Telugu Global
NEWS

‘మేఘా’ కీర్తి కిరీటంలో కాళేశ్వరం కలికితురాయి

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలక ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. అరుదైన దృశ్యం కనువిందు చేసింది. గోదావరి జలాలు మేడిగడ్డ ఎత్తిపోతల కేంద్రం నుంచి అన్నారం బ్యారేజీ వైపు ఉరకలు వేశాయి. గోదావరి తన సహజసిద్ధ ప్రవాహానికి విరుద్ధంగా దిగువ నుంచి ఎగువకు ప్రవహించింది. ఇది అరుదైన దృశ్యం. మేడిగడ్డ (కన్నెపల్లి) పంపు హౌస్‌లోని ఆరో నంబర్ యూనిట్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు స్విచ్ ఆన్ చేయడంతో మెషీన్ నుంచి 40 క్యూమెక్స్ గోదావరి […]

‘మేఘా’ కీర్తి కిరీటంలో కాళేశ్వరం కలికితురాయి
X

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలక ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. అరుదైన దృశ్యం కనువిందు చేసింది. గోదావరి జలాలు మేడిగడ్డ ఎత్తిపోతల కేంద్రం నుంచి అన్నారం బ్యారేజీ వైపు ఉరకలు వేశాయి. గోదావరి తన సహజసిద్ధ ప్రవాహానికి విరుద్ధంగా దిగువ నుంచి ఎగువకు ప్రవహించింది. ఇది అరుదైన దృశ్యం.

మేడిగడ్డ (కన్నెపల్లి) పంపు హౌస్‌లోని ఆరో నంబర్ యూనిట్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు స్విచ్ ఆన్ చేయడంతో మెషీన్ నుంచి 40 క్యూమెక్స్ గోదావరి జలాలు 1.053 కిలో మీటర్ ప్రెషర్ మేయిన్స్ ద్వారా ప్రయాణించి డెలివరీ సిస్టర్న్ ద్వారా కాలువలోకి విడుదలయ్యింది. ఈ దృశ్యం కనువిందు చేసింది. పుడమితల్లిని పులకరింపజేసింది.

బీడువారిన తెలంగాణ భూములను పచ్చని పంటలతో బంగారు తెలంగాణగా రూపుదిద్దేందుకు పంపుహౌస్‌ నుంచి నీళ్లు పరుగు తీశాయి. ఈ దృశ్యం చూపరులను ఆకట్టుకుంది. అందులోనూ మేడిగడ్డ నీళ్లు అన్నారం వైపు పరుగులు తీసే తొలి దృశ్యం కావడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆ తర్వాత ప్రాజెక్టు విశిష్ఠతలను గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రులు కే చంద్రశేఖర రావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలకు మేఘా ఎండీ పీవీ కృష్ణారెడ్డి వివరించారు.

మేడిగడ్డ పంప్‌ హౌస్‌ ప్రారంభం….

శుక్రవారం కాళేశ్వరం పథకం ప్రారంభంలో భాగంగా మేఘా ఇంజనీరింగ్‌ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (మేఘా‌) సంస్థ నిర్మించిన మేడిగడ్డ ఎత్తిపోతల కేంద్రం నుంచి మూడు మెషీన్ల ద్వారా గోదావరి నీళ్లు ఉరకలేశాయి. ఈ కార్యక్రమంలో ఇఎన్‌సి వెంకటేశ్వర్లు, ఇరు రాష్ట్రాల మంత్రులు ఈటెల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, మేఘా సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పి.వి. కృష్ణారెడ్డి, డైరెక్టర్‌ బి. శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ ముఖ్యఅతిధిగా హాజరుకాగా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు మేడిగడ్డ పంప్‌ హౌస్‌ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రపంచంలోనే అరుదైన, అతిపెద్దదైన ఎత్తిపోతల పథకంగా విశిష్టత సంతరించుకోగా అందులో మేడిగడ్డకు మరో ప్రత్యేకత ఉంది. ఈ ఎత్తిపోతల పథకంలో మొత్తం 22 పంపింగ్‌ స్టేషన్లు ఉండగా అందులో మేడిగడ్డ మొదటిది కావటం విశేషం. మేడిగడ్డ పంపింగ్‌ కేంద్రంలో 17 మెషీన్లు ఉండగా, ఒక్కో మెషీన్‌ 40 మెగావాట్ల సామర్థ్యంతో పనిచేసి 60 క్యుమెక్స్‌ నీటిని డెలివరీ సిస్ట్రన్‌ ద్వారా గురుత్వాకర్షణతో కాలువలోకి (13.5 కిలోమీటర్స్‌) నీటిని విడుదల చేస్తుంది.

