Telugu Global
NEWS

భారత క్రీడారంగంలో అదే మాట, అదే బాట!

స్వతంత్ర భారత క్రీడారంగం మొదటి ఆరున్నర దశాబ్దాల కాలంలో సాధించిన ప్రగతి ఒకఎత్తయితే…నరేంద్ర మోదీ ప్రధానిగా గత ఐదేళ్లకాలంలో సాధించిన ప్రగతి మరో ఎత్తుగా నిలిచిపోతుంది. మోదీ ఆలోచనలు, క్రీడాభివృద్ధి పథకాలను గత క్రీడామంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ అత్యంత సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ఆశించిన ఫలితాలు సాధించారు. ఖేలో ఇండియా, టువర్డ్స్ ఒలింపిక్స్ పోడియం లాంటి వినూత్న పథకాలతో అత్యధిక యువజన జనాభా కలిగిన భారత క్రీడారంగానికి జవసత్వాలను అందించారు. నరేంద్ర మోదీ దార్శనికత…. నరేంద్ర మోదీ […]

భారత క్రీడారంగంలో అదే మాట, అదే బాట!
X

స్వతంత్ర భారత క్రీడారంగం మొదటి ఆరున్నర దశాబ్దాల కాలంలో సాధించిన ప్రగతి ఒకఎత్తయితే…నరేంద్ర మోదీ ప్రధానిగా గత ఐదేళ్లకాలంలో సాధించిన ప్రగతి మరో ఎత్తుగా నిలిచిపోతుంది.

మోదీ ఆలోచనలు, క్రీడాభివృద్ధి పథకాలను గత క్రీడామంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ అత్యంత సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ఆశించిన ఫలితాలు సాధించారు.

ఖేలో ఇండియా, టువర్డ్స్ ఒలింపిక్స్ పోడియం లాంటి వినూత్న పథకాలతో అత్యధిక యువజన జనాభా కలిగిన భారత క్రీడారంగానికి జవసత్వాలను అందించారు.

నరేంద్ర మోదీ దార్శనికత….

నరేంద్ర మోదీ వరుసగా రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడంతో దేశభవిష్యత్ మాత్రమే కాదు…భారత క్రీడారంగ భవిష్యత్ కు సైతం భరోసా వచ్చినట్లయ్యింది.

మొదటి ఐదేళ్ల కాలంలో మాజీ ఒలింపియన్ రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ క్రీడామంత్రిగా తన విధులను అత్యంత సమర్థవంతంగా నిర్వర్తిస్తే.. ఆయన వారసుడిగా, సరికొత్త క్రీడామంత్రిగా అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన కిరణ్ రిజ్జూ బాధ్యతలు చేపట్టారు.

అదే మాట…అదే బాట…

గత ఐదేళ్ల కాలంలో భారత క్రీడారంగం…రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ మంత్రిగా కళ్లు చెదిరే ప్రగతి సాధించిందని..తాను సైతం అదేబాటలో నడుస్తానని క్రీడామంత్రి రిజ్జూ అంటున్నారు.

దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిథిలోని 651 జిల్లాలలో ప్రతిభాన్వేషణ శిబిరాలు నిర్వహించడం ద్వారా
మొత్తం 16 క్రీడాంశాలలో.. ఎంపిక చేసిన 12వేల 415 మంది ప్రతిభావంతులైన యువతీయువకులను రానున్న కాలంలో మరింతగా ప్రోత్సహిస్తామని చెప్పారు.

క్రీడలన్నింటికీ సమాన ప్రాధాన్యం..

ఒలింపిక్స్ క్రీడాంశాలతో పాటు…దేశవాళీ క్రీడలకు తగిన ప్రాధాన్యమివ్వటమే తమ ప్రభుత్వ లక్ష్యమని కిరణ్ రిజ్జూ తేల్చి చెప్పారు.

