థితే లేదని విజయసాయి రెడ్డి నిష్కర్షగా చెప్పారు. ఈ విషయంలో దాదాపు ప్రతిపక్ష పార్టీలన్నీ విజయసాయి రెడ్డికి మద్దతుగా నిలిచాయి.

అయితే ఇదే బిల్లును ఇప్పుడు ఓటింగ్‌కు స్వీకరించకపోయినా…. ఈ బిల్లును అంగీకరిస్తూ ప్రభుత్వమే దీనిని స్వీకరించి మరింత సమగ్రంగా ప్రవేశపెడితే మంచిదని విజయసాయి రెడ్డి సలహా ఇచ్చారు. అయితే ప్రభుత్వం అందుకు అంగీకరించకపోవడంతో ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా విజయసాయి రెడ్డి సభ నుంచి వాకౌట్‌ చేశారు.

First Published:  12 July 2019 7:19 AM GMT
Next Story