ఏపీకి ప్రత్యేక హోదాను అడుగుతూనే ఉంటాం " సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని పదేపదే అడుగుతామని, తమ డిమాండ్ ను కేంద్రం అంగీకరించే వరకు వారి వెంట పడతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో విలేకరులతో అన్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శుక్రవారం నాడు ఢిల్లీ వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర హోంమంత్రి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాను ఢిల్లీలో కలిశారు. అరగంట సేపు జరిగిన వీరిద్దరి సమావేశంలో పలు అంశాలు చర్చకు […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని పదేపదే అడుగుతామని, తమ డిమాండ్ ను కేంద్రం అంగీకరించే వరకు వారి వెంట పడతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో విలేకరులతో అన్నారు.
వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శుక్రవారం నాడు ఢిల్లీ వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర హోంమంత్రి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాను ఢిల్లీలో కలిశారు. అరగంట సేపు జరిగిన వీరిద్దరి సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను త్వరగా నెరవేర్చాలని సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కోరారు. వీరిద్దరి సమావేశం అనంతరం ఈ భేటీపై జగన్ మోహన్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కుంటుపడిందని, అనేక అంశాలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయని హోం మంత్రి దృష్టికి తీసుకు వచ్చినట్లు చెప్పారు.
శనివారం జరుగనున్న నీతి అయోగ్ సమావేశంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్రానికి ప్రత్యేక హోదాపై ప్రస్తావిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు.
ఈ సమావేశంలో వర్షపు నీటి పరిరక్షణ, వ్యవసాయ రంగంలో సంస్కరణలు, మావోయిస్టు ప్రభావిత జిల్లాలలో తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై చర్చిస్తారు.
నీతి అయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతుంది. లోక్ సభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారని వస్తున్న వార్తలను జగన్మోహన్ రెడ్డి ఖండించారు. “ఆ వార్తలన్నీ అవాస్తవం. డిప్యూటీ స్పీకర్ పదవిపై మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన వాళ్ళల్లో సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు విజయ సాయి రెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి కూడా ఉన్నారు.