రాయుడి షాట్లు అలా గుర్తుండి పోయాయి
అంబటి రాయుడు రిటైర్‌మెంట్ వార్త వినగానే ఎవరో సొంత మనిషికి అన్యాయమైన ఫీలింగ్…. ఎంత గొప్పబౌలర్ వేసిన బంతి అయినా సరే అలవోకగా స్టాండ్స్‌లోకి నిర్భయంగా పంపగల ఆటగాడు క్రీడా రాజకీయాలకు బలవడం అయ్యో అనిపించింది. హైదరాబాద్‌లోని ఎల్బి స్టేడియంలో రాయుడు ఆడిన షాట్లు బుల్లెట్లలాగా స్టాండ్స్‌లోకి దూసుకెళ్లి అక్కడి డ్రెస్సింగ్ రూమ్ అద్దాలు పగలడం ఇంకా కళ్లముందే ఆడుతోంది. ఒక బక్కపలచని కుర్రాడు అంత బలమైన షాట్లను ఆడటం చూసి నమ్మలేక పోయా అప్పట్లో… 2001-02 […]
అంబటి రాయుడు రిటైర్‌మెంట్ వార్త వినగానే ఎవరో సొంత మనిషికి అన్యాయమైన ఫీలింగ్…. ఎంత గొప్పబౌలర్ వేసిన బంతి అయినా సరే అలవోకగా స్టాండ్స్‌లోకి నిర్భయంగా పంపగల ఆటగాడు క్రీడా రాజకీయాలకు బలవడం అయ్యో అనిపించింది.
హైదరాబాద్‌లోని ఎల్బి స్టేడియంలో రాయుడు ఆడిన షాట్లు బుల్లెట్లలాగా స్టాండ్స్‌లోకి దూసుకెళ్లి అక్కడి డ్రెస్సింగ్ రూమ్ అద్దాలు పగలడం ఇంకా కళ్లముందే ఆడుతోంది. ఒక బక్కపలచని కుర్రాడు అంత బలమైన షాట్లను ఆడటం చూసి నమ్మలేక పోయా అప్పట్లో…
2001-02 నుంచి అంబటి రాయుడు పేరు వినపడుతున్నా2004 అండర్ 19 వరల్డ్ కప్ పర్ఫార్మెన్స్‌తో అందరి నోళ్లలో నానడం మొదలు పెట్టాడు. సహజంగా క్రికెట్ పట్ల ఉన్న ఆసక్తితో అతన్ని మ్యాచ్‌లు గమనించడం మొదలుపెట్టా. ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు అడకముందే తెలుగు రాష్ట్రాల్లో అతనికి అభిమానులు తయరయ్యారు. రాయుడి మ్యాచ్‌లతో సంబంధం లేకుండా ఆ సంఖ్య అలా పెరుగుతూనే పోయింది. అందులో తెలంగాణ సీఎమ్ కేసీఆర్ కూడా ఒకరు.
2014 నవంబర్‌లో శ్రీలంకతో హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌కు కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడాకారుల పరిచయ కార్యక్రమం మొదలు అయి రాయుడి దగ్గరికి రాగానే ఆప్యాయంగా ఆయన చేతిని తీసుకుని ముద్దుపెట్టారు కేసీయార్. రాయుడి రిటైర్‌మెంట్ ప్రకటన వెలువడిందే ఆలస్యం నువ్వు ఎప్పటికీ మాకు గుర్తుంటావు అని కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు.
You will always remain a super talented champ @RayuduAmbati ?
Selectors may have snubbed you but Indian cricket lovers will remember your brilliance for a long time. Good luck in your second innings
— KTR (@KTRTRS) July 3, 2019
ఇక నాలాంటి సాధారణ అభిమానుల సంఖ్యకైతే లెక్కేలేదు. రాయుడు ఆడే మ్యాచ్ తప్పకుండా టీవీలో చూస్తా.. ముఖ్యంగా ఐపిఎల్ టైమ్‌లో అయితే అవతల ఎవరు ఆడుతున్నా సరే రాయుడు ఔట్ అయితే టీవీ కట్టేయడమే..
అప్పట్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లోని ఓ పెద్దమనిషి తన కొడుకుని ప్రమోట్ చేసుకోవడం కోసం రాయుడు జీవితంతో ఆడుకున్నాడు. యువకుడైన రాయుడు తిరగబడ్డాడు.. ఫలితంగా దుందుడుకు వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. సదరు పెద్దమనిషి రాయుడు విషయంలో తను తప్పు చేశాను అని ఆమధ్య కాలంలో చెప్పుకున్నాడు కూడా.
