బిజెపి ఎవరినీ బ్రతకనివ్వడం లేదు " ఎంపీ కనకమేడల
కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశంలో మరే రాజకీయ పార్టీని బ్రతకనివ్వడం లేదని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తాము తప్ప ఇంకెవరూ దేశంలో ఉండరాదని నిర్ణయించుకున్నారని, అందులో భాగంగానే తమ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను బిజెపిలో విలీనం చేసుకున్నారని కనకమేడల ఆరోపించారు. శుక్రవారంనాడు ఓ ఛానల్ లో జరిగిన చర్చా […]
కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశంలో మరే రాజకీయ పార్టీని బ్రతకనివ్వడం లేదని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తాము తప్ప ఇంకెవరూ దేశంలో ఉండరాదని నిర్ణయించుకున్నారని, అందులో భాగంగానే తమ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను బిజెపిలో విలీనం చేసుకున్నారని కనకమేడల ఆరోపించారు.
శుక్రవారంనాడు ఓ ఛానల్ లో జరిగిన చర్చా గోష్టిలో పాల్గొన్న ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుల విలీనం చట్టపరంగా చెల్లదని తేల్చి చెప్పారు. స్వతహాగా న్యాయవాది కూడా అయిన రవీంద్ర కుమార్ విలీనం అంశంపై తాము కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. పార్టీ మారిన తమ సభ్యులపై వేటు వేయాలని ఆయన డిమాండ్ చేశారు.
మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో పార్టీ మారిన తమ రాజ్యసభ సభ్యులకు మూడ్ ఆఫ్ ది నేషన్ నరేంద్రమోడీకే తప్ప ఎన్నికల్లో ఓటమి పాలైన రాజకీయ పార్టీలకు ఉండదని ఎద్దేవా చేశారు. ” మీరు మూడ్ ఆఫ్ ద నేషన్ అంటున్నారు. అది మీకు, నాకు ఇచ్చింది కాదు. ప్రధానిగా మోడీకి మాత్రమే ఇచ్చారు. మనల్ని ప్రతిపక్షంలో కూర్చోమన్నారు” అని కనకమేడల రవీంద్ర కుమార్ స్పష్టం చేశారు.
అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దేశంలోని ఇతర రాజకీయ పార్టీలతో మైండ్ గేమ్ ఆడుతోందని, విలీనం ప్రక్రియ ఎన్నికల కమిషన్ లో లేనే లేదని ఆయన అన్నారు. ఇంతకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది శాసనసభ్యులు, ముగ్గురు లోక్ సభ సభ్యులను తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నప్పుడు ఎన్నికల నిబంధన గురించి మీకు తెలియదా..? అని అడిగిన ప్రశ్నకు కనకమేడల రవీంద్ర కుమార్ సమాధానాన్ని దాటవేశారు.
“తెలంగాణలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూడా పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించారు” అని ఆయన చెప్పారు. “వారి సంగతి సరే. మీ గురించి చెప్పండి” అని పదే పదే ప్రశ్నించినా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కనకమేడల రవీంద్ర కుమార్ నుంచి మాత్రం సమాధానం రాలేదు.
మరోవైపు తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను బిజెపిలో విలీనం చేసుకోవడం రాజ్యాంగ బద్ధంగానే జరిగిందని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. “రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ లోని నాలుగో పేరాలో ఉన్న 1 వ క్లాజ్ ప్రకారం విలీన ప్రక్రియ జరిగింది. ఇది సరైనదే” అని జీవీఎల్ స్పష్టం చేశారు.