తెలుగు ప్రజలు కలిసి ఉండాలి.... రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి " మిథున్ రెడ్డి
“రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. తెలుగు ప్రజలు కలిసి ఉండాలి. ఇదే మా సిద్ధాంతం. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం తెలంగాణ లోక్ సభ సభ్యులతో కలిసి పోరాడతాం” అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ పక్షనేత మిథున్ రెడ్డి చెప్పారు. ఆదివారం ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మిథున్ రెడ్డి మాట్లాడుతూ సోమవారం నుంచి జరుగుతున్న లోక్ సభ సమావేశాలలో తమ పార్టీ ఎలా వ్యవహరిస్తుందో వివరించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తాము […]
“రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. తెలుగు ప్రజలు కలిసి ఉండాలి. ఇదే మా సిద్ధాంతం. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం తెలంగాణ లోక్ సభ సభ్యులతో కలిసి పోరాడతాం” అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ పక్షనేత మిథున్ రెడ్డి చెప్పారు.
ఆదివారం ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మిథున్ రెడ్డి మాట్లాడుతూ సోమవారం నుంచి జరుగుతున్న లోక్ సభ సమావేశాలలో తమ పార్టీ ఎలా వ్యవహరిస్తుందో వివరించారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తాము సహకరిస్తామంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటించడాన్ని మిథున్ రెడ్డి స్వాగతించారు. ఆంధ్రప్రదేశ్ లో విభజన సమస్యలతో పాటు ప్రత్యేక హోదా సాధించడం కోసం టిఆర్ఎస్ సభ్యుల మద్దతు కూడా కోరతామని ఆయన చెప్పారు. లోక్ సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 22 మంది సభ్యులు, తెలంగాణ రాష్ట్ర సమితికి తొమ్మిది మంది సభ్యులు ఉన్నారని, వీరంతా తెలుగు రాష్ట్రాల సమస్యలపై లోక్ సభలో ప్రస్తావిస్తారని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యేందుకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా మిథున్ రెడ్డి గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు నిరాకరించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోన్ రెడ్డి కలవడాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదని మిథున్ రెడ్డి అన్నారు.
“ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీయే కాదు రాహుల్ గాంధీ ఉన్నా.. మమతా బెనర్జీ ఉన్నా ముఖ్యమంత్రికి ఒక్కటే. వారిలో ఎవరు ప్రధాని హోదాలో రాష్ట్రానికి వచ్చినా ముఖ్యమంత్రి స్వాగతం పలుకుతారు” అని మిథున్ రెడ్డి అన్నారు.
వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో లాలూచి అయ్యిందని తెలుగుదేశం పార్టీ ప్రకటించడాన్ని మిథున్ రెడ్డి తప్పుపట్టారు.
“గడచిన ఐదేళ్లలో భారతీయ జనతా పార్టీతో స్నేహం చేసింది మేమా…? తెలుగుదేశం పార్టీయా..? ఇలాంటి ఆరోపణలతో మైనార్టీలను మాకు దూరం చేయాలనుకున్నారు. కానీ వారి కోరిక తీరలేదు” అని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తీసుకురావడమే లక్ష్యంగా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని మిథున్ రెడ్డి చెప్పారు.