వారిని ఒక్క అడుగు కూడా కదిలించలేకపోతున్న కొత్త ప్రభుత్వం
రిజిస్ట్రేషన్ శాఖలో పాతుకుపోయిన అవినీతి అధికారులు ప్రభుత్వాన్ని, మంత్రులను కూడా ధిక్కరిస్తున్నారు. లంచాలతో బాగా బలిసిపోయిన సబ్ రిజిస్టార్లు కొందరు… ఏకంగా మంత్రులనే కొనేందుకు సిద్ధమంటున్నారు. విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పోస్టింగ్ కోసం ఒక అధికారి నేరుగా డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ వద్దకు వెళ్లి కోటి రూపాయలు లంచం ఆఫర్ చేశాడు. దీంతో కంగుతిన్న డిప్యూటీ సీఎం బోస్… అధికారిని బాగా తిట్టి పంపించేశారు. ఆరా తీయగా […]
రిజిస్ట్రేషన్ శాఖలో పాతుకుపోయిన అవినీతి అధికారులు ప్రభుత్వాన్ని, మంత్రులను కూడా ధిక్కరిస్తున్నారు. లంచాలతో బాగా బలిసిపోయిన సబ్ రిజిస్టార్లు కొందరు… ఏకంగా మంత్రులనే కొనేందుకు సిద్ధమంటున్నారు.
విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పోస్టింగ్ కోసం ఒక అధికారి నేరుగా డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ వద్దకు వెళ్లి కోటి రూపాయలు లంచం ఆఫర్ చేశాడు. దీంతో కంగుతిన్న డిప్యూటీ సీఎం బోస్… అధికారిని బాగా తిట్టి పంపించేశారు.
ఆరా తీయగా పటమట సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సబ్ రిజిస్టార్‌గా ఉన్న వ్యక్తికి రోజుకు సాయంత్రానికి లంచం రూపంలో లక్షకుపైగా అందుతుందని తేలింది. అందుకే అక్కడ పోస్టింగ్ కోసం కోటి ఇచ్చేందుకు కూడా సిద్ధపడ్డారని చెబుతున్నారు.
మరో అధికారి రెండు కోట్లు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారట. పరిస్థితి ఇంత దారుణంగా ఉండడంతో బదిలీలపై సుభాష్ చంద్రబోస్ కొన్ని ఆదేశాలు జారీ చేశారు.
అత్యంత కీలకమైన కార్యాలయాల్లో సబ్ రిజిస్టార్లుగా గ్రూప్-1 అధికారులను నియమించాలని ఆదేశించారు. ఏసీబీ కేసులు ఎదుర్కొంటున్న వారిని పక్కన పెట్టాలని ఆదేశించారు. ఐదేళ్లకు పైగా ఒకే చోట ఉన్న వారిని తక్షణం బదిలీ చేయాలని స్పష్టం చేశారు.
మంత్రి ఆదేశాల తర్వాత ఏలూరులో బదిలీల కౌన్సిలింగ్ నిర్వహించారు. మంత్రి ఆదేశాలు బేఖాతరు చేస్తూ కొందరు అధికారులు పోస్టింగ్‌లు దక్కించుకున్నారు. కౌన్సిలింగ్ సమయంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయని…. అందుకే మంత్రి ఆదేశాలను ధిక్కరించేందుకు కూడా అధికారులు ఏమాత్రం వెనుకాడలేదని చెబుతున్నారు.
ఏసీబీ కేసుల్లో ఉన్న వారిని పక్కన పెట్టాలని డిప్యూటీ సీఎం ఆదేశించినా… గతంలో లంచం తీసుకుంటూ విజయవాడలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన దుర్గాప్రసాద్ చక్రం తిప్పి… అత్యంత ఆదాయం ఉండే కంచికచర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పోస్టింగ్ సాధించారు.
అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన గాంధీనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సింగ్ అనే సబ్ రిజిస్టార్ ఎనిమిదేళ్లుగా అక్కడే తిష్టవేశారు. ఐదేళ్లకు మించి ఒకే చోట ఉన్న వారిని బదిలీ చేయాలని డిప్యూటీ సీఎం చెప్పినా… సింగ్‌కు మరోసారి అక్కడే పోస్టింగ్ దక్కింది. దీంతో ఉద్యోగులు కంగుతింటున్నారు. అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న సింగ్‌కు తిరిగి అక్కడే పోస్టింగ్ రావడం వెనుక భారీ తంతు నడిచిందని చెబుతున్నారు.
ఇలా డిప్యూటీ సీఎం ఆదేశాలను కౌన్సిలింగ్ నిర్వహించిన అధికారులు ఏమాత్రం కేర్ చేయలేదు. ఒక్క పటమటలో మాత్రమే డిప్యూటీ సీఎం బోస్ చెప్పినట్టు కొత్త వారిని నియమించారు. కానీ అక్కడ కూడా అప్పటికే పాతుకుపోయిన పాత సిబ్బంది ముందు కొత్తగా వచ్చిన సబ్ రిజిస్టార్ సాధించేది ఏమీ ఉండదంటున్నారు.