ప్రపంచకప్ సెమీస్ లో ఆస్ట్రేలియా
కంగారూ దెబ్బతో ఇంగ్లండ్ బేజారు క్రికెట్ మక్కాలో ఇంగ్లండ్ కకావికలు ప్రపంచకప్ లో సెమీస్ చేరిన తొలిజట్టు ఘనతను డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా సొంతం చేసుకొంది. క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా ముగిసిన రౌండ్ రాబిన్ లీగ్ పోటీలో 5వ ర్యాంకర్ ఆస్ట్రేలియా 64 పరుగులతో టాప్ ర్యాంక్ ఇంగ్లండ్ ను కంగు తినిపించింది. ఆస్ట్రేలియా విజయంలో ప్రధానపాత్ర వహించిన ఓపెనర్ కమ్ కెప్టెన్, సెంచరీహీరో ఆరోన్ ఫించ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు […]
- కంగారూ దెబ్బతో ఇంగ్లండ్ బేజారు
- క్రికెట్ మక్కాలో ఇంగ్లండ్ కకావికలు
ప్రపంచకప్ లో సెమీస్ చేరిన తొలిజట్టు ఘనతను డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా సొంతం చేసుకొంది. క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా ముగిసిన రౌండ్ రాబిన్ లీగ్ పోటీలో 5వ ర్యాంకర్ ఆస్ట్రేలియా 64 పరుగులతో టాప్ ర్యాంక్ ఇంగ్లండ్ ను కంగు తినిపించింది.
ఆస్ట్రేలియా విజయంలో ప్రధానపాత్ర వహించిన ఓపెనర్ కమ్ కెప్టెన్, సెంచరీహీరో ఆరోన్ ఫించ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
కంగారూ టాప్ గేర్….
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో ఐదుసార్లు విజేత ఆస్ట్రేలియా కీలక విజయంతో సెమీస్ చేరిన తొలిజట్టుగా నిలిచింది.
లార్డ్స్ క్రికెట్ స్టేడియం వేదికగా ముగిసిన 7వ రౌండ్ మ్యాచ్ లో ఆతిథ్య ఇంగ్లండ్ ను ఆస్ట్రేలియా కోలుకోలేని దెబ్బ కొట్టింది.
సెమీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే నెగ్గితీరాల్సిన ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొన్న ఇంగ్లండ్ భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది.
ముందుగా బ్యాటింగ్ కు దిగిన కంగారూ టీమ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 285 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆస్ట్రేలియా ఓపెనర్ కమ్ కెప్టెన్ ఆరోన్ ఫించ్..116 బాల్స్ లో 2 సిక్సర్లు, 11 బౌండ్రీలతో 100 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 53 పరుగులు సాధించాడు.
ప్రస్తుత ప్రపంచకప్ లో ఫించ్ కు ఇది రెండో సెంచరీ కావడం విశేషం.
గత 11 వన్డేల్లో ఇంగ్లండ్ తొలి ఓటమి…
మ్యాచ్ నెగ్గాలంటే 50 ఓవర్లలో 286 పరుగులు భారీ స్కోరు చేయాల్సిన ఇంగ్లండ్ ను కంగారూ ఫాస్ట్ బౌలర్ల జోడీ…బెరెన్ డోర్ఫ్, మిషెల్ స్టార్క్ దెబ్బ మీద దెబ్బ కొట్టి కోలుకోనివ్వకుండా ఒత్తిడి పెంచారు.
ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ 89 పరుగులతో ఒంటరిపోరాటం చేసినా ప్రయోజనం లేకపోయింది. చివరకు ఇంగ్లండ్ 44.4 ఓవర్లలోనే 221 పరుగులకే కుప్పకూలింది.
బెరెన్ డోర్ఫ్ 44 పరుగులిచ్చి 5 వికెట్లు, స్టార్క్ 43 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టారు. దీంతో 64 పరుగుల తేడాతో నెగ్గిన ఆస్ట్రేలియా 7 రౌండ్లలో 6 విజయాలు, 12 పాయింట్లతో… సెమీఫైనల్స్ నాకౌట్ చేరిన తొలిజట్టుగా నిలిచింది.
ఇంగ్లండ్ ప్రత్యర్థిగా ఆస్ట్రేలియా ఆడిన గత 11 వన్డేల్లో పది పరాజయాల అనంతరం తొలివిజయం సాధించడం విశేషం.
గాల్లో దీపంలా ఇంగ్లండ్ సెమీస్ బెర్త్…
ప్రపంచకప్ బరిలోకి ప్రపంచ నంబర్ వన్ జట్టుగా, హాట్ ఫేవరెట్ గా దిగిన ఇంగ్లండ్ ఓటమి వెంట ఓటమితో సెమీస్ బెర్త్ ఆశలను సంక్లిష్టం చేసుకొంది.
ఇప్పటివరకూ ఆడిన రౌండ్ రాబిన్ లీగ్ ఏడు మ్యాచ్ ల్లో నాలుగు విజయాలు, మూడు పరాజయాలతో నాలుగో స్థానానికి పడిపోయింది.
పాకిస్థాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా జట్ల చేతిలో కంగుతిన్న ఇంగ్లండ్ మిగిలిన రెండురౌండ్ల మ్యాచ్ ల్లో నెగ్గితీరాల్సి ఉంది.
ప్రధానంగా ఈనెల 30న పవర్ ఫుల్ టీమిండియాతో జరిగే మ్యాచ్ లో ఓడితే సెమీస్ రేస్ నుంచి ఇంగ్లండ్ వైదొలగక తప్పదు.