"దేశం"లో నిస్తేజం.... బాబు తెస్తారా ఉత్తేజం?
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన శాసనసభ, లోక్ సభ ఎన్నికలు తెలుగుదేశం పార్టీని నిస్తేజంగా మార్చేశాయి. ఈ ఎన్నికలలో వచ్చిన ఫలితాలతో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పూర్తి నిర్వేదంలోకి వెళ్లిపోయారు. తాము అధికారంలోకి రాకపోయినా గౌరవ ప్రదమైన స్థానాలైనా దక్కుతాయని తెలుగుదేశం నాయకులు భావించారు. పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా మారింది. శాసనసభలో 23 స్థానాలు, లోక్ సభలో మూడు స్థానాలు మాత్రమే విజయం సాధించి తెలుగుదేశం పార్టీ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఫలితాల ప్రకటన తర్వాత […]
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన శాసనసభ, లోక్ సభ ఎన్నికలు తెలుగుదేశం పార్టీని నిస్తేజంగా మార్చేశాయి. ఈ ఎన్నికలలో వచ్చిన ఫలితాలతో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పూర్తి నిర్వేదంలోకి వెళ్లిపోయారు. తాము అధికారంలోకి రాకపోయినా గౌరవ ప్రదమైన స్థానాలైనా దక్కుతాయని తెలుగుదేశం నాయకులు భావించారు. పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా మారింది.
శాసనసభలో 23 స్థానాలు, లోక్ సభలో మూడు స్థానాలు మాత్రమే విజయం సాధించి తెలుగుదేశం పార్టీ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఫలితాల ప్రకటన తర్వాత మెల్లి మెల్లిగా ఊపిరి అందుకుంటున్న సమయంలో నలుగురు రాజ్యసభ సభ్యులు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలోకి మారడం తెలుగుదేశం శ్రేణులను కలవరపెడుతోంది.
దీంతోపాటు తెలుగుదేశం పార్టీకి చెందిన 13 మంది కాపు నాయకులు కాకినాడలో రహస్యంగా సమావేశం కావడం కూడా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలను కలచివేస్తోంది. గోరుచుట్టుపై రోకలిపోటు అన్న చందాన సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 15 మంది శాసన సభ్యులు అధికార బీజేపీలో చేరతారని వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాలు తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు నిద్రను దూరం చేసాయి అంటున్నారు.
నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ పర్యటనకు వెళ్లారు. ఆయన అలా వెళ్లగానే తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు నలుగురు భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు. ప్రస్తుతం ఉన్న సంక్లిష్ట పరిస్థితులను తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు తప్ప వేరే ఎవరూ మార్చలేరని తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు భావిస్తున్నారు.
విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత పార్టీలో నూతన ఉత్తేజం తీసుకువచ్చేలా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటారని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల ఆశగా తెలుస్తోంది.
పార్టీ ప్రక్షాళనతో పాటు తన అనుభవాన్ని రంగరించి తెలుగుదేశం పార్టీకి జవజీవాలు తీసుకు వస్తారని పార్టీ నాయకులు, కార్యకర్తలు నమ్మకంగా ఉన్నారు.
పార్టీలో నెలకొన్న నిస్తేజాన్ని, నిర్లిప్తతను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే పోగొడతారని పార్టీ నాయకులు, కార్యకర్తలు నమ్ముతున్నారు. ఆయన విదేశీ పర్యటన ముగించుకుని ఎప్నుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారు.
మరి నారా చంద్రబాబు నాయుడు పార్టీకి పూర్వ వైభవం తీసుకు వస్తారో లేక నిస్తేజంగా మిగిలిపోతారో తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.