ప్రతిఫలంగా ఏం కావాలని జగన్ అడిగారు.... కానీ....
“నాకు పదవులపై ఆశ లేదు. ఎలాంటి పదవుల కోసం నేను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయలేదు. ఏదో వస్తుందని ప్రచారాలు చేసే మనిషిని కూడా కాదు” ఇవి నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలు. ఆదివారం నాడు ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోసాని కృష్ణ మురళి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఆ మాటకొస్తే తెలుగు ప్రజలకు ఎవరు మేలు చేస్తారో వారి పట్ల తాను అనుకూల ప్రచారం […]
“నాకు పదవులపై ఆశ లేదు. ఎలాంటి పదవుల కోసం నేను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయలేదు. ఏదో వస్తుందని ప్రచారాలు చేసే మనిషిని కూడా కాదు” ఇవి నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలు.
ఆదివారం నాడు ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోసాని కృష్ణ మురళి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఆ మాటకొస్తే తెలుగు ప్రజలకు ఎవరు మేలు చేస్తారో వారి పట్ల తాను అనుకూల ప్రచారం చేస్తానని పోసాని చెప్పారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంలో… తాను జగన్ ను కలిసానని, ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తానని చెప్పానని, అందుకు ప్రతిఫలంగా మీకు ఏ పదవి కావాలని జగన్ తనను అడిగారని పోసాని కృష్ణ మురళి చెప్పారు.
“రాజ్యసభ సభ్యత్వం కావాలా..? ఎమ్మెల్యే టికెట్ కావాలా..? పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా ఆశిస్తున్నారా..?” అని జగన్మోహన్ రెడ్డి తనను ప్రశ్నించారని, అయితే ప్రజలకు మేలు చేసే నాయకుడికి మాత్రమే ప్రచారం చేస్తానని చెప్పానని పోసాని స్పష్టం చేశారు.
తాను ఇప్పటి వరకు ఎందరో రాజకీయ నాయకులను చూసానని, ఇచ్చిన మాటకు కట్టుబడే నాయకులను ఇద్దరినే చూశానని ఆయన చెప్పారు.
“ఈ ఇద్దరిలో ఒకరు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి. రెండో వారు ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి. వీరిద్దరు ప్రజలకు ఏం చెప్పారో అదే చేస్తారు. అందుకే ఆ కుటుంబం పట్ల నాకు ఎంతో ప్రేమ, అభిమానం ఉంది” అని పోసాని కృష్ణమురళి స్పష్టం చేశారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అభివృద్ధి జరుగుతుందని తాను ప్రగాఢంగా నమ్మానని, తన నమ్మకాన్ని ప్రజలకు వివరించానని ఆయన తెలిపారు. తన విశ్వాసాన్ని, నమ్మకాలను ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వమ్ము చేయటం లేదని, ఆయన పాలన ఎంత అద్భుతంగా ఉందో గడచిన పది రోజులుగా తెలుగు ప్రజలకు తెలుస్తోందని పోసాని అన్నారు.
అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగాను, వారికి మేలు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారని పోసాని కితాబు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.