టిఆర్ఎస్ లోక్ సభ నేతగా 'నామ'..!
లోక్ సభలో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకునిగా నామా నాగేశ్వరరావు ఎంపికయ్యారు. రెండు సార్లు లోక్ సభకు ఎన్నికైన నామా నాగేశ్వర రావు ఈ రెండు పర్యాయాలు కూడా లోక్ సభ నాయకుడిగా ఎన్నికవడం విశేషం. ఇక టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావును ఎన్నుకున్నారు. లోక్ సభ ఉపనేతలుగా కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపికయ్యారు. రాజ్యసభలో పార్టీ ఉప నేతగా బండ ప్రకాష్, విప్ గా సంతోష్ కుమార్ లను ఎంపిక చేసింది […]
లోక్ సభలో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకునిగా నామా నాగేశ్వరరావు ఎంపికయ్యారు. రెండు సార్లు లోక్ సభకు ఎన్నికైన నామా నాగేశ్వర రావు ఈ రెండు పర్యాయాలు కూడా లోక్ సభ నాయకుడిగా ఎన్నికవడం విశేషం.
ఇక టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావును ఎన్నుకున్నారు. లోక్ సభ ఉపనేతలుగా కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపికయ్యారు. రాజ్యసభలో పార్టీ ఉప నేతగా బండ ప్రకాష్, విప్ గా సంతోష్ కుమార్ లను ఎంపిక
చేసింది తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్టానం.
గురువారం ప్రగతి భవన్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి లోక్ సభ, రాజ్యసభ సభ్యుల సమావేశంలో పార్టీ అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎప్పటిలాగే అధ్యక్షుడి నిర్ణయానికి లోక్ సభ సభ్యులు ఎవరూ అడ్డు చెప్పకపోవడం
విశేషం. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలలో తెలంగాణలో ఉన్న 17 లోక్ సభ స్థానాల్లో 16 గెలుచుకుంటామని, ఒక స్థానంలో మిత్రపక్షం ఎంఐఎం గెలుస్తుందని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు పదేపదే ప్రకటించారు.
అయితే అందుకు విరుద్ధంగా లోక్ సభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి కేవలం తొమ్మిది స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఈ విజయం పార్టీని ఇరుకున పెట్టింది. గత లోక్ సభలో తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి లోక్ సభ నాయకుడైన వినోద్ కుమార్ కూడా ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.
ఆయనతో పాటు ముఖ్యమంత్రి కుమార్తె కల్వకుంట్ల కవిత కూడా నిజామాబాద్ లో ఓటమి పాలయ్యారు. ఒకవేళ వీరిద్దరిలో ఎవరు విజయం సాధిస్తే వారు లోక్ సభ నేతగా నియమితులవుతారని వార్తలు వచ్చాయి. వీరిద్దరూ ఓటమి పాలు కావడంతో నాయకుడి ఛాన్స్ నామా నాగేశ్వర రావుకు దక్కింది.
లోక్ సభ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నామా నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర సమితి తీర్థం పుచ్చుకున్నారు. దీంతో అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కాదని, నామా నాగేశ్వరరావుకు టికెట్ ఇచ్చారు పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు.
శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ఘోర పరాజయాన్ని చవిచూసిన అధికార తెలంగాణ రాష్ట్ర సమితి లోక్ సభ ఎన్నికలలో మాత్రం ఖమ్మం స్థానాన్ని కైవసం చేసుకుంది. అక్కడి నుంచి గెలిచిన నామా నాగేశ్వరరావు ఇప్పుడు పార్టీ లోక్ సభ నాయకుడిగా ఎన్నికయ్యారు.
పార్టీ నుంచి లోక్ సభ సభ్యునిగా ఎన్నికైన తొమ్మిది మందిలో నామా నాగేశ్వరరావు సీనియర్. గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన లోక్ సభకు ఎన్నికయ్యారు. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని నామా నాగేశ్వరరావును లోక్ సభలో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడిగా ఎంపిక చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.