22 ఎత్తిపోతల కేంద్రాలలో 17 ‘మేఘా’ నిర్మిస్తోంది…

కాళేశ్వరం పథకంలో మొత్తం 22 ఎత్తిపోతల కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయి. అందులో 17 కేంద్రాలను ‘మేఘా’ నిర్మిస్తున్నది. మొదటి దశ కింద లింక్‌-1లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంపుహౌస్‌లను నీటిని పంపు చేసేందుకు సిద్ధం చేసింది. అదే విధంగా లింక్‌-2 లోని ప్రపంచంలోని అతిపెద్దదైన భూగర్భ పంపింగ్‌ కేంద్రం ప్యాకేజీ-8 నుంచి రోజుకు 2 టిఎంసీల నీటిని పంపుచేసే విధంగా సిద్ధం చేసింది.

మేడిగడ్డ పంప్‌హౌస్‌లో ఒక్కొక్క యూనిట్‌ 40 మెగావాట్ల సామర్థ్యంతో 60 క్యూమెక్స్‌ నీటిని ఎత్తిపోసే విధంగా నిర్మించారు. 91 మీటర్ల ఎత్తున గోదావరికి ఆనుకుని నిర్మించిన ఈ కేంద్రంలో మొత్తం 660 క్యూమెక్స్‌ నీటిని ఎత్తిపోయాలనేది లక్ష్యం. ఇందులో మొదటిదశ కింద 11 యూనిట్లతో 440 మెగావాట్ల పంపింగ్‌ కేంద్రం పనిచేస్తుంటుంది.

రికార్డు టైంలో 77 లక్షల ఘనపు మీటర్ల పని పూర్తిచేసిన ‘మేఘా’

దాదాపు ఏడాదిన్నర కాలంలో అతిపెద్దదయిన ఈ ఎత్తిపోతల కేంద్రాన్ని నిర్మించడంలో ఎలక్ట్రో మెకానికల్‌ పనులతో పాటు సివిల్‌ పనులకు ప్రత్యేకత ఉంది. అప్రోచ్‌ కాలువ 9.75 లక్షల ఘనపు మీటర్ల సామర్థ్యంతోనూ, వీటి గోడలు 51వేల ఘనపు మీటర్లతోనూ, పంప్‌హౌస్‌ ముందుభాగం 45.73 లక్షల ఘనపు మీటర్లతోను నిర్మించారు.

ఇంత తక్కువ కాలంలో వీటిని నిర్మించడం ‘మేఘా’కు మాత్రమే సాధ్యమైంది. ప్రెషర్‌ మెయిన్‌కు 10.56, డెలివరీ సిస్టర్న్‌కు 10.50, మొత్తం అన్నీ కలిపి 77.07 లక్షల ఘనపు మీటర్ల పనిని ‘మేఘా’ పూర్తి చేసింది. మేడిగడ్డ నుంచి ఎత్తిపోసిన నీటిని మళ్లీ అన్నారం బ్యారేజీ ఎగువ భాగంలోకి చేర్చడానికి అవసరమైన భారీ కాలువను కోటి యాభై లక్షల ఘనపు మీటర్ల సామర్థ్యంతో పూర్తి చేసింది.

