Telugu Global
Others

ముదురుతున్న జల సంక్షోభం

వడగాడ్పుల్లో వందలాది మంది మరణించిన తరవాత వర్షాలు వచ్చాయి. కానీ దేశంలోని చాలా ప్రాంతాలలో ఆలస్యంగా, అరకొరగా వర్షాలు కురిశాయి. వర్షాలు లేనందువల్ల నీటి ఎద్దడి ఏర్పడింది. చెన్నై, రాంచీలాంటి చోట్ల మంచి నీటికి కటకట తీవ్ర స్థాయికి చేరినందువల్ల దౌర్జన్య పూరితమైన కలహాలు జరిగాయి. చెరువులు, కుంటలు ఎండి పోవడంతో ప్రజలు దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. మంచి నీటి అవసారాల కోసం ప్రజలు కలహించుకోవలసి వచ్చింది. మంచి నీటి కొరత నగరాలకే పరిమితం కాలేదు. […]

ముదురుతున్న జల సంక్షోభం
X

వడగాడ్పుల్లో వందలాది మంది మరణించిన తరవాత వర్షాలు వచ్చాయి. కానీ దేశంలోని చాలా ప్రాంతాలలో ఆలస్యంగా, అరకొరగా వర్షాలు కురిశాయి. వర్షాలు లేనందువల్ల నీటి ఎద్దడి ఏర్పడింది. చెన్నై, రాంచీలాంటి చోట్ల మంచి నీటికి కటకట తీవ్ర స్థాయికి చేరినందువల్ల దౌర్జన్య పూరితమైన కలహాలు జరిగాయి.

చెరువులు, కుంటలు ఎండి పోవడంతో ప్రజలు దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. మంచి నీటి అవసారాల కోసం ప్రజలు కలహించుకోవలసి వచ్చింది. మంచి నీటి కొరత నగరాలకే పరిమితం కాలేదు. దేశంలోని చాలా ప్రాంతాలలో ఇదే పరిస్థితి ఉంది. అనావృష్టి లాంటి పరిస్థితులున్నాయి.

రుతుపవనాలు సవ్యంగా లేకపోవడం, వర్షపాతం తగ్గడం మాత్రమే నీటి ఎద్దడడికి కారణం కాదు. ఎంత లోతుకు వెళ్లినా నీటి జాడ కనిపించకపోవడంతో అనావృష్టి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. మహారాష్ట్ర లోని నాసిక్ జిల్లా బర్దె-చి-వాడిలో మహిళలు ప్రాణాలకు తెగించి 60 అడుగుల లోతున బావుల్లో ఉన్న నీరు తెచ్చుకోవలసి వస్తోంది. మన దేశంలో భూగర్భ జలాలను ఉపయోగిస్తున్న తీరులో మరే దేశంలోనూ వినియోగించడం లేదు.

భూగర్భ జలం ప్రజలకు మేలు చేసేదిగా పరిగణించడం లేదు. అనేక నగరాల్లో వనరులకు మించిన నీటిని ఉపయోగిస్తున్నారని ఖరగ్ పూర్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి (ఐ.ఐ.టి.) జరిపిన సర్వేలో తేలింది. తూర్పు భారతంలో నీరు సమృద్ధిగా ఉందనుకునే చోట కూడా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. నీటి కొరత ఇతర అంశాలతో సంబంధం లేనిది కాదు. నీటి కొరతను నివారించడానికి తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ దుస్థితి ఎదురవుతోంది.

నీటి కొరత ప్రభావం స్త్రీ పురుష భేదాలు, కులం, ప్రాంత భేదాలలో కూడా కొట్టిచ్చినట్టు కనిపిస్తోంది. నీరు సమకూర్చవలసిన బాధ్యత మహిళల మీదే ఉంది. మహారాష్ట్ర లోని థానే జిల్లాలోని డెంగన్ మల్ లో నీళ్లు తేవడం కోసం పురుషులు ఇద్దరు ముగ్గురిని పెళ్లాడుతున్నారు. పగలంతా వారు నీరు తేవలసి వస్తోంది. ఇలా రెండు మూడు పెళ్లిళ్లు జరిగే గ్రామాలు విచిత్రంగా నదులు, ఆనకట్టలకు చేరువలోనే ఉన్నాయి. కాని వాటిలోని నీటిని ముంబైకి తరలిస్తున్నారు. మహిళలు దూర ప్రాంతాలకు వెళ్లి నీరు తేవలసి వస్తోంది. కాని ఇంట్లో ఉన్న వారి నీటి అవసరాలు తీర్చిన తరవాతే నీళ్లు తెచ్చే మహిళలు నీళ్లు వాడుకోవాలి.

నీరు దొరకడం దుర్లభమైపోతున్న దశలో మార్కెట్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తోంది. కలిగిన వారు నీటి మీద పెత్తనం చేస్తున్నారు. నీటి వినియోగంలో అసమానతలున్నాయి. ఆ నీటిని విచక్షణతో వినియోగించుకోవడం లేదు. దిల్లీ, ముంబై లాంటి నగరాలలో ఎక్కువ ఆదాయం, సామాజిక స్థాయి ఉన్న వారికే నీరు దక్కుతోంది. నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న చెన్నై లాంటి నగరాలలో అపార్ట్ మెంట్లలో ఉండే వారు రోజుకు నాలుగైదు ట్యాంకర్ల నీరు తెప్పించుకోగలుగుతున్నారు.

