Telugu Global
NEWS

టిడిపి మీడియా ఈ కుంభకోణాలపై మాట్లాడదా?

టిడిపి మీడియా ఈ కుంభకోణాలపై మాట్లాడదా… అంటూ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస రావు రాసిన కథనం చాలా ఆసక్తికరంగా ఉంది…. తెలుగుదేశం సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కంపెనీలు చేసిన మోసాలకు సంబందించిన వార్తలను చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇలా కూడా మోసాలు చేయవచ్చా? ఆర్దిక నేరాలకు పాల్పడవచ్చా అన్న దిగ్బ్రాంతి కలుగుతుంది. అనేక బోగస్ కంపెనీలు అనండి,షెల్ కంపెనీ లు అనండి..స్థాపించడం, వాటి ద్వారా కార్యకలాపాలు జరిగినట్లు చూపించడం, […]

టిడిపి మీడియా ఈ కుంభకోణాలపై మాట్లాడదా?
X

టిడిపి మీడియా ఈ కుంభకోణాలపై మాట్లాడదా… అంటూ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస రావు రాసిన కథనం చాలా ఆసక్తికరంగా ఉంది….

తెలుగుదేశం సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కంపెనీలు చేసిన మోసాలకు సంబందించిన వార్తలను చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇలా కూడా మోసాలు చేయవచ్చా? ఆర్దిక నేరాలకు పాల్పడవచ్చా అన్న దిగ్బ్రాంతి కలుగుతుంది. అనేక బోగస్ కంపెనీలు అనండి,షెల్ కంపెనీ లు అనండి..స్థాపించడం, వాటి ద్వారా కార్యకలాపాలు జరిగినట్లు చూపించడం, ఇన్ వాయిస్ లు రెయిజ్ చేయడం, వాటి ఆదారంగా జిఎస్టి రాయితీలు పొందడం, బ్యాంకుల నుంచి భారీగా అప్పులు పొందడం, వాటిని ఇతర బోగస్ కంపెనీలకు మళ్లించడం వంటివి ఇప్పుడు సిబిఐ, ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టరేట్ ల పరిశోధనలలో వెల్లడవుతున్న తీరు గమనిస్తే అంతా విస్తు పోవల్సిందే.

సుజనా చౌదరి తెలుగుదేశం నేత అయ్యాడు కాబట్టి ఇంతకాలం ఎలాంటి ఇబ్బంది లేకుండా కధ నడిపించగలిగారు. కేంద్ర మంత్రి కాగలిగారు. టిడిపి పార్లమెంటరీ పార్టీ నేత అయ్యారు. వేల కోట్ల రుణాలు కావాలని ఎగవేసినట్లు, పోర్జరీ, ఇతర నేరాభియోగాలకు గురి అయినా,ఆయనను టిడిపి పక్షాన రాజ్యసభ లో నేతగా సుజనా ను టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారంటే వారి మద్య బందం ఎంత ధృఢమైనదో అర్దం చేసుకోవచ్చు.

అదే ఏ ఇతర పార్టీకి సంబందించినవారిపై కేసులు వస్తే ఇల్లెక్కి కూసే టిడిపి మీడియా ఇప్పుడు అసలు ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తోంది.ఇవసలు ఆర్దిక నేరాలు కానట్లు ఆ మీడియా భావిస్తోందని అనుకోవాలి. గతంలో కాంగ్రెస్ హయాంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత , ప్రస్తుతం ఎపి ముఖ్యమంత్రి జగన్ స్థాపించిన కంపెనీలలో పెట్టుబడులు పెట్టడమే నేరం అయినట్లు చిత్రీకరించి ఎన్నో కధనాలు వడ్డీ వార్చిన టిడిపి మీడియాకు ఇప్పుడు ఈ మోసాలు కనిపించడం లేదా?

ఒకప్పుడు టిడిపిలోని ఒక వర్గం మీడియా సుజనాకు ఎమ్.పి సీటు రాకూడదని , సి.ఎమ.రమేష్ కు ఇప్పించడం కోసం అప్పట్లో కొన్ని కదనాలు ఇచ్చింది. కాని ఆ తర్వాత కాలంలో రాజీ కుదిరిపోయినట్లుంది. వాటి ఊసు ఎత్తలేదు.టైమ్స్ ఆఫ్ ఇండియాలో సుజనా గ్రూప్ నకిలీ కంపెనీల ఆపరేషన్ తీరుపై కధనం వచ్చింది. అందులో అసలు వస్తువుల సరఫరా ఉండదు,తీసుకోవడం ఉండదు. కాని ఇన్ వాయిస్ లు మాత్రం సృష్టిస్తారు. అశోక్ లేలాండ్ లారీ లో 22 మెట్రిక్ టన్నుల లోడ్ మాత్రమే పట్టే వీలుంటుంది.కాని ఏకంగా నలభైనాలుగు టన్నులు సరఫరా చేసినట్లు చూపారట. అలాగే ఐచర్ కంపెనీ ట్రక్ లో తొమ్మిదిన్నర టన్నుల లోడ్ కు అవకాశం ఉంటే దాని ద్వారా కూడా నలభై ఐదు టన్నుల లోడ్ తీసుకువెళ్లినట్లు చూపించారట.ఇవన్ని సిబిఐ,జిఎస్టి అదికారుల దాడులలో వెలుగులోకి వచ్చాయి.

