నామినేటెడ్ పదవులు కూడా త్వరలోనే....
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పంట పండుతోంది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఆయన శరవేగంగా అన్ని పనులు చక్క పెడుతున్నారు. క్షణం కూడా ఆలస్యం లేకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేస్తున్నారు. విడతలు విడతలుగా మంత్రివర్గాన్ని విస్తరిస్తూ పార్టీ శాసనసభ్యులలో అసహనాన్ని, నిరీక్షణను, అగ్రహాన్నితెప్పించిన పాత పాలకుల విధానాలకు స్వస్తి చెబుతూ ఒకేసారిగా 25 మంది సభ్యులతో కేబినెట్ ను ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి. ఇక సచివాలయానికి వచ్చిన ముఖ్యమంత్రి […]
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పంట పండుతోంది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఆయన శరవేగంగా అన్ని పనులు చక్క పెడుతున్నారు.
క్షణం కూడా ఆలస్యం లేకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేస్తున్నారు. విడతలు విడతలుగా మంత్రివర్గాన్ని విస్తరిస్తూ పార్టీ శాసనసభ్యులలో అసహనాన్ని, నిరీక్షణను, అగ్రహాన్నితెప్పించిన పాత పాలకుల విధానాలకు స్వస్తి చెబుతూ ఒకేసారిగా 25 మంది సభ్యులతో కేబినెట్ ను ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి.
ఇక సచివాలయానికి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ సంఘాల నాయకులు తోనే కాదు కొందరు ఉద్యోగులతో కూడా నేరుగా మాట్లాడారు. ఉద్యోగులతో తాను స్నేహంగా ఉంటానని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడమని స్పష్టం చేశారు. దీంతో ఉద్యోగుల్లో “మంచి ముఖ్యమంత్రి వచ్చారు” అనే భావన నెలకొంది.
మంత్రివర్గ సహచరుల ప్రమాణ స్వీకారానికి ముందు, ఆ తర్వాత కూడా మంత్రులతో సమావేశమయ్యారు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించడంతో పాటు అవినీతి రహిత పాలన ఇవ్వాలంటూ మంత్రులకు సూచించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల్లోనే దూకుడుగా వ్యవహరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి.
ఇదే దూకుడును ముందు ముందు కొనసాగిస్తారని, ఇందులో భాగంగా వివిధ కార్పొరేషన్లకు చైర్మన్ పదవులతో పాటు ఇతర నామినేటెడ్ పదవులను కూడా భర్తీ చేస్తారని పార్టీ నాయకులు భావిస్తున్నారు.
ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలితో పాటు ఆంధ్రప్రదేశ్ లోని ఇతర దేవాలయాల పాలక మండళ్లను రద్దు చేయడం, పాలకమండలి సభ్యుల స్థానంలో కొత్తవారిని నియమిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పాదయాత్రలో భాగంగా వివిధ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ లు ఏర్పాటు చేస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. తాను వాగ్దానం చేసిన కులాల కార్పొరేషన్లను ఏర్పాటు చేయడంతో పాటు, వాటికి నిధులను కూడా ఏర్పాటు చేసే పనిని చేపడతారని పార్టీలో చర్చ జరుగుతోంది.
మంత్రి పదవులు రాని కొందరు సీనియర్ నాయకులు నామినేటెడ్ పదవులు వచ్చే అవకాశం ఉందని ఆశలు పెట్టుకున్నారు. వారితో పాటు పార్టీ విజయం కోసం పనిచేసిన వారందరికీ పదవులు ఇస్తారని, వీటి ద్వారా పార్టీలో అందరినీ సంతృప్తి పరుస్తారు అనే ప్రచారం జరుగుతోంది.
గ్రామ స్థాయి కార్యకర్తలలో చదువుకున్న వారు ఎవరైనా ఉంటే వారికి గ్రామ కార్యదర్శుల పదవులు ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అక్టోబర్ 2 తేదీ నాటికి ఈ సనులన్నీపూర్తి చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.