అతని రాజకీయాలు తట్టుకోలేక హైదరాబాద్ టీమ్ని వదిలి పెట్టాడు. అయినా అతని నీడ పడుతూనే ఉంటే ఇక ఎదగలేనేమో అని కపిల్‌దేవ్, కిరణ్‌మోరే ఆధ్వర్యంలోని ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసిఎల్)లో చేరాడు. ఐపిఎల్ తరహాలో అప్పట్లో మ్యాచ్‌లు జరిగేవి. హైదరాబాద్ హీరోస్ ప్లేయర్‌గా 2007 సీజన్‌లో రాయుడు ఆడిన మ్యాచ్‌లు ఆ టోర్నీలోనే హైలైట్.
కేవలం రాయుడు మ్యాచ్‌లు చూడడం కోసం అప్పట్లో మిత్రుడు స్పోర్ట్స్ డెస్క్ ఇన్చార్జ్ క్రిష్ణారావుతో కలిసి రోజు స్టేడియంకు వెళ్లేవాడిని. ఆ సీజన్‌లో ప్రెస్ గ్యాలరీని బౌండరీ లైన్ పక్కనే ఏర్పాటు చేశారు. జర్నలిస్టులు అందరూ అందులో కూర్చొనే మ్యాచ్ రిపోర్ట్ చేసేవారు. బౌండరీ దగ్గరి ఫీల్డర్లు వచ్చి రిపోర్టర్లతో మాట్లాడి వెళుతుండేవారు. గేమ్ తరువాత ప్లేయర్లు, జర్నలిస్టులు అందరికీ ఒకే దగ్గర డిన్నర్ ఏర్పాటు చేశారు. చాలా మంది క్రీడాకారులు రిపోర్టర్లతో కలవడం మాట్లాడడం చేసేవారు. మోబైల్ ఫోన్ కెమరాల యుగం ఇంకా మొదలుకాలేదు. దీంతో క్రీడాకారులతో సెల్ఫీల చాన్స్‌లేదు.
లీగ్ ఫైనల్స్‌లో లాహోర్ బాద్షాస్తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ హీరోస్ తరపున ఆడిన రాయుడు కొట్టిన సిక్స్‌లు ఇప్పటికీ గుర్తున్నాయి. ప్రెస్ బాక్స్ మీదు దూసుకు వెళ్లిన బాల్స్ వెనక ఉన్న అద్దాలను పగలకొట్టాయి. అంతే స్టేడియం అంతా చప్పట్ల హోరు… అనధికారిక మ్యాచ్ అయినా సరే ఎల్‌బి స్టేడియం అంతా ఇసుకేస్తే రాలని జనం… అందులో సగంపైగా రాయుడి కోసం వచ్చినవారే.
2004-05 సమయానికి రావాల్సిన ఇంటర్నేషనల్ ఛాన్స్ 2013 వరకు రాకపోయినా ఓపికగా ఎదురు చూశాడు. తన టీమ్‌లో సభ్యులుగా ఉన్న సురేష్ రైనా, శిఖర్ ధావన్, దినేష్ కార్తిక్, రాబిన్ ఉతప్ప, ఆర్పీసింగ్‌లతోపాటు, తన జూనియర్లయిన రోహిత్ శర్మ, చటేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లి, పీయూష్ చావ్లా తదితరులు ఇండియన్ టీమ్‌కు ఆడినా.. మేరా నెంబర్ కబ్ ఆయేగా అని ఆశగా ఎదురు చూశారు. చివరికి తనకూ చాన్స్ వచ్చింది కానీ ఎక్కువ రోజులు నిలబడలేదు.
రోహిత్ శర్మ, జడేజా, శిఖర్ ధావన్‌లాగా టన్నులు కొద్ది అవకాశాలు రాకున్నా వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకున్నాడు. హెచ్‌సిఏ రాజకీయాలే సెలెక్షన్ కమిటీలోనూ ఎదురుకావడంతో నిరాశతో రిటైర్మెంట్ ప్రకటించాడు.
గౌతం గంభీర్ చెప్పినట్లు సెలెక్టర్లు ఐదుగురు తమ కెరీర్ మొత్తంలో చేసిన పరుగుల కంటే రాయుడు ఒక్కడు చేసిన పరుగులే ఎక్కువ.
వందల మ్యాచ్‌లు ఆడాల్సిన ఆటగాడు కెరీర్ మొత్తంలో వంద పరుగులు చేయని ఎమ్మెస్కే ప్రసాద్ లాంటి వారి కారణంగా రిటైర్ కావడం బాధాకరం…
పోలీస్ తప్పుడు నివేదిక కారణంగా ఐఏఎస్ కాలేక, సర్వీస్ కోచింగ్ సెంటర్ పెట్టి వందల మంది ఐఏఎస్‌లను తయారు చేసిన రావ్‌గారిలా… రాయుడు కూడా క్రికెట్ అకాడమి పెట్టి తనలాంటి అగ్రెసివ్ క్రికెట్ ప్లేయర్లను తయారు చేస్తే మంచిదేమో.
-కిరణ్ కుమార్ గోవర్ధనమ్