ప్లీజ్ పార్టీ మారకండి.... కాపు నేతలతో చంద్రబాబు
“మనం అధికారంలో ఉన్నప్పుడు పార్టీలోని కాపు నాయకులందరికీ అనేక మేళ్లు చేశాం. పార్టీ, ప్రభుత్వ పదవుల్లో కాపు నాయకులకు ప్రాముఖ్యత కల్పించాం. ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉందని వదిలి వెళ్ళి పోవడం భావ్యం కాదు” ఇవీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీకి చెందిన కాపు నాయకులతో టెలిఫోన్ లో నెరపిన చర్చలు. కాపు నాయకులు తెలుగుదేశం పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారంటూ వస్తున్న వార్తలపై ఆ పార్టీ అధ్యక్షుడు […]
“మనం అధికారంలో ఉన్నప్పుడు పార్టీలోని కాపు నాయకులందరికీ అనేక మేళ్లు చేశాం. పార్టీ, ప్రభుత్వ పదవుల్లో కాపు నాయకులకు ప్రాముఖ్యత కల్పించాం. ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉందని వదిలి వెళ్ళి పోవడం భావ్యం కాదు” ఇవీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీకి చెందిన కాపు నాయకులతో టెలిఫోన్ లో నెరపిన చర్చలు.
కాపు నాయకులు తెలుగుదేశం పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారంటూ వస్తున్న వార్తలపై ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సన్నిహితుల వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. తాను విదేశాలకు వెళ్ళగానే మాజీ శాసనసభ్యుడు తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో 13 మంది కాపు నాయకులు కాకినాడలో సమావేశం కావడం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మింగుడు పడడం లేదంటున్నారు.
పార్టీలో ఉన్న కాపు నాయకులందరూ పార్టీని వదిలి వెళ్ళిపోతే ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలతోపాటు మరో నాలుగైదు జిల్లాలలో పార్టీ పూర్తి స్థాయిలో పట్టు కోల్పోతుందని చంద్రబాబునాయుడు ఆందోళన చెందుతున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తెలుగుదేశం పార్టీని నైతికంగా దెబ్బతీయడంతో పాటు తాను వ్యక్తిగతంగా ఆత్మ స్థైర్యం కోల్పోయేలా చేయడమే భారతీయ జనతా పార్టీ వ్యూహంగా చంద్రబాబునాయుడు భావిస్తున్నారు.
దీంతో ముందుగా పార్టీ నుంచి ఎవరు బయటకు వెళ్లిపోకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు తన సన్నిహితులకు సూచించినట్లు సమాచారం.
ఇందులో భాగంగానే గురువారం నాడు కాపు సామాజికవర్గానికి చెందిన నాయకులతో టెలిఫోన్ లో మాట్లాడిన చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు వారితో సమావేశం అయ్యేందుకు నిర్ణయించారు.
శుక్రవారం అమరావతిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగే సమావేశానికి హాజరుకావాల్సిందిగా కాపు నాయకులకు వర్తమానం పంపించారు.
తెలుగుదేశం పార్టీలోని కాపు నాయకులకు దిశానిర్దేశం చేస్తున్న మాజీ శాసనసభ్యుడు తోట త్రిమూర్తులు తెలుగుదేశం పార్టీ పైనా, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పైనా నేరుగా విమర్శలు సంధించారు. దీంతో చంద్రబాబు నాయుడుతో జరిగే సమావేశానికి తోట త్రిమూర్తులు హాజరయ్యే అవకాశం లేదంటున్నారు.
ఆయనతో పాటు ఐదారుగురు సీనియర్ నాయకులు కూడా చంద్రబాబుతో సమావేశానికి గైర్హాజరయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. వీరంతా ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అధిష్టానంతో చర్చలు జరిపారని, వీరు పార్టీని వీడటం ఖాయమని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
శుక్రవారంనాడు కాపు నాయకులతో జరిగే సమావేశం పార్టీకి ఎంతో కీలకంగా మారిన దశలో వివిధ పార్టీలు, తెలుగు రాష్ట్ర్రాలకు చెందిన ప్రజల చూపు కూడా ఈ సమావేశం వైపు ఉండడం గమనార్హం.