Telugu Global
NEWS

అయ్యో.... పాపం చంద్రబాబు!

ఆయనకు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాలించిన అనుభవం ఉంది. తొమ్మిది సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న అనుభవమూ ఆయనకే సొంతం. జాతీయ రాజకీయాలలో కూడా చక్రం తిప్పానని ఆయనే చెప్పుకుంటాడు. ఇన్ని విశేష గుణాలు ఉన్న ఆ నాయకుడే నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్ర విభజన తర్వాత విడిపోయిన ఆంధ్ర ప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా పని చేశారు చంద్రబాబు నాయుడు. ఇటీవల జరిగిన శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో […]

అయ్యో.... పాపం చంద్రబాబు!
X

ఆయనకు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాలించిన అనుభవం ఉంది. తొమ్మిది సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న అనుభవమూ ఆయనకే సొంతం. జాతీయ రాజకీయాలలో కూడా చక్రం తిప్పానని ఆయనే చెప్పుకుంటాడు. ఇన్ని విశేష గుణాలు ఉన్న ఆ నాయకుడే నారా చంద్రబాబు నాయుడు.

రాష్ట్ర విభజన తర్వాత విడిపోయిన ఆంధ్ర ప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా పని చేశారు చంద్రబాబు నాయుడు. ఇటీవల జరిగిన శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైంది. రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారిగా శాసనసభ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలను టీవీలలో చూసిన తెలుగు ప్రజలందరూ…. “అయ్యో పాపం చంద్రబాబు నాయుడు” అనే అనుకున్నారు.

గత ప్రభుత్వంలో ఆయన నేతృత్వంలో జరిగిన అనేకానేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు చేసిన అవినీతిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించడంతో శాసనసభ జరిగినన్ని రోజులూ చంద్రబాబు నాయుడు సభలో అన్యమనస్కంగానే ఉన్నారు.

తన లోపల ఉన్న ఆందోళన, ఆగ్రహాలను బయటపడకుండా చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నాలు ఆయన మొహాన్ని చూసిన వారికి తెలిసిపోయాయి. సంతృప్తిగా నవ్వడం అలవాటు లేని చంద్రబాబు నాయుడు తెచ్చి పెట్టుకున్న నవ్వుతో కాలం గడిపారు.

శాసన సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం జరిగిన స్పీకర్ ఎన్నిక, సభా సంప్రదాయాలను కాదని స్పీకర్ ను గౌరవించకపోవడం చంద్రబాబు నాయుడు పట్ల ప్రజల్లో మరింత వ్యతిరేకతను తీసుకు వచ్చిందంటున్నారు. బహుశా ఈ విషయాన్ని గమనించిన చంద్రబాబు నాయుడు సభ చివరి రోజున ఎన్నికైన డిప్యూటీ స్పీకర్ ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సహా వెళ్లి స్పీకర్ చైర్ లో కూర్చోబెట్టారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ మేలు అంటూ ఐదు సంవత్సరాల పాటు కాలయాపన చేసిన చంద్రబాబు నాయుడు… “ప్రత్యేక హోదాను మేం సాధించలేకపోయాం. మీరు సాధించేందుకు చేసే పోరాటానికి మేం సహకరిస్తాం” అంటూ తన చేతగానితనాన్ని తానే శాసనసభలో ప్రకటించుకున్నారు.

తెలుగుదేశం పార్టీకి 23 మంది సభ్యులున్నా శాసన సభలో మాట్లాడింది మాత్రం ఒకరిద్దరు సభ్యులే కావడం గమనార్హం. ప్రభుత్వం తరఫున గవర్నర్ చేసిన ప్రసంగం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్ని రకాలుగా మేలు చేసేదిగా ఉండడంతో ప్రతిపక్ష తెలుగుదేశం నాయకులకు, ముఖ్యంగా చంద్రబాబునాయుడికి దాన్ని విమర్శించే అవకాశం లేకుండా పోయింది.

మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి శాసనసభా సమావేశం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో ఓ చేదు జ్ఞాపకంగా…. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక గుర్తుండిపోయే ఘట్టంగా మిగిలిపోయిందని అంటున్నారు.

First Published:  18 Jun 2019 9:51 PM
Next Story