ఇప్పటికే..అథ్లెటిక్స్, విలువిద్య, బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, బాక్సింగ్, ఫుట్ బాల్, జిమ్నాస్టిక్స్, జూడో, కబడ్డీ, ఖో-ఖో, షూటింగ్, స్విమ్మింగ్,వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, కుస్తీ, హాకీ లాంటి క్రీడలకు ప్రభుత్వం ఊతమిస్తోందని గుర్తు చేశారు.

ఒలింపిక్స్ పతకాలే లక్ష్యంగా…

గత ఏడాది గోల్డ్ కోస్ట్ వేదికగా ముగిసిన కామన్వెల్త్ గేమ్స్, జకార్తా వేదికగా ముగిసిన ఆసియా క్రీడలు, బ్యునోస్ ఏర్స్ వేదికగా జరిగిన ప్రపంచ యువజన ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు అంచనాలకు మించి పతకాలు సాధించడం ద్వారా సరికొత్త స్ఫూర్తిని నింపారని.. అదే జోరును రానున్న మూడు ఒలింపిక్స్ క్రీడల్లో కొనసాగించడానికి తగ్గట్టుగా వ్యూహాలకు రూపకల్పన చేస్తున్నట్లు కొత్త క్రీడామంత్రి ప్రకటించారు.

వచ్చే ఏడాది టోక్యో వేదికగా జరిగే ఒలింపిక్స్ క్రీడల్లో భారత అథ్లెట్లు గత క్రీడలకంటే ఎక్కువగా పతకాలు సాధించడం ఖాయమని క్రీడామంత్రి ధీమాగా చెబుతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా జరిగిన వివిధ అంతర్జాతీయ పోటీలలో పాల్గొన్న భారత షూటర్లు అసాధారణంగా రాణించడం ద్వారా ఇప్పటికే ఏడు ఒలింపిక్స్ బెర్త్ లు సాధించడం దేశానికే గర్వకారణమని క్రీడామంత్రి ప్రశంసించారు.

ఖేలో ఇండియా ద్వారా వెలుగులోకి వచ్చిన యువషూటర్లు మను బాకర్, సౌరభ్ చౌదరీ, రాహీ సర్నోబట్…ఇప్పటికే ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు పతకాలతో తమ సత్తా చాటుకొన్నారు. టోక్యో ఒలింపిక్స్ కు సైతం అర్హత సాధించడం శుభసూచకమని కిరణ్ రిజ్జూ భావిస్తున్నారు.

క్రీడాసంఘాలకు స్వతంత్ర ప్రతిపత్తి…

భారత ఒలింపిక్స్ సమాఖ్యకు అనుబంధంగా ఉన్న వివిధ క్రీడాసంఘాల వ్యవహారాలలో తాము జోక్యం చేసుకొనే ప్రసక్తేలేదని, ఎవరి సమస్యలను వారే పరిష్కరించుకొనే వాతావరణం కల్పిస్తామని కొత్త క్రీడామంత్రి భరోసా ఇస్తున్నారు.

మణిపూర్ రాజధాని ఇంపాల్ లో ఏర్పాటు చేస్తున్న భారత తొలి క్రీడా విశ్వవిద్యాలయాన్ని సకల హంగులతో పూర్తి చేయటం తనముందున్న లక్ష్యమని కిరణ్ రిజ్జూ అంటున్నారు.

స్పోర్ట్స్ సైన్స్, స్పోర్ట్స్ టెక్నాలజీ, స్పోర్ట్ మేనేజ్ మెంట్, స్పోర్ట్స్ కోచింగ్ లాంటి అంశాలతో పాటు ఎంపిక చేసిన కొన్ని క్రీడల కోసం.. అంతర్జాతీయస్థాయి సదుపాయాలు ఉంటాయని ప్రకటించారు.

మొత్తం మీద…కొత్త క్రీడామంత్రి నేతృత్వంలో భారత క్రీడారంగం సరికొత్తగా మెరిసిపోడం ఖాయంగా కనిపిస్తోంది.

First Published:  1 July 2019 2:57 AM IST
Next Story