కమలం వైపు కడియం అడుగులు?
కడియం శ్రీహరి. తెలంగాణ రాష్ట్ర సమితిలో సీనియర్ నాయకుడు. గత ప్రభుత్వంలో ఆయన ఉప ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్ర్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు అత్యంత ఆప్త మిత్రుడు. ఇదంతా గతం. ప్రస్తుతం మాత్రం ఆయన పట్టించుకోతగ్గ నాయకుడు కాదు. వరంగల్ జిల్లాలో మారిన రాజకీయ సమీకరణాలలో కడియం శ్రీహరి స్థానం రోజురోజుకు తగ్గుతోంది. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి పైకి మిత్రులుగా, లోలోపల శత్రువులుగా ఉండేవారు కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావు. […]
కడియం శ్రీహరి. తెలంగాణ రాష్ట్ర సమితిలో సీనియర్ నాయకుడు. గత ప్రభుత్వంలో ఆయన ఉప ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్ర్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు అత్యంత ఆప్త మిత్రుడు. ఇదంతా గతం.
ప్రస్తుతం మాత్రం ఆయన పట్టించుకోతగ్గ నాయకుడు కాదు. వరంగల్ జిల్లాలో మారిన రాజకీయ సమీకరణాలలో కడియం శ్రీహరి స్థానం రోజురోజుకు తగ్గుతోంది. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి పైకి మిత్రులుగా, లోలోపల శత్రువులుగా ఉండేవారు కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావు.
టీఆర్ఆర్ లో ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు హవా కొనసాగుతోంది. వరంగల్ జిల్లాలో ఆయన ఏం చెబితే అదే జరుగుతోందట. ఇది మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి మింగుడు పడడం లేదు.
తెలంగాణ శాసనసభకు జరిగిన ముందస్తు ఎన్నికల్లో కడియం శ్రీహరి మాట చెల్లుబాటు కాలేదు. అక్కడి నుంచి తగ్గుతున్న కడియం శ్రీహరి ప్రాధాన్యత ఇప్పుడు ఆయన ఏకంగా పార్టీ మారే స్థితికి వచ్చిందని అంటున్నారు.
తాజా పరిస్థితుల నేపథ్యంలో కడియం శ్రీహరి చూపు భారతీయ జనతా పార్టీ వైపు మళ్లినట్టుగా చెబుతున్నారు. శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత సీనియర్ నాయకుడిగా తనకు మంత్రివర్గంలో స్ధానం దక్కుతుందని కడియం శ్రీహరి ఆశించారు. ఆ ఆశ అడియాశ అయ్యింది. ఆ ఎన్నికలలో స్టేషన్ ఘనపూర్ టిక్కెట్ ను పార్టీలో తనకు అంతర్గత శత్రువైన డాక్టర్ తాడికొండ రాజయ్యకు రాకుండా చేసేందుకు విశ్వప్రయత్నాలు చేశారు కడియం శ్రీహరి.
అయితే ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. పార్టీ అధిష్టానం తన మాట కాదన్నందుకు ఆనాటి నుంచే కినుక వహించారు కడియం శ్రీహరి.
ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో వరంగల్ స్థానాన్ని తన కుమార్తె కావ్యకు ఇవ్వాలని కడియం శ్రీహరి అధిష్టానాన్ని కోరారు. ఆ కోరికను టీఆర్ఎస్ అధిష్టానం మన్నించలేదు.
ఇవన్నీ ఒకవైపు వేధిస్తూంటే తన చిరకాల శత్రువు ఎర్రబెల్లి దయాకర్ రావుకు మంత్రి పదవి దక్కడం కూడా మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి పుండు మీద కారం జల్లినట్టుగానే అయ్యింది.
ఇక ఇటీవలే జరిగిన తెలంగాణ ఆవిర్భావదినోత్సవానికి హాజరుకావాల్సిందిగా కడియం శ్రీహరిని ఆహ్వానించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అయితే కడియం శ్రీహరి ఆ కార్యక్రమానికి రాకుండానే జెండా ఆవిష్కరణ పూర్తి చేసేశారు మంత్రి దయాకర్ రావు.
ఈ సంఘటనతో మరింత మనస్తాపం చెందిన కడియం శ్రీహరి పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
బీజేపీ తెలంగాణ నాయకులు కూడా ఆయనతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మరో పదిపదిహేను రోజుల్లో కడియం శ్రీహరి తెలంగాణ రాష్ట్ర సమితికి గుడ్ బై చెప్పి కమల తీర్ధం పుచ్చుకోవడం ఖాయమంటున్నారు. ఆయన చేరికతో వరంగల్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ మరింత బలపడే అవకాశాలున్నాయని అంటున్నారు.