గోదావరి నీటిని ఎత్తిపోయడం మేడిగడ్డ నుంచే మొదవుతుంది. పైగా భూ ఉపరితంపైన ఇంతవరకు ఎక్కడా లేని స్థాయిలో తొలిసారిగా భారీ ఎత్తిపోతల కేంద్రం మేడిగడ్డ వద్ద నిర్మితమై పాక్షికంగా వినియోగంలోకి వచ్చింది. ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల కేంద్రం కాళేశ్వరంలో భాగంగా లక్ష్మీపూర్‌ వద్ద ప్యాకేజ్‌-8 ఒక్కొక్కటి 139 మెగావాట్ల సామర్థ్యంతో మొత్తం 7 యూనిట్లతో నిర్మిస్తుండగా, ఆ తర్వాత స్థానాన్ని ప్యాకేజ్‌-6లో 7 యూనిట్లు ఒక్కోటి 124 మెగావాట్లు, ప్యాకేజ్‌ 10లో 4 యూనిట్లు ఒక్కోటి 106 మెగావాట్లు, ప్యాకేజ్‌-11లో 4 యూనిట్లు ఒక్కోటి 135 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మితమవుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదటిదశలో ఈ ఏడాది సాగునీరు అందించేవిధంగా నిర్మిస్తున్న ఎత్తిపోతల కేంద్రాల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ప్యాకేజ్‌-6, 8 సిద్ధమయ్యాయి. వీటిలో ప్యాకేజ్‌-6 మినహా మిగిలినవన్ని ‘మేఘా’నిర్మిస్తోంది.

33 యూనిట్లు నీటి పంపింగ్‌కు సిద్ధం

మేడిగడ్డలో 17, అన్నారంలో 12, సుందిళ్లలో 14, ప్యాకేజీ 8 లో 7 యూనిట్లు ఏర్పాటవుతున్నాయి. ఇందులో ఇప్పటికే 33 యూనిట్లు నీటి పంపింగ్‌కు సిద్ధమయ్యాయి.

ఇప్పటి వరకు దేశం మొత్తం మీద అత్యధిక సామర్థ్యం కలిగిన ఎత్తిపోతల పంపింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఘనత ‘మేఘా’ దక్కించుకుంది. ఇప్పుడు తాజాగా భూ ఉపరితంపైన అతిపెద్ద ఎత్తిపోత కేంద్రం మేడిగడ్డ వద్ద 440 మెగావాట్లతో ఏర్పాటు చేసిన ఘనత కూడా ఈ సంస్థకే దక్కింది.

కాళేశ్వరంలో ప్రధాన పాత్ర ‘మేఘా’దే

ఇప్పటికే లింక్‌-1లోని దాదాపుగా అన్ని యూనిట్లను ‘మేఘా’ పంపింగ్‌ కు సిద్ధం చేసింది. ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో 4627 మెగావాట్ల సామర్థ్యంతో 120 పంపింగ్‌ యూనిట్లు ఏర్పాటవుతుండగా అందులో 105 యూనిట్లను ‘మేఘా’ నిర్మిస్తోంది. దీనిని బట్టి కాళేశ్వరంలో ప్రధాన పాత్రను ‘మేఘా’ నిర్వహిస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన పంప్‌లు, మోటార్లను బీహెచ్‌ఈఎల్‌, ఆండ్రిజ్‌, జైలమ్‌ లాంటి ఎలక్ట్రోమెకానికల్‌ సంస్థలు సమకూరుస్తున్నాయి. అయితే నిర్మాణ పని మొత్తం ‘మేఘా’ చేస్తోంది. ఇంతవరకూ ప్రపంచంలో ఒకేచోట 17 మెషీన్లతో పంపింగ్‌ కేంద్రం ఏర్పాటు కావడం ఎక్కడా లేదు.

ప్రపంచంలోనే అతిపెద్ద పంపింగ్‌ కేంద్రం

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ హంద్రీనీవా ఒక్కటే అతిపెద్దది కాగా, నిర్మాణంలో వున్న దేవాదుల కూడా పెద్దదే. కాగా, వాటిలో ఏ పంపింగ్‌ కేంద్రంలోనూ లేనంతగా మేడిగడ్డ పంపింగ్‌ కేంద్రంలో 17 మెషీన్లు ఏర్పాటు అవుతున్నాయి. ఇందులో మొదటిదశ ఇప్పుడు వినియోగంలోకి రాగా, రెండవ దశ పనులు కొనసాగుతున్నాయి. మొత్తం 17 మెషీన్ల ద్వారా 868 మెగావాట్ల పంపింగ్‌ సామర్ధ్యం వుండటం మరో ప్రత్యేకత. మెషీన్ల సంఖ్య రీత్యా.. ఇంతపెద్ద పంపింగ్‌ కేంద్రం ఇంతవరకూ ఎక్కడా ఏర్పాటు కాలేదు.

