వివేకా హత్య కేసులో కొత్త దర్యాప్తు బృందం
లోక్ సభ మాజీ సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి బాబాయి వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్యపై విచారణకు ప్రభుత్వం కొత్త దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ముందు వై.ఎస్. వివేకానంద రెడ్డి పులివెందులలోని తన ఇంట్లో హత్యకు గురయ్యారు. ఆ సమయంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఈ హత్యపై సిట్ ను నియమించింది. సిట్ అధికారులు అప్పటి నుంచి హత్యకు గల కారణాలతో పాటు వివిధ కోణాలలో దర్యాప్తును చేపట్టారు. ఎన్నికలు […]
లోక్ సభ మాజీ సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి బాబాయి వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్యపై విచారణకు ప్రభుత్వం కొత్త దర్యాప్తు బృందాన్ని నియమించింది.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ముందు వై.ఎస్. వివేకానంద రెడ్డి పులివెందులలోని తన ఇంట్లో హత్యకు గురయ్యారు. ఆ సమయంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఈ హత్యపై సిట్ ను నియమించింది. సిట్ అధికారులు అప్పటి నుంచి హత్యకు గల కారణాలతో పాటు వివిధ కోణాలలో దర్యాప్తును చేపట్టారు.
ఎన్నికలు ముగిసి ఆంధ్రప్రదేశ్ లో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం వై.ఎస్.వివేకానంద రెడ్డి కుమార్తె అమరావతిలో ముఖ్యమంత్రిని కలిసి తన తండ్రి హత్యపై దర్యాప్తును వేగవంతం చేయాలని కోరారు.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడం, మంత్రివర్గ ప్రమాణ స్వీకారం, శాసనసభ సమావేశాలు వంటి కార్యక్రమాలు త్వరత్వరగా జరగడంతో ఈ కేసుపై ప్రభుత్వం ముందడుగు వేయలేదు. ఇప్పుడు పరిస్థితులు చక్కబడడంతో ప్రభుత్వం వివేకానంద రెడ్డి హత్యపై విచారణకు కొత్త దర్యాప్తు బృందాన్ని నియమించింది.
ఇప్పటి వరకూ ఈ హత్యపై దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులను విధుల నుంచి తప్పించింది ప్రభుత్వం. కొత్తగా నియమించిన దర్యాప్తు బృందంలో ముగ్గురు డిఎస్పీలు, ముగ్గురు సిఐలు, నలుగురు ఎస్ఐలు ఉన్నారు. వీరు బుధవారం సాయంత్రం పులివెందులలో తమ దర్యాప్తును ప్రారంభించారు.
ముందుగా హత్యకు గురైన వై.ఎస్.వివేకానంద రెడ్డి ఇంటి వాచ్ మెన్ రంగయ్యను ప్రశ్నించారు. హత్యకు ముందు వివేకానంద రెడ్డి ఎన్ని గంటలకు ఇంటికి వచ్చారు…? ఎప్పుడు నిద్రపోయారు…? ఇంటికి ఎవరైనా కొత్త వారు వచ్చారా…? హత్య గురించి ముందు ఎవరికి సమాచారం ఇచ్చారు..? కుటుంబసభ్యులు ఎప్పుడు వచ్చారు..? వంటి వివరాలను ఇంటి వాచ్ మెన్ రంగయ్యను అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ హత్యతో సంబంధం ఉన్న వారిని పట్టుకుంటామని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.