Telugu Global
NEWS

'టీం జగన్'.... టార్గెట్ అదే!

వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మంత్రి మండలికి మీడియా ‘టీం జగన్’ అని పేరు పెట్టేసింది. ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసినప్పటి నుంచి జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు దాదాపుగా సంచలనాలనే సృష్టిస్తున్నాయి. మంత్రి మండలి కూర్పు కూడా అలాంటిదే. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ముందు శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటు చేయడం, అందులోనే కాబోయే మంత్రుల పేర్లను ప్రకటించడం కూడా విశేషమే. సీనియర్లుగా ఉన్నప్పటికీ మంత్రి పదవులు ఇవ్వలేకపోతున్నామనే విషయాన్ని […]

టీం జగన్.... టార్గెట్ అదే!
X

వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మంత్రి మండలికి మీడియా ‘టీం జగన్’ అని పేరు పెట్టేసింది. ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసినప్పటి నుంచి జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు దాదాపుగా సంచలనాలనే సృష్టిస్తున్నాయి. మంత్రి మండలి కూర్పు కూడా అలాంటిదే.

చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ముందు శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటు చేయడం, అందులోనే కాబోయే మంత్రుల పేర్లను ప్రకటించడం కూడా విశేషమే. సీనియర్లుగా ఉన్నప్పటికీ మంత్రి పదవులు ఇవ్వలేకపోతున్నామనే విషయాన్ని కూడా ముందుగానే ఫోన్ ద్వారా వారికి తెలియజేయడం మరో విశేషం.

మంత్రివర్గ కూర్పులో సామాజిక సమతూకాన్ని పాటించడం.. ఐదుగురికి ఉప ముఖ్మమంత్రి హోదా ఇవ్వడంపైనా ప్రశంసలు వ్యక్తమయ్యాయి. ఎక్కడా చిన్న చిన్న వ్యాఖ్యానాలు కూడా వినిపించలేదు. పాతిక మంది మంత్రులు ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయడంతో అందరూ ‘టీం జగన్’ అని పిలవడం ప్రారంభించారు.

మంత్రివర్గంలో జగన్ విధేయతకు, విశ్వసనీయతకు, సమర్థతకు పట్టం కట్టినట్టు స్పష్టంగా అర్థం అవుతోందని పరిశీకులు చెబుతున్నారు. చంద్రబాబు మంత్రివర్గంలో గిరిజన, మైనారిటీ వర్గాలకు తొలుత ప్రాతినిధ్యమే లభించలేదు. కానీ, జగన్ ఆ రెండు వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వడమే కాకుండా ఉప ముఖ్యమంత్రి హోదా కూడా ఇచ్చారు.

రెండున్నర ఏళ్ల తరువాత 90 శాతం మంది మంత్రులను మారుస్తామనడం కూడా గొప్ప విషయమేనని అంటున్నారు. నిజానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు తాము ఏం చేయబోతున్నామో చివరి క్షణం వరకు ఎవ్వరికీ తెలియనివ్వరు. జగన్ మాత్రం అన్ని విషయాలను ముందుగానే వెల్లడిస్తున్నారు. తాను చేయదలచుకున్నదేమిటో కూడా స్పష్టం చేస్తున్నారు. తన ప్రాధాన్యాలేమిటో కూడా వివరిస్తున్నారు.

ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఇక మంత్రులు ఎలా పని చేస్తారు అనే అంశం మీద ప్రభుత్వం భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదని చెబుతున్నారు. జగన్ ముందే చెప్పినట్టుగా టార్గెట్ 2024 దిశగా ప్రభుత్వం పని తీరు ఉంటే ప్రజాభిమానం చెక్కు చెదరకుండా ఉంటుందని అంటున్నారు.

పాతిక మందిలో తొమ్మిది మంది మంత్రులు అనుభవం ఉన్నవారే… వాళ్లు బాగా పనిచేస్తే జగన్ అనుకున్న లక్ష్యం నేరవేరుతుందని అంటున్నారు.

First Published:  9 Jun 2019 7:36 AM IST
Next Story