సుజనా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయన జోలికి ఎవరూ వెళ్లలేదు. ఆ సమయంలో కూడా ఇలాంటి మోసాలు కొనసాగాయని ఈ దర్యాప్తులలో తేలుతోంది.ఆంద్ర బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఇతర బ్యాంకుల నుంచి సుమారు 370 కోట్లకు పైగా రుణాలు పొంది దొడ్డిదారిన నకిలీ కంపెనీలకు మళ్లించారని చెబతున్నారు. నిజానికి మామూలు వ్యక్తులకు ఈ మోసాలు ఊహకు కూడా అందవు. అయితే రుణాల ఎగవేతతో ఈ విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి.అంతేకాక కేంద్రం నుంచి టిడిపి తప్పుకున్నాక ఈ విషయాలన్ని బటయకు వచ్చాయి. అయితే దీనిని కూడా కక్ష సాధింపుగా టిడిపి ప్రచారం చేయాలని అనుకున్నా, అది నిలిచే పరిస్థితి లేక ఈ విషయాల జోలికి వెళ్లలేదు.

నిజానికి సుజనా చౌదరిపై ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నా,చంద్రబాబు నాయుడు కేవలం అర్ధిక లావాదేవీల కారణంగానే ఆయనకు ఎమ్.పి సీటు ఇవ్వడం,కేంద్రంలో మంత్రి పదవి ఇప్పించడం చేశారని ప్రచారం ఉంది.2014 ఎన్నికల సమయంలో సుజనా వందల కోట్లు తీసుకు వచ్చి టిడిపి కోసం ఖర్చు చేశారని కూడా రాజకీయవర్గాలు చెబుతుంటాయి. ఆ తర్వాత పార్టీ అదికారంలోకి వచ్చాక ప్రధాని మోడీ క్యాబినెట్ లో మంంత్రి అవడంపై కూడా విమర్శలు వచ్చాయి. కాని మితపక్షం కనుక వారి ఇష్టం ప్రకారం మంత్రులను పెట్టుకోవచ్చని అప్పట్లో బిజెపి వాదించేది. ఇప్పుడు ఇన్ని విషయాలు బయటకు వస్తున్నా, చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదన్న విమర్శ సహజంగానే వస్తుంది.ఆయన బలహీనత ఆయనది.

సుజనా తనకు ఈ కంపెనీలతో సంబందం లేదని తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సిబిఐ విచారణకు కూడా వెళ్లకుండా దాటవేస్తున్నారు. కేంద్ర స్తాయిలో, రాష్ట్ర స్థాయిలో కొందరు కీలక వ్యక్తుల మద్దతు పొందడానికి వారికి సంబందించిన వ్యక్తులకు పెద్ద జీతాలు ఇచ్చి, వారిని కూడా ఈ కుంభకోణాలలోకి లాగడం సుజనా నేర్పరితనం అనుకోవాలి.అందులో భాగంగానే సిబిఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు కుమారుడు కూడా ఇరుక్కున్నారని కొందరు చెబుతారు.

ఏది ఏమైనా విజయ్ మాల్యా మాదిరి సుజనా కూడా వేల కోట్ల రుణాలను బ్యాంకులకు ఎగవేశారని కదనాలు ఇప్పటికే పెద్ద ఎత్తున వచ్చాయి. వాటికి తోడు జిఎస్టి మోసం, దాని ఆధారంగా బ్యాంకుల నుంచి మళ్లీ రుణాలు పొందడం, తిరిగి వాటిని నకిలీ కంపెనీలకు మళ్లించడం ..ఇలాంటి వాటిని కచ్చితంగా నిరోదించి, వాటిలో నిజాలను నిర్దారించి బాద్యులకు శిక్షలు పడేలా చేయలేకపోతే, పారిశ్రామికవేత్తలు ఎక్కువ మంది ఇదే మోసం బెటర్ అనుకునే పరిస్థితి వస్తుంది.

భారత్ లో ఈ తరహా మోసాలు గత దశాబ్దకాలంలో చాలా జరిగాయి.అందుకే లక్షల కోట్ల మేర బ్యాంకులు నష్టపోయే పరిస్థితి వచ్చింది.అదంతా ప్రజల డబ్బు. పరిశ్రమలు పెట్టి నష్టపోవడం వేరు..పరిశ్రమలు పెట్టకుండానే, ఉత్పత్తులు చేయకుండానే, సరుకులు కొనకొండానే, సరఫరా చేయకుండానే అన్నీ చేసినట్లు చూపించి వందల కోట్ల రూపాయల మేర మోసాలు చేయడం వేరు. దానికి రాజకీయాన్ని అడ్డుపెట్టుకుని నెట్టుకు రాగలుగుతామని అనుకుంటున్నవారికి గట్టి గుణపాఠం చెప్పకపోతే దేశ ఆర్ధిక వ్యవస్థకే ప్రమాదం. మరి తెలుగుదేశం పార్టీ ఇలాంటి కుంభకోణాలను,మోసాలను సమర్దిస్తుందా?

First Published:  9 Jun 2019 7:52 AM IST
Next Story