‘మేఘా’ ప్రపంచంలోనే అతితక్కువ సమయంలో మేడిగడ్డ ఎత్తిపోతల కేంద్రాన్ని కాళేశ్వరం సమీపంలో కన్నెపల్లి గ్రామం వద్ద నిర్మించింది. ప్రపంచంలో పెద్ద ఎత్తిపోతల పథకాలుగా పరిగణించే కొలరాడో (అమెరికా), గ్రేట్‌ మ్యాన్‌మేడ్‌ వండర్‌ (లిబియా) పథకాలతో పాటు దేశంలోని హంద్రీ-నీవా, కల్వకుర్తి, ఏఎమ్‌ఆర్పీ, దేవాదుల మొదలైన పథకాలు పూర్తి కావడానికి ఏళ్ళు పట్టింది. కొన్ని పథకాలైతే రెండు, మూడు దశాబ్దాల సమయం పట్టింది. కానీ మేడిగడ్డ ఎత్తిపోతల కేంద్రాన్ని కేవలం ఏడాదిన్నర సమయంలోపే ‘మేఘా’ పూర్తి చేసింది.

రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా….

2018-19 ఆర్థిక సంత్సవరంలో ‘మేఘా’ ఈ ప్రాజెక్ట్‌లో 177 లక్షల ఘనపు మీటర్ల మట్టిపనిని రికార్డ్‌ సమయంలో పూర్తిచేసింది. ఇంత భారీ స్థాయిలో మట్టి పనిచేయడం ఓ రికార్డ్‌. అలాగే కాంక్రిట్‌ పనులు 8.62 లక్షల ఘనపు మీటర్ల మేర 22 నెలల కాలంలో పూర్తి చేసింది. అంటే రోజుకు సరాసరిన 1310 ఘనపు మీటర్ల కాంక్రీట్‌ పని జరిగింది.

ఇక మెకానికల్‌ పనుల్లో 18 నెలల కాలంలో 39700 టన్నుల పనిని పూర్తి చేశారు. అన్నింటికీ మించీ కేవలం రెండేళ్ల కాలంలో లింక్‌-1లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంప్‌ హౌజ్‌లోని 2 టీఎంసీ పనులు దాదాపుగా పూర్తిచేయడం అత్యంత అరుదైన విషయం. పంపింగ్‌ కేంద్రం నుంచి కాలువలోకి (డెలివరీ సిస్టర్న్‌) నీరు పైప్‌లైన్ల ద్వారా సరఫరా అవుతుంది.

ఇందుకు సంబంధించి 22 పైప్‌లైన్ల ఏర్పాటు పూర్తయ్యింది. మొత్తంగా 3 టీఎంసీ నీటిని తుది దశలో ఎత్తిపోసే విధంగా అవసరమైన 30 పైప్‌లైన్లకు గాను 22 పైప్‌లైన్లను ప్రస్తుతం 2 టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా ఏర్పాట్లు చేశారు.

భారీ విద్యుత్‌ వ్యవస్థ

కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ విద్యుత్‌ వ్యవస్థను ‘మేఘా’ ఏర్పాటు చేసింది. రోజుకు 3 టిఎంసీ నీటిని పంపు చేసేందుకు గరిష్టంగా 7152 మెగావాట్ల విద్యుత్‌ అవసరం.

మొదటిదశలో రెండు టిఎంసీల నీటినిసరఫరా చేసేందుకు 4992 మెగావాట్ల విద్యుత్‌ వ్యవస్థను ఏర్పాటు చేయగా.. ఇందులో 3057 మెగావాట్ల విద్యుత్‌ సరఫరా వ్యవస్థను, అందులో సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, ట్రాన్స్‌మిషన్‌ లైన్లను ‘మేఘా’ ఏర్పాటు చేసింది. తాగు, సాగునీటి అవసరా కోసం ఇంత పెద్ద విద్యుత్‌ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి.

First Published:  21 Jun 2019 3:18 AM GMT
Next Story