అల్పాదాయ వర్గాల వారికి ఈ అవకాశం లేదు. గ్రామీణ కుటుంబాలలో 18 శాతం మందికే కుళాయిల్లో నీరు అందుతోంది. చిన్న రైతులు నీరు దొరకక ప్రాణాలు తీసుకుంటున్నారు. లేదా వలస పోతున్నారు. మహారాష్ట్రలోని మరాఠ్వాడాలో నీరు దొరకని గ్రామాలు నిర్మానుష్యమవుతున్నాయి. ఉత్తర ప్రదేశ్ లోని బుందేల్ ఖండ్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లోని కొండ ప్రాంతాల పరిస్థితీ ఇదే.

మన దేశంలో నీటి ఎద్దడికి ప్రధాన కారణం బోలెడు డబ్బు ఖర్చు పెట్టి సుదూర ప్రాంతాలకు నీరు తరలించడం. ఈ క్రమంలో చాలా నీరు వృధా అవుతుంటుంది. చెరువుల లాంటి వాటికి మరమ్మతు చేసే పనులను విస్మరించారు. ఒక్క చెన్నైలోనే 350 చెరువులు మాయమైనాయి. నగరాలను విస్తరిస్తున్నారు తప్ప నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచించడం లేదు. అలాగే వర్షపు నీటిని నిలవ చేయడం, వాడిన నీటిని శుద్ధి చేసి మళ్లీ వాడడం మీదా శ్రద్ధ లేదు. స్థిరాస్తి వ్యాపారం బాగా పెరిగినందువల్ల ట్యాంకర్ల లాబీ బలపడింది.

ట్యాంకర్లు సరఫరా చేసే వారు భూగర్భ జలాలను కొల్లగొడ్తున్నారు. అలాగే వరద ప్రాంతాలనూ, పచ్చదనాన్ని ధ్వసం చేస్తున్నారు. చెరువులు, కుంటలు పూడ్చి వాటిని ఆక్రమించి ఇళ్లు నిర్మించడంవల్ల నీరు నిలవ ఉండే సదుపాయం తగ్గడంతో పాటు భూమిలోకి నీరు ఇంకే అవకాశమూ తగ్గుతోంది. దీనివల్ల వరదల ముప్పూ పెరుగుతోంది.

నగరాల నుంచి, పరిశ్రమల నుంచి వచ్చే మురుగునీటి గురించి పట్టించుకునే వారే లేరు. దీనివల్ల దేశంలోని 70 శాతం నీటి వనరులు కలుషితం అయిపోతున్నాయి. కలుషిత నీటివల్ల ఏటా రెండు లక్షల మంది మృత్యువాత పడ్తున్నారని నీతీ ఆయోగ్ లెక్కలే చెప్తున్నాయి. నగరాలకు చేరువన జరుగుతున్న వ్యవసాయం మురుగు నీటితోనే సాగుతోంది. ఆ నీటిలో లోహాలు, విషపూరిత రసాయనాలు ఉండడంవల్ల ప్రజారోగ్యం దెబ్బ తింటోంది.

ప్రస్తుతం ఉన్న నీటి కొరత కేప్ టౌన్ లోని తీవ్ర నీటి ఎద్దడిని తలపిస్తోంది. నీతీ ఆయోగ్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. అయితే ఇలాంటి సమాచారం వల్ల భయ వాతావరణం నెలకొంటుంది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి చేసే ప్రయత్నాలు మరింత తీవ్ర సంక్షోభానికి దారి తీస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న జల విద్యుత్ పథకాలే సవ్యంగా పని చేయడం లేదన్న దాఖలాలు ఉన్నప్పటికీ నదుల అనుసంధానం కొనసాగిస్తున్నారు. దీని వల్ల మరింత దుర్భర పరిస్థితి ఏర్పడి ఘర్షణలకు దారి తీస్తుంది. నీటి సంక్షోభం ఆహార, ఆరోగ్య అభద్రతకు దారి తీస్తుంది. అందువల్ల నీటిని సమర్థంగా, సవ్యంగా వినియోగించుకోవాలి.

ఈ పరిస్థితి నుంచి గట్టెక్కే మార్గం లేకపోలేదు. అయితే ఎలాంటి పంటలు పండించాలి, జీవన విధానాలను ఎలా సవరించుకోవాలి అని ఆలోచించక తప్పదు. నీటిని నిలవ చేయడం, నీటి వినియోగాన్ని నియంత్రించడం అవసరం. నీటి వినియోగానికి సంబంధించిన విధానాలు నీరు అందుబాటులో లేని వర్గాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. తగిన గణాంకాలు, సమాచారం సేకరించాలి. కేవలం ఇంజినీరింగ్, సాంకేతిక పరిజ్ఞానంవల్లే ప్రయోజనం లేదు. వాస్తవ పరిస్థితి గ్రహించగలగాలి. వాటి మానాన వాటిని వదిలేస్తే నీటి వనరులు పునరుజ్జివానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశమే ఇవ్వడం లేదు.

(ఎకనామిక అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

First Published:  9 July 2019 3:08 AM